భారతీయ మహిళకు గౌరవమెంత?

మహిళలు భార్యగా, తల్లిగా నిర్వహించే బాధ్యతలు ఎంతో విలువైనవి.. బాలచంద్రునికి వీరతిలకం దిద్దిన మగువ మాంచాలను, భరతజాతికి ఛత్రపతిని ప్రసాదించిన మహారాజ్ఞి జిజాబాయిని చరిత్ర ఎన్నటికీ మరచిపోదు. కుటుంబానికి కేంద్రబిందువుగా భర్తపై, బిడ్డలపై స్త్రీ ప్రభావం గణనీయమైనది. "నా జీవితంలో ఇద్దరు దయామయుల రుణం ఎన్నటికీ తీర్చుకోలేనిది. అనురాగాన్ని, ఆదర్శాల్ని గోరుముద్దలుగా కలిపి తినిపించిన మా అమ్మ ఒకరు; చేతి బంగారు గాజుల్ని అమ్మి నా పై చదువులకు డబ్బు కట్టిన మా అక్క ఒకరు... నేను సాధించిన విజయాలన్నీ వారి పాదాల వద్ద వినమ్రంగా అర్పిస్తాను" అంటారు భారతరత్న అబ్ధుల్కలామ్. అందుకే ఇంటిని నందనంగా తీర్చిదిద్దినా, నరకంలా మార్చినా కారణం ఇల్లాలే. 

మగవారూ మారాలి...

ఇంటినీ, ఇంటి పేరునూ వదలి అర్థాంగిగా తమ ఇంట అడుగుపెట్టిన మగువ పట్ల మగవారు కూడా ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. సహధర్మచారిణిగా ఆదరించాలి. భార్య అంటే తమ అసహనాన్ని, ఆవేశాన్ని భరించే బానిసగా భావించటం తగదు. సంపాదన ఒక్కటే గొప్పతనానికి గీటురాయి కాదు. కుటుంబ నిర్వహణ, ఆలనాపాలనా... ఇవన్నీ నిజంగా స్త్రీమూర్తి కార్యపటిమకు ప్రతీకలే. అతివలు చేసే ఇంటి పనులను చులకనగా చూడటం పురుషులు మానుకోవాలి. తనభార్య సీతలా ఉండాలని, పరాయి స్త్రీ మాత్రం సినిమాతారలా పలకరించాలనుకునే వికృత స్వభావాల నుంచి పురుషులు సంస్కారవంతులుగా ఎదగాలి. సప్తపది నడిచిన భర్తే భార్యను గౌరవించకపోతే ఇక సంతానం ఏం గౌరవిస్తుంది! 

మేడిపండు మన సమాజం... 

ఇటీవల ప్రపంచవ్యాప్తంగా స్త్రీని గౌరవించే విధానంపై పరిశోధనలు చేస్తే ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ప్రపంచం మొత్తంలో మహిళలను గౌరవించడంలో స్కాండినేవియన్ దేశాలు భౌగోళికంగా చిన్నవైనా ముందువరుసలో ఉన్నాయి. అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యా వెనుకవరుసలో నిలిచాయి. ఇక 'యత్రనార్యస్తు పూజ్యంతే తత్ర రమంతే దేవతాః' అంటూ ఉపదేశాలు వల్లించే భారతీయులు కూడా చివరిస్థానంలో ఉన్నారు. మేడిపండు మనస్తత్వం గల వ్యక్తులతో నిండివున్న మన సమాజం తలదించుకోవాల్సిన కఠోర వాస్తవమిది.

భారతీయ మహిళే ఫస్టు..

భారతనారీమణుల సాంప్రదాయిక జీవనశైలికి ప్రపంచదేశాలే నీరాజనాలు పలుకుతున్నాయి. అస్తిత్వానికి, అపరిమిత స్వాతంత్ర్యానికి భేదం తెలియని పాశ్చాత్య మహిళాలోకం స్త్రీవాదం పేరుతో నేలవిడిచి సాముచేసింది. ఏకంగా సామాజిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసుకుంది. భారతీయ మహిళలు మాత్రం తమ అస్థిత్వాన్ని కాపాడుకుంటూ సమాజంలో గుర్తింపు తెచ్చుకుంటూ సాగుతున్నారు.  భారతీయ మహిళలకు గుర్తింపు కాదు గౌరవం కావాలిప్పుడు. అది కూడా బయటకు పొగుడుతూ వెన్నుపోటు పొడిచేది కాదు.. మహిళను తనను తానుగా గుర్తించే గౌరవం కావాలి.

                                       ◆నిశ్శబ్ద.