ఫ్రీడం 251/- ఫోను.... అంతా ఉత్తుత్తేనా!
posted on Feb 19, 2016 3:29PM
.jpg)
251 రూపాయలకే పేద్ద ఫోను. అందులో లేని ఫీచర్ అంటూ లేదు. స్క్రీన్ కూడా పెద్దదే! ఫిబ్రవరి 18 ఉదయం 6 గంటల నుంచి ఈ ఫోనుని ఆన్‌లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఇలాంటి ప్రకటనలు విన్న భారతదేశంలోని లక్షలాది మంది యువత జీవితంలో ఎప్పుడూ లేనిది నిన్న ఉదయం ఐదుగంటలకే లేచి కూర్చున్నారు. కానీ ఏ ఒక్కరికీ ఫోన్ దక్కినట్లు లేదు. ఫోన్‌ని అమ్ముతున్న సైట్ కాస్తా క్రాష్ అయిపోయింది. ఒక వేళ ఎవరన్నా ఫోన్ బుక్ చేసుకునేందుకు ప్రయత్నిస్తే సైట్‌లో అడుగడుగునా అడ్డంకులు కనిపిస్తూనే ఉన్నాయి. వెరసి ఇంతవరకూ ఏ ఒక్క వినియోగదారుడి చేతికీ ఫ్రీడం 251 ఫోను అందలేదు. నోయిడాకి చెందిన రింగింగ్ బెల్స్ అనే సంస్థ చౌకబారు ప్రచారం కోసమే ఇదంతా చేసింది అన్న అపవాదులూ వినిపిస్తున్నాయి.
- ఫ్రీడం 251 ఫోను యాపిల్ ఫోనుకి నకలుగా ఉందంటూ విమర్శలు వస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే యాపిల్ కంపెనీ నుంచి కాపీరైటు కేసుని ఎదుర్కోవలసి ఉంటుంది.
- ఈ ఫోను ఉత్పత్తిదారులు చెబుతున్నట్లు ఇదేమీ ‘మేక్ ఇన్ ఇండియా’ ఫోను కాదని తేలిపోయింది. ఇందులో పరికరాలన్నీ తైవాన్ నుంచి దిగుమతి అయ్యాయట.
- ఫోనుని ఇంత చవగ్గా ఎలా అమ్మగలుగుతున్నారంటూ ఆదాయపు పన్ను శాఖ అధికారులు నేడు రింగింగ్ బెల్స్ అధికారులని ప్రశ్నించారు.
- ఈ ఫోను మీద ‘ADCOM’ అనే ముద్ర ఉంది. కానీ అదే పేరుతో ఉన్న కంపెనీ తనకీ ఈ ఫోన్లకీ ఏమాత్రం సంబంధం లేదని చెబుతోంది.
- తలకిందులుగా తపస్సు చేసినా కూడా ఈ ధరకు ఇలాంటి ఫోన్లను తయారుచేయలేరు, ఇందులో ఏదో మోసం ఉంది అంటూ ‘ఇండియన్ సెల్యులర్ అసోసియేషన్’ నిన్న ప్రభుత్వాన్ని ఒక ఫిర్యాదు చేసింది.