రోజూ ఒక గుప్పెడు శనగలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..?
posted on Sep 26, 2025 9:30AM

ఆరోగ్యకరమైన ఆహారం శరీరానికి చాలా అవసరం. అలాంటి ఆరోగ్యకరమైన ఆహారాలలో పప్పు ధాన్యాలు, తృణధాన్యాలు ఎప్పుడూ ఉంటాయి. వీటిలో ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు..ఇలా అన్నీ ఉంటాయి. చాలామంది ప్రోటీన్ కోసం రికమెండ్ చేసే ఆహారాలలో శనగలు మొదటి స్థానంలో ఉంటాయి. శనగలను నానబెట్టి తిన్నా, లేక శనగలు వేయించినవి తిన్నా, లేదా మొలకెత్తిన శనగలు తిన్నా.. కూరల్లో వాడినా, ఆఖరుకు శనగపిండిని ఆహారంలో చేర్చుకున్నా చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెబుతారు. అయితే ఉడికించిన శనగలు కానీ శనగపప్పు కానీ రోజూ ఓ గుప్పెడు తింటే కలిగే లాభాల గురించి తెలిస్తే మాత్రం చాలామంది షాకవుతారు. ఇకమీదట రోజూ ఒక గుప్పెడు శనగలను తమ ఆహారంలో తప్పనిసరిగా భాగం చేసుకుంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంతకీ.. రోజూ గుప్పెడు శనగలు తింటే ఏమవుతుందో తెలుసుకుంటే..
పవర్ హౌస్..
శనగలు ప్రోటీన్ కు పవర్ హౌస్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. శనగపప్పులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కండరాల పెరుగుదలకు, కండరాల మరమ్మత్తుకు సహాయపడుతుంది. శాకాహారులు చాలావరకు ప్రోటీన్ లోపంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు ప్రతి రోజూ గుప్పెడు శనగలు తింటే ప్రోటీన్ లోపం తొందరలోనే తగ్గిపోతుంది.
మలబద్దకం..
శనగలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఫలితంగా మలబద్దకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. శనగలలోని పైబర్ ప్రేగు కదలికలను సాఫీగా ఉండేలా చేస్తుంది. మలబద్దకంతో ఇబ్బంది పడేవారు శనగలు తింటూ ఉంటే మలబద్దకం సమస్య సులువుగా తగ్గిపోతుంది.
రక్తహీనత..
శనగలలో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ ను పెంచడంలో సహాయపడుతుంది. భారతదేశంలో దాదాపు 80శాతం మంది మహిళలు రక్తహీనత సమస్యతో ఇబ్బంది పడేవారే అనేది చాలా మందికి తెలియని నిజం. ప్రతి రోజు శనగలు ఆహారంలో తీసుకుంటూ ఉంటే రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు.
గుండె ఆరోగ్యం..
గుండె ఆరోగ్యంగా ఉండటానికి మెగ్నీషియం చాలా ముఖ్యం. శనగలలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యం, కండరాల పనితీరును నియంత్రిస్తుంది. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడుతుంది.
మానసిక స్థితి..
శనగలలో విటమిన్-బి6 కూడా ఉంటుంది. ఇది మెదడు ఎదుగుదలకు, మెదడు ఆరోగ్యానికి సహాయపడుతుంది. మెదడు పనితీరు, దాని స్థితి ఆరోగ్యంగా ఉంటే చాలా వరకు మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. అందుకే శనగలు తింటూ ఉంటే మెదడు ఆరోగ్యంగా ఉంటూ మానసికంగా సమతుల్యంగా ఉండవచ్చు.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...