గూగుల్ ప్లే స్టోర్‌పై వైరస్ అటాక్

కొద్ది రోజుల క్రితం ర్యాన్సమ్ వేర్ వైరస్ ప్రపంచదేశాలను గడగడలాడించింది. వివిధ దేశాల్లోని కోట్లాది కంప్యూటర్లు దీని బారినపడ్డాయి. దీని నుంచి కాపాడుకోవడానికి ఎన్నో రక్షణ చర్యలను చేపడుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా మరో కొత్త రకం వైరస్ ఇప్పుడు ఐటీ ప్రపంచంలో కలకలం సృష్టించింది. జుడీ అనే పేరు గల వైరస్ గూగుల్ ప్లే స్టోర్‌పై దాడి చేసింది. గూగుల్ ప్లే స్టోర్‌లోని 41 యాప్స్‌లో ఇది ప్రవేశించినట్లు నిపుణులు గుర్తించారు. 36.5 మిలియన్ల గూగుల్ ప్లే స్టోర్ యూజర్లలో 8.5 మిలియన్ల మంది ఇప్పటికే దీని బారిన పడ్డారు. చెక్ పాయింట్ అనే సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ సంస్థ దీనిని తొలిసారిగా గుర్తించింది. వెంటనే అప్రమత్తమైన గూగుల్ వైరస్ ప్రవేశించిన యాప్స్‌ను తొలగించడం మొదలుపెట్టింది. దక్షిణ కొరియాకు చెందిన కినివిని అనే సంస్థ ఈ మాల్‌వేర్‌ను సృష్టించినట్లు గుర్తించారు.