గవర్నరు సదాశివంను అవమానించిన ఎయిరిండియా..!
posted on Dec 23, 2015 3:26PM

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి..కేరళ గవర్నరు సదాశివంకు చేదు అనుభవం ఎదురైంది. నిన్న రాత్రి ఆయన కోచి నుండి త్రివేండ్రంకు వెళ్లేందుకు విమానాశ్రయానికి వెళ్లగా.. ఆయన వెళ్లే సరికి అక్కడ విమానం లేకపోయేసరికి ఆయన షాకయ్యారు. వివరాల ప్రకారం.. అసలు సదాశివం వెళ్లవలసిన విమానం 9.20కి బయలుదేరాల్సి ఉంది. అయితే అది కాస్త ఆలస్యమై షెడ్యూలు 11.40కి మారింది. అయితే గవర్నరు కూడా 11.28కే వచ్చేశారు. కానీ అప్పటికే విమానం ఎక్కేందుకు ఉపయోగించే నిచ్చనను తొలగించేశారు. గవర్నరుకు ఎలాంటి చెకింగ్ లేకుండా పంపించొచ్చు కాబట్టి ఆయన్ను 11.28కి కూడా అనుమతించొచ్చు. అయినా ఆయన్ను వదిలేసి 11.40కి విమానం గాలిలోకి ఎగిరింది. దీంతో షాక్ కు గురయిన సదాశివం చాలాసేపు మాట్లాడకుండా ఎయిర్ పోర్టులోనే అలా ఉండిపోయారు. ఎయిరిండియాపై కేసు వేసేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు సమాచారం.