ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి ఎర్రబెల్లి పాత్ర?

స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ అధికారి ప్రణీత్ రావు విచారణలో సంచలన విషయాలు వెల్లడౌతున్నట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి తాజాగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అధికారులు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఇద్దరు పోలీసు అధికారులను అదుపులోనికి తీసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు ఇప్పటికే ప్రణీత్ రావును అరెస్టు చేసి విచారిస్తున్న సంగతి తెలిసిందే.

విచారణలో భాగంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే తాను ట్యాపింగ్ కు సంబంధించిన ఆధారాలను చెరిపివేసినట్లు ప్రణీత్ రావు అంగీకరించినట్లు తెలుస్తోంది. అలాగే  ఎస్ఐబీలోని కంప్యూటర్ల హార్డ్ డిస్కులను తొలగించి వికారాబాద్ అడవులలో పారేసినట్లు ప్రణీత్ రావు విచారణలో అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో ప్రణీత్ రావును వికారాబాద్ అడవులలోకి తీసుకువెళ్లి  హార్డ్‌డిస్కుల శకలాలు  స్వాధీనం చేసుకునేందుకు పోలీసులుసమాయత్తమౌతున్నారు. కోర్టు అనుమతితో ప్రణీత్‌రావును కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. తొలి రోజు ఆదివారం రహస్య ప్రదేశంలో విచారించినా, రెండో రోజు మాత్రం బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లోనే విచారించారు. .

రెండో రోజైన సోమవారం బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లోనే ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే గతంలో ఎస్ఐబీలో పని చేసి, ప్రస్తుతం నల్గొండ జిల్లాలో సీఐగా పని చేస్తున్న ఒక పోలీసు అధికారిని పోలీసులు సోమవారం విచారించారు.   ఇప్పుడు తాజాగా వరంగల్ పోలీసు కమిషనరేట్ లో పని చేస్తున్న ఇద్దరు పోలీసు అధికారులను సిట్ అదుపులోనికి తీసుకోవడంతో ఇక డొండ కదులుతోందని అంటున్నారు.

వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, కేసీఆర్ కేబినెట్ లో కీలకంగా పని చేసిన ఎర్రబెల్లి దయాకరరావుకు కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంబంధాలున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వరంగల్ పోలీసు కమిషనరేట్ లోని ఇద్దరు పోలీసు అధికారులను సిట్ అదులోనికి తీసుకోవడం ఆ అనుమానాలను బలపరిచేదిగా ఉంది. మొత్తం మీద రానున్న రోజులలో ప్రణీత్ రావు విచారణలో మరిన్ని సంచలన విషయాలు వెల్లడి అయ్యే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.