ఆహార వీధికి ప్రతినిధులు వీళ్ళు!

సాధారణంగా వీకెండ్ వచ్చింది అంటే అందరూ చేసే పని బయటకు వెళ్లి తినడం. ఇప్పటి కాలంలో చిన్న చిన్న హోటల్స్ కు వెళ్లడం అంటే ఎంతోమందికి నామోషీ. అదే రెస్టారెంట్ లకు అయితే ఎగిరి గంతేస్తారు. రెస్టారెంట్ లలో ఆహారపదార్థాల రుచి మాత్రమే కాదు వారు వాటిని అందించే తీరు, వడ్డించే విధానం కూడా చాలా ప్రత్యేకం. కానీ చాలామంది రెస్టారెంట్ ఫుడ్ లో ధర మాత్రమే ఎక్కువ అని అంటూ ఉంటారు. సాధారణంగా బయట చిన్న చిన్న హోటల్స్ లో, బండ్ల మీద దొరికే ఆహారపదార్థాలు మినహాయిస్తే  రెస్టారెంట్ లలో తయారయ్యే ఆహారపదార్థాలు ఎంతో ప్రత్యేకమైనవి. ఆ వంట గదుల నుండి బయటకు వచ్చే ఎన్నో పదార్థాలు నిపుణుల చేతుల్లో రూపుదిద్దుకున్నవి.

టీవీ లలో సాధారణంగా మాస్టర్ చెఫ్ అని ఇంకా వేరు వేరు రకాల వంటల పోటీల ప్రోగ్రామ్స్ వస్తుంటాయి. వాటిలో కూడా మాస్టర్ చెఫ్ ఇండియా ఎంతో పేరు పొందింది. దాన్ని చూసిన వారందరికీ చెఫ్ అంటే ఎలాంటి పరిస్థితులలో ఎలాంటి ఆలోచనలు చెయ్యాలి?? వంటల విషయంలో ప్రతీది ఎలా జాగ్రత్త తీసుకోవాలి. అనుకున్న ఔట్ ఫుట్ రావడానికి ఎంత కష్టపడాలి?? వంటి ఎన్నో విషయాలు అర్ధమయ్యే ఉంటాయి. 

రెస్టారెంట్స్ లో చెఫ్స్!

రెస్టారెంట్ లలో చెఫ్స్ ఉద్యోగం అంటే అదేదో మనం తినడానికి వెళ్ళినప్పుడు ఏసీ గదుల్లో కూర్చుని ఎంజాయ్ చేసినట్టు ఏమి ఉండదు. చిన్న కాకా హోటల్ నుండి పెద్ద రెస్టారెంట్స్ వరకు ప్రతి ఒక్కచోట వంట చేసేవారు ఉడికిపోతున్న వంట గదిలో వేడిని భరిస్తూ వంట చేయాల్సిందే…

ఆహారం మీద మక్కువే ఈ మార్గం వైపు!

చెఫ్స్ గా మారడం వెనుక ఎంతో మందిని తమ అభిప్రాయాలు అడిగి చూసినప్పుడు వచ్చే సమాధానాలలో చాలా వరకు ఆహారం మీద ఉన్న ఇష్టమే వారిని చెఫ్స్ అనే వృత్తి వైపుకు తీసుకెళ్తోంది అనే విషయం తెలుస్తుంది. ఇంజనీర్లు, డాక్టర్లు, ఐఏయస్, ఐపిఎస్ వంటి పెద్ద పెద్ద గోల్స్ లో పరిగెడుతున్న యువత ఆహారం మీద ఇష్టం, విభిన్న రకాల రుచులను రుచిచూడాలనే అభిలాషతో గరిట చేతబట్టి నలభీములు అవుతున్నారు.

నిరంతర ప్రయోగాలు, ఆవిష్కరణలు!

ప్రతి వంటకం అన్నిచోట్లా దొరకదు. అది కొందరి చేతుల్లో రూపుదిద్దుకుంటుంది. వంట గదిలో నిరంతరం ప్రయోగాలు చేసే కొందరు చెఫ్స్ కొత్త కొత్త వంటకాలు ఆవిష్కరిస్తూ ఉంటారు. వాటి ఖరీదు కూడా ఎక్కువ ఉంటుంది. వాటి పేటెంట్ హక్కుల దృష్ట్యా రెస్టారెంట్ వారికి కూడా మంచి ఆదాయం ఉంటుంది. అంతేకాదు ఏ ఉద్యోగంలోనూ లేని తృప్తి చెఫ్ గా మారడంలో ఉంటుంది. తిన్నవారు ఆ వంటను మెచ్చుకుని తృప్తి పడినప్పుడు ఓ చెఫ్ గా విజయవంతమైనట్టు.

వండి పెట్టడం పెద్ద కష్టం కాదులే అనుకునేవారు చాలామంది ఉంటారు. చెఫ్ అంటే అదేదో చులకన భావం చూపించే వారు కొందరుంటారు. అయితే ఏ పని కూడా అవగాహన లేకుండా చేసేది కాదు. ముఖ్యంగా ఆహారపదార్థాన్ని ముందు వెనుకలు చేసి వండే ప్రక్రియ అంతకన్నా లేదు. ప్రతి చిన్న విషయానికి బాధ్యత అనేది ఎంతో ముఖ్యం. ఓ రెస్టారెంట్ కి, అందులో ఒక ఆహార పదార్థానికి ఓ మంచి పేరు వచ్చిందంటే దాని వెనుక ఖచ్చితంగా ఓ చేయి తిరిగిన నలభీముడు ఉన్నాడని అర్థం. అందుకే ఎక్కడైనా ఆహారం నచ్చితే ఆ చెఫ్ ను మనసారా అభినందించండి.

                                          ◆నిశ్శబ్ద.