ద్రాక్ష తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా?

 


ద్రాక్ష ఆరోగ్యకరమైన పండ్లలో ఒకటి.  తీగలకు కాసే ఈ ద్రాక్ష పండ్లు చాలా రుచిగా ఉంటాయి. తియ్యగా, పుల్లగా, జ్యూసీగా ఉండే ద్రాక్ష పండ్లు పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. అయితే ద్రాక్ష పండ్లలో ఉండే పోషకాల గురించి,  ద్రాక్ష పండ్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియవు.  వీటి గురించి తెలుసుకుంటే..

సీజన్ వారిగా లభించే పండ్లలో ద్రాక్ష పండ్లు కూడా ఒకటి.  సాధారణంగానే ఎండు ద్రాక్ష తీసుకుంటే ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలు అని చెబుతుంటాం.  అలాంటిది సీజన్ లో దొరికే తాజా ద్రాక్ష పండ్లు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా బెనిఫిట్స్ ఉంటాయట.  ద్రాక్ష పండ్ల సీజన్ లో మిస్సవకుండా ద్రాక్ష పండ్లు తినాలని ఆహార నిపుణులు చెబుతున్నారు.


ద్రాక్ష పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు,  విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.  ఈ పండు అనేక విధాలుగా ప్రయోజనాలు చేకూరుస్తాయి. ద్రాక్షలో రెస్వెరాట్రాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది.  ఇది కొలెస్ట్రాల్,  రక్తపోటును నియంత్రించడంలో  బాగా సహాయపడుతుంది.

శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే ధమనులకు ఆటంకం కలుగుతుంది.  అదే ద్రాక్ష తింటే శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. కాబట్టి ధమనులు శుభ్రంగా ఉంటాయి.  గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. కొలెస్ట్రాల్ సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు ద్రాక్ష పండ్లు బాగా తీసుకోవడం  మంచిది.


ద్రాక్ష పండ్లలో విటమిన్-సి,  యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.  ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.  ఎప్పుడైనా జ్వరం చేసినప్పుడు,  ఆరోగ్యం బాగాలేనప్పుడు యాపిల్ లాంటి పండ్లతో పాటు ద్రాక్ష పండ్లు బాగా తినమని చెబుతుంటారు.  దీని వెనుక కారణం ద్రాక్ష రోగనిరోధక శక్తిని పెంచడమే..

ద్రాక్షలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.  ద్రాక్షపై పొట్టు మాత్రమే కాకుండా ద్రాక్షలోపలి కండలో కూడా ఫైబర్ ఉంటుంది.  ఇది మలబద్దకం నుండి ఉపశమనం పొందడంలో జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.  మలబద్దకం సమస్యతో ఇబ్బంది పడేవారు రోజూ ఒక కప్పు ద్రాక్ష పండ్లు తింటే సమస్య తగ్గుతుంది.


ద్రాక్ష పండ్లు చర్మానికి కూడా చాలా మేలు చేస్తాయి.  ఈ పండ్లలో ఉండే పోషకాలు చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి. ద్రాక్ష పండ్లలో ఉండే సమ్మేళనాలు రక్తాన్ని శుద్ది చేస్తాయి.  రక్తంలో ఉండే వ్యర్థ పదార్థాలను బయటకు పంపుతాయి. దీని వల్ల చర్మం తాజాగా, యవ్వనంగా, మచ్చలు లేకుండా క్లియర్ గా ఉంటుంది.


ద్రాక్షలో ఉండే లుటిన్,  జియాక్సంతిన్ అనే సమ్మేళనాలు కంటి చూపును మెరుగుపరుస్తాయి.  కంటి చూపు బలహీనంగా ఉన్నవారు,  ఎక్కువసేపు కంప్యూటర్ ముందు పని చేయాల్సిన వారు కంటి అలసటను తొలగించుకోవడానికి ద్రాక్ష పండ్లను బాగా తినవచ్చు.  

                     *రూపశ్రీ.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu