రంగు రంగుల హోళి.. వసంతపు రంగేళి!

భారతీయుల సంప్రదాయంలో బోలెడు పండుగలు ఉన్నాయి. వీటిలో కొన్ని ఋతువు మార్పుకు అనుగుణంగా జరిగేవి అయితే.. మరికొన్ని వివిధ కాలాలలో జరిగిన కొన్ని సంఘటనలకు గుర్తుగా జరుపుకునేవి. కొన్ని ప్రాంతీయత ఆధారంగా జరుపుకునేవి అయితే మరికొన్ని యావత్ భారతదేశం అంతా జరుకునేవి. ఇలా భారతీయులు అందరూ  దేశం మొత్తం జరుపుకునే వేడుకల్లో హోళి ఒకటి. రంగుల పండగ అయిన ఈ హోళి వెనుక చాలా కథనాలు ఉన్నాయి. ముఖ్యంగా శ్రీకృష్ణుడికి, హోళి పూర్ణిమకు అవినాభావ సంబంధం ఎంతో ఉంది. అలాగే హోళిని దేశవ్యాప్తంగా జరుపుకున్నా ఒక్కో ప్రాంతంలో ఒకో విధంగా జరుపుకుంటారు. ముఖ్యంగా పిల్లలు పెద్దలనే తేడా లేకుండా హోళి పండుగ జరుపుకోవడం చాలా చోట్ల కనిపిస్తుంది. 

హోళి వెనుక చాలా కథలున్నాయ్!

హోళీ పూర్ణిమను పలుచోట్ల కామ పున్నమి అని కూడా పిలుస్తారు. అంతే కాదు పౌర్ణమికి ముందురోజు కామదహనం కూడా నిర్వహిస్తారు. ఈ కామ దహనం వెనుక ఓ కథ ఉంది. తపస్సు చేసుకుంటున్న శివుడి మీద మన్మధ బాణాలు ప్రయోగిస్తాడు మన్మథుడు. దీనికి కోపం చెందిన శివుడు మన్మధుడిని తన మూడవ కంటితో భస్మం చేస్తాడు. తరువాత మన్మధుడి భార్య వేడుకోగా అతనికి పూర్వ రూపం ప్రసాదిస్తాడు. దీన్ని పురస్కరించుకుని వసంత మాసంలో వచ్చే పూర్ణిమను కామ పూర్ణిమగా జరుపుకుంటారు. మన్మధుడిని కాముడు అని పిలవడం అందరికీ తెలిసిందే..

హోళీ.. హోళిక..

హోళిక ఒక రాక్షసి. ఈమె హిరణ్యకశిపుడి చెల్లెలు. తన అన్నయ్య హిరణ్యకశిపుడు నరసింహ అవతారం చేతిలో మరణించినందుకు ప్రహ్లాదుని మీద ఎనలేని ద్వేషం పెంచుకుంది. ఎలాగైనా ప్రహ్లాదుని చంపాలని మంటల్లోకి తోసింది. కానీ నారాయణుడి అభయం ఉన్న ప్రహ్లాదునికి ఏమి కాలేదు. హోళిక ఆ మంటల్లో దహనమైపోతుంది. చెడు మీద మంచి సాధించిన విజయం ఇదని, హోళిక చనిపోయిన సందర్భంగా హోళికా దహనం చేస్తారని చెబుతారు. 

బాల కృష్ణుడు..
 

హోళి పండుగ రోజే.. బాలకృష్ణుడిని ఉయ్యాలలో వేసినట్టు చెబుతారు. అందుకే డోలాయాత్ర పేరుతో కృష్ణుడిని ఉయ్యాలలో వేసి ఊపుతారు. కన్నయ్యతో పాటు రాధను కూడా జతగా ఉంచుతారు. 

ఇక హోళిని వివిధ ప్రాంతాల్లో విభిన్న రకాలుగా చేసుకుంటారు. హోళి అంటే ఉదయం నుండి రంగులు పట్టుకుని వీధులంతా  హంగామా చేయడమే మనకు తెలుసు. కానీ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఆ శ్రీకృష్ణుడి నివాసమైన మధురలో చాలా ప్రత్యేకంగా హోళి జరుగుతుంది. 

ఇక్కడ హోళి పండుగ వీధుల్లో జరుపుకోవడం ఎక్కడా కనిపించదు. పూర్తిగా దేవాలయాల్లో మాత్రమే హోళి జరుపుకుంటారు. అందుకు అనుగుణంగా ప్రజలందరూ దేవాలయాలకు బారులు తీరుతారు. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడు తమతో కలిసి రంగులు చల్లుకుంటూ, హోళి ఆడతాడనే నమ్మకం అక్కడి ప్రజల్లో ఉంది. ముఖ్యంగా బృందావనంలో హోళి సంబరాలు అంబరాన్నంటుతాయి. అంతే కాదు ఇక్కడి సంప్రదాయంలో భాగంలో ఆడవారు మగవారికి కర్రలతో కొడతారు. ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు, మొత్తం 16 రోజుల పాటు హోళి సంబరాలు జరుగుతాయి. ఆ ఇంద్రధనస్సు వచ్చి మధుర, బృందవనాలలో వాలిందా అన్నట్టు అక్కడ రంగుల మయం అందరినీ మాయ చేస్తుంది. ఫలితంగా హోళి పండుగ రోజు ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాలకు అదనపు పని పెడతారు, మరికొందరు తమలో ఉన్న ట్యాలెంట్ ను ప్రదర్శిస్తారు. ఇలా హోళి సందడి దేశమంతా వెల్లివిరుస్తుంది.

                                      ◆నిశ్శబ్ద.