అమ్మాయిల టేస్టులు!!

ఈ కాలంలో అమ్మాయిలు బాగా అప్డేట్ అయ్యారు. వాళ్ళు ప్రతి విషయంలో ప్లానింగ్ గా ఉంటారు. ముఖ్యంగా చదువు, ఉద్యోగం, భాగస్వామి, ఫ్యూచర్ ప్లాన్స్ ఇలా వ్యక్తిగత విషయాలలో ఏ మాత్రం తగ్గకుండా నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. భారతీయ జనాభాలో అమ్మాయిలు, అబ్బాయిలా సగటు నిష్పత్తి చూస్తే అమ్మాయిల శాతం తక్కువగా, అబ్బాయిల శాతం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ కారణంగా పెళ్లి కావాల్సిన అబ్బాయిలకు అమ్మాయిలను వెతకడం కాస్త కష్టమవుతోంది. మొదటే అమ్మాయిల కొరత అంటూ ఉంటే, ఇంకా అమ్మాయిల గట్టి నిర్ణయాల వల్ల అబ్బాయిలు, అబ్బాయిలు తల్లిదండ్రులు కిందామీదా అయిపోతున్నారు పెళ్లి విషయంలో. వాటికి తగ్గట్టు ఈకాలంలో ఆడపిల్లలు తల్లిదండ్రుల్ని బాగా చేసుకుంటున్నారని బుద్ధి సగటు తల్లిదండ్రులకు కలిగినప్పటి నుండి అడపిల్లల్ని కూడా ఏమాత్రం తక్కువలేకుండా చదివించడం చేస్తున్నారు. అందుకే అబ్బాయిలు, వాళ్ళ తల్లిదండ్రులు వేటలో ఉన్నారు అమ్మాయిల కోసం. వధువు కావలెను అనే బోర్డ్ పట్టుకుని తిరుగుతూనే ఉన్నారు. వధువులు ఓకే చెప్పడానికి అబ్బాయిలలో కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అవేంటి మరి??


చదువు!!


సాధారణంగా ఈ కాలంలో విద్యావంతురాళ్లు అయిన అమ్మాయిలే ఎక్కువ. కనీసం గ్రాడ్యుయేట్ అయినా పూర్తి చేసినవాళ్ళు ఉంటారు. ప్రభుత్వ పథకాలు, రీయింబర్స్మెంట్స్ పుణ్యమా అని అమ్మాయిలు కూడా ఇంజనీరింగ్, పీ.జీ, పీ.హెచ్.డి పట్టాలు చక్కగా అందుకుంటున్నారు. ప్రతి అమ్మాయి తనకంటే విద్యాధికుడిని భర్తగా కోరుకుంటుంది. అంటే అమ్మాయి కంటే అబ్బాయి మరింత విద్యాధికుడు అయి ఉండాలి. 


ఉద్యోగం!!


ప్రభుత్వ ఉద్యోగస్తుడిని చేసుకుంటాను అని గిరి గీసుకుని కూర్చునే అమ్మాయిలు ప్రస్తుతమైతే లేరు. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న అమ్మాయిలు అయితే అటువైపు ఆలోచన చేస్తారు. ఈ కాలంలో మంచి విద్యార్హతకు ప్రయివేటు సంస్థలలో చాలా మంచి అవకాశాలే ఉంటున్నాయి. కాబట్టి సంపాదన బాగా ఉంటే ఉద్యోగానికి వంక పెట్టడం అమ్మాయిలు చెయ్యరు. 


ఆర్థిక విషయాలు!!


చాలామంది అంటూ ఉంటారు మానవ సంబంధాలు అన్నీ ఆర్థిక సంబంధాలు అయిపోతున్నాయి అని. నిజం చెప్పాలంటే ఈ కాలంలో డబ్బు లేకుండా బతికే మహానుభావుడు ఎవరూ ఉండరు. డబ్బు విషయంలో జాగ్రత్త ఉండేవాడికే జీవితంలో కాసింత ఆర్థిక లోటు లేకుండా సమస్యలను డీల్ చేయగలిగే సత్తా ఉంటుంది. ఎందుకంటే 99% సమస్యలు అన్నీ ఆర్థికంగా ఎదురవుతున్నవే ఉంటున్నాయి ఈ కాలంలో. అందుకే ఆర్థిక విషయాలలో సరైన ప్లానింగ్ ఉన్నవాళ్లకు అమ్మాయిలు  పెద్ద పీట వేస్తుంటారు.


ప్రైవేట్ అండ్ పర్సనల్ స్పేస్!!


ప్రతి వ్యక్తికి కాసింత స్పేస్ అవసరం. భార్యాభర్తల మధ్య దాచాల్సిన పర్సనల్స్ ఏమి ఉంటాయి. భర్తకు తెలియకుండా బయట పనులు ఏమి ఉంటాయి అనేది కొందరి వాదన. అయితే గూడాఛారిలాగా ప్రతి విషయం మీద నిఘా పెడుతూ ఉంటే మాత్రం ఏ అమ్మాయి కూడా భరించలేదు. ప్రతి విషయాన్ని ఇంట్లో అత్తకు, మామకు, భర్తకు చెప్పి తీరాలి అనే డిమాండ్స్ కు అమ్మాయిలు చాలా వ్యతిరేకం. కాసింత స్వేచ్ఛను గనుక అమ్మాయిలకు ఇవ్వగలిగితే వాళ్ళు చేసే ప్రతి పనిని తమకు తామే ఇంట్లో వాళ్లకు చెబుతారు. ఇక్కడ ఒక చిన్న ఇగో అండ్ డామినేషన్ లైన్ ఉంటుంది దాన్ని చెరుపుకోవడం లేదా ఆ చిన్న గీతను పెంచి పెంచి పెద్ద గోడలాగా మార్చడం ఆ కుటుంబంలో అందరి ప్రవర్తన మీదా ఆధారపడి ఉంటుంది.


ప్రాధాన్యతలు!!


అమ్మాయిల ప్రాధాన్యతలు ఎప్పుడూ ఫ్యూచర్ ప్లాన్స్ మీదనే ఉంటాయి. అలాగని ప్రస్థుతాన్ని అసలు విస్మరించేవాళ్లేమి కాదు. భర్త తన తల్లిదండ్రులకు ఎంత ఇంపార్టెన్స్ అయినా ఇవ్వచ్చు, కానీ భార్యకు అంతకంటే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. ఇంకా సమస్యలను నలుగురి ముందు చెప్పి, చుట్టాలు పక్కాల మధ్య పంచాయితీలు పెట్టించి బాపతు అబ్బాయిలకు, భార్యాభర్తల వ్యక్తిగత విషయాలలో వేరే ఎవరో జోక్యం చేసుకోవడం వంటి వాటికి అమ్మాయిలు విరుద్ధం మరి.


వీటన్నిటికంటే ముఖ్యంగా చెప్పాల్సిన విషయం అబ్బాయిలు ఏ పనిని అయినా సొంతంగా చేయడం, సొంత నిర్ణయాలు తీసుకునే వ్యక్తిత్వం కలిగి ఉండాలి. ప్రతి విషయానికి ఇతరుల నిర్ణయాల మీద డిపెండ్ అయ్యేవాడు అయితే అసలు భరించలేరు. 


అమ్మాయిలు ఒకే చెప్పాలంటే కొంచం చూసుకోండి మరి!!


                                ◆వెంకటేష్ పువ్వాడ.