జగన్ సర్కారుకు మరో షాక్... జీవో 63ను కొట్టేసిన హైకోర్టు
posted on Sep 24, 2019 3:55PM

జగన్ ప్రభుత్వానికి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విద్యుత్ ఒప్పందాలపై పునసమీక్ష వద్దంటూ ఒకవైపు కేంద్రం, మరోవైపు నిపుణులు హెచ్చరించినా మొండిగా జీవో 63ను జారీ చేసిన చేసిన వైసీపీ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు మొట్టికాయలు వేసింది. పీపీఏల పునసమీక్ష కోసం ఉన్నతస్థాయి కమిటీని నియమిస్తూ జగన్ ప్రభుత్వం ఇచ్చిన జీవో 63ను కొట్టేసింది. అంతేకాదు విద్యుత్ సంస్థలకు కుదించిన టారిఫ్ ప్రకారం చెల్లింపులు చేయాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే, పీపీఏల టారిఫ్ వ్యవహారాన్ని ఆరు నెలల్లోపు పరిష్కరించాలని ఈఆర్సీని ఆదేశించింది. ఇఫ్పటివరకూ నిర్ణయించిన ధర ప్రకారం బకాయిలను వెంటనే చెల్లించాలని సూచించింది. అలాగే వివిధ కారణాలతో విద్యుత్ ను తీసుకోవడం నిలిపివేసిన సంస్థల నుంచి వెంటనే సరఫరాను పునరుద్ధరించాలని జగన్ సర్కారును హైకోర్టు ఆదేశించింది.
అయితే, జగన్ సర్కారుపై ఏపీ హైకోర్టు మండిపడింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చాక కూడా మీరు విద్యుత్ కొనుగోలు చేయబోమని ఉత్పత్తి సంస్థలకు చెప్పడమేంటని ప్రశ్నించింది. అంటే మా ఆదేశాలంటే మీకు లెక్క లేదా? మేం చెప్పినా కూడా ఇంతేనా? అంటూ జగన్ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తంచేసింది. ఇది తమ ఆదేశాల ఉల్లంఘనే అంటూ ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించింది.