నైట్ షిఫ్టులో పనిచేసేవారు ఆరోగ్యంగా, యాక్టీవ్ గా ఉండాలంటే ఇలా చేయండి.!

నేటి వేగవంతమైన ప్రపంచంలో ఉద్యోగ జీవితాలు కూడా అంతే వేగంగా ఉంటాయి. పోటీ దృష్ట్యా ప్రతి సంస్థ 24 గంటలు తమ కార్యకలాపాలు కొనసాగించాలని అనుకుంటుంది. ఈ కారణంగానే సాధారణ పనివేళలు మాత్రమే కాకుండా నైట్ షిఫ్టులు కూడా కొనసాగిస్తుంది.  వేతనం గురించో ఇతర కారణాల వల్లనో చాలామంది నైట్ షిప్టులో పనిచేస్తుంటారు.  అయితే సాధారణ పని వేళల్లో పనిచేసేవారి కంటే నైట్ షిప్టులో పనిచేసేవారిలో చురుకుదనం తక్కువగా ఉంటుంది. అంతేనా సాధారణంగా నిద్రపోవాల్సిన సమయంలో ఉద్యోగాలు చెయ్యడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. నైట్ షిఫ్టు డ్యూటీ చేసేవారు  ఆరోగ్యంగా, యాక్టీవ్ గా ఉండటానికి  కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటంటే..


నిద్ర..


నైట్ షిఫ్టు లో పనిచేసేవారు నిద్ర షెడ్యూల్ ను కరెక్ట్ గా ప్లాన్ చేసుకోవాలి. నిద్రా చక్రమైన సిర్కాడియన్ రిథమ్ కు అంతరాయం కలిగించకుండా చూసుకోవాలి. సిర్కాడియన్ రిథమ్ కు అంతరాయం కలిగితే  నిద్ర ఆటంకాలు, అలసట కలుగుతాయి.  ఈ సిర్కాడియన్ రిథమ్ గడియారాన్ని నియంత్రణలో ఉంచుకోవడానికి సెలవు దినాలలో కూడా ఒకే సమయానికి పడుకోవాలి.


ఆహారపు అలవాట్లు..


నైట్ షిఫ్టుల సమయంలో చాలామంది ఎనర్జీగా ఉండటం కోసం ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఫుడ్స్ తినడం మీద ఆసక్తి చూపిస్తారు. పైపెచ్చు సాధారణ భోజన సమయాలు కాకపోవడం వల్ల రాత్రి పూట ఆకలేసినప్పుడు ఇలాంటి ఆహారానికే ప్రాధాన్యత ఇస్తారు. అయితే వీటికి బదులుగా పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లు, తృణధాన్యాలు అధికంగా ఉండే సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. నైట్ షిఫ్ట్ అంతా చిన్న చిన్న మొత్తాలలో ఆహారం తీసుకోవాలి. నీరు బాగా త్రాగాలి.


వ్యాయామం..

నైట్ షిప్టులలో పనిచేసేవారు ఉదయం సమయాల్లో పడుకుంటూ ఉంటారు. దీని వల్ల చాలామంది ఉదయం వేళ చెయ్యాల్సిన వ్యాయామాన్ని స్కిప్ చేస్తుంటారు. లేదా పగటి సమయాన్ని లేజీగా గడిపేస్తూ  ఉంటారు. కానీ వ్యాయామాన్ని తప్పనిసరిగా భాగం చేసుకోవాలి. జాకింగ్, వాకింగ్, యోగా, సైక్లింగ్ వంటివి మంచి ఎంపిక.


ఒత్తిడి..


పనిచేసే సమయవేళలు మానసిక ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి. ఇది ఒత్తిడి, ఒంటరితనం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఒత్తిడి రాకుండా చూడటం కోసం  లోతైన శ్వాస, శ్వాస వ్యాయామాలు,  ధ్యానం,  తీరిక సమయాలలో స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులతో మాట్లాడటం వంటివి చేయాలి.  ఒకవేళ ఒత్తిడి సమస్య ఉంటే మానసిక నిపుణులను కలిసి కౌన్సెలింగ్ తీసుకోవాలి.


ప్లానింగ్..

నైట్ షిఫ్టులలో పనిచేసేవారు తమ పనిని చాలా పక్కాగా ప్లాన్ చేసుకోవాలి. పని చేసేటప్పుడు అలసిపోకుండా పనిని ఏకధాటిగా కాకుండా చిన్నచిన్న భాగాలుగా విభజించుకొని ఫినిష్ చేయాలి. ఇది పక్కాగా అమలుకావడం కోసం కోలీగ్స్,  అధికారులతో సంప్రదించి వారి మద్దతు తీసుకోవాలి.

                                    *నిశ్శబ్ద.


 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu