తెలంగాణ సర్కార్ పై హైకోర్టు సీరియస్
posted on Jun 8, 2020 5:14PM
కరోనా పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా పరీక్షలపై తమ ఆదేశాలు అమలు చేయడం లేదని హైకోర్టు మండిపడింది. ఆదేశాలు అమలు కాకపోతే వైద్య ఆరోగ్యశాఖ అధికారులపై ధిక్కరణ చర్యలు చేపడతామని, వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి, ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ను బాధ్యుల్ని చేస్తామని హెచ్చరించింది. ఆస్పత్రుల్లో మరణిస్తే మృతదేహాలకూ పరీక్షలు చేయాలన్న ఆదేశాలు కూడా అమలు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.
అయితే, హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశామని, విచారణ జరగాల్సి ఉందని ఏజీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. సుప్రీంకోర్టులో విచారణ జరిగే వరకు హైకోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది.
ప్రజలకు కరోనా ర్యాండమ్ టెస్టులు చేయడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తగినంత రక్షణ కిట్లు సరఫరా చేయనందుకే వైద్యులకు కరోనా సోకిందని అభిప్రాయపడింది. మీడియా బులెటిన్లలో తప్పుడు లెక్కలు ఇస్తే కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని హెచ్చరించిన హైకోర్టు.. వాస్తవాలు తెలియకుంటే ప్రజలకు కరోనా తీవ్రత ఎలా తెలుస్తుందని ప్రశ్నించింది. ఈ నెల 17లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని వైద్యారోగ్యశాఖను హైకోర్టు ఆదేశించింది.