ఎట్రాసిటీ చట్టం వర్తించదు!

మతం మారిన ఎస్సీలకు ఏపీ హైక్టోర్టు షాక్

మతం మారిన ఎస్సీ కులస్తుల హోదా గురించి ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. షెడ్యూల్డ్‌ కులాల వ్యక్తులు క్రైస్తవంలోకి మారిన రోజే ఎస్సీ హోదాను కోల్పోతారని హైకోర్టు తేల్చిచెప్పింది. వారు ఎస్సీ, ఎస్టీ చట్టం నుంచి రక్షణ పొందలేరని స్పష్టంచేసింది. గతంలో ఒక చర్చి పాస్టర్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ చట్టం కింద పలువురిపై పోలీసులు కేసు నమోదు చేయడాన్ని తప్పుపట్టింది. చట్టాన్ని దుర్వినియోగం చేసి తప్పుడు ఫిర్యాదు ఇచ్చారని ఆక్షేపించింది. పోలీసులు ఛార్జిషీట్‌ వేయకుండా ఉండాల్సిందని అభిప్రాయపడింది. కేసును కొట్టేసింది. న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.హరినాథ్‌ ఈ మేరకు ఇటీవల తీర్పు ఇచ్చారు. తనను కులం పేరుతో దూషించి, దాడి చేసి గాయపరిచారని ఉమ్మడి గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన పాస్టర్‌ చింతాడ ఆనంద్‌ 2021లో చందోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన ఎ.రామిరెడ్డి మరో ఐదుగురిపై ఎస్సీ, ఎస్టీ చట్టంతోపాటు ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ గుంటూరు ఎస్సీ, ఎస్టీ కోర్టులో పెండింగ్‌లో ఉంది. కేసును కొట్టేయాలంటూ నిందితులు 2022లో హైకోర్టులో పిటిషన్‌ వేశారు. 

ఫిర్యాదుదారు పదేళ్లుగా పాస్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ విషయాన్ని ఫిర్యాదులోనే పేర్కొన్నారు. క్రైస్తవంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ, ఎస్టీ చట్టం వర్తించదు. రాజ్యాంగం షెడ్యూల్డ్‌ కులాలు ఆర్డర్‌-1950 ప్రకారం హిందూమతాన్ని కాకుండా ఇతర మతాలను స్వీకరించినవారు ఎస్సీ హోదాను కోల్పోతారు. కుల వ్యవస్థను క్రైస్తవం గుర్తించదని, ఆ మతాన్ని స్వీకరించిన వారికి ఎస్సీ, ఎస్టీ చట్టం కింద రక్షణ ఉండదని సుప్రీంకోర్టు  గతంలో తీర్పులు ఇచ్చింది. వీటిని పరిగణనలోకి తీసుకుని కేసును కొట్టేయండని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు. పాస్టర్‌ ఆనంద్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఫిర్యాదుదారుడు ఎస్సీ అని తహసీల్దార్‌ ధృవపత్రం ఇచ్చారని గుర్తుచేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి.. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ఫిర్యాదుదారుడు రక్షణ పొందలేరని పేర్కొంటూ, కేసు కొట్టేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu