మోదీ గెలికిన విభజన గాయం!.. అందుకేనా..? ఆయన చెబితే విన్నారా?
posted on Feb 8, 2022 2:48PM
తెలంగాణ, ఏపీగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన. పార్లమెంట్ చరిత్రలో అదో చీకటి అధ్యాయం అనేది ఆంధ్రుల వాదన. అంబేద్కర్ రాసిన రాజ్యాంగ అత్యుత్తమ ఫలం అనేది తెలంగాణ వాదుల వాయిస్. విభజన జరిగి ఏడేళ్లు గడిచింది. ప్రస్తుతానికి పెద్దగా సమస్యలేమీ లేవు. ఆనాటి గాయాలన్నీ దాదాపుగా మానిపోయాయి. అలాంటిది.. పార్లమెంట్‌లో ప్రధాని మోదీ మరోసారి ఆ గాయాన్ని గెలికారు. కాంగ్రెస్‌ను విమర్శించే క్రమంలో.. ఏపీ విభజన జరిగిన తీరును తీవ్రంగా విమర్శించారు.
తెలంగాణకు తాము వ్యతిరేకం కాదంటూనే.. రాష్ట్ర విభజన చేసిన విధానంపై ఘాటైన కామెంట్లు చేశారు. ‘‘వాజ్‌పేయీ ప్రభుత్వం 3 రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. శాంతియుతంగా అందరూ కలిసి కూర్చుని, చర్చించి ఆ రాష్ట్రాల ఏర్పాటు బిల్లులను పాస్ చేశారు. కానీ ఏపీ, తెలంగాణ విషయంలో అలా జరగలేదు. నాడు కాంగ్రెస్ హయాంలో సభలో మైకులు ఆపేశారు. కాంగ్రెస్ సభ్యులు పెప్పర్ స్ప్రే కొట్టారు. ఎలాంటి చర్చ లేకుండా ఏపీని విభజించారు. విభజన తీరుతో ఏపీ, తెలంగాణ ఇప్పటికీ నష్టపోతున్నాయి. కాంగ్రెస్ అహంకారం, అధికార కాంక్షకు ఇదే నిదర్శనం. ఏపీ విభజన తీరు సరిగా లేదు. సరిగా విభజన జరిగి ఉంటే రెండు రాష్ట్రాలకు సమస్యలు వచ్చేవి కావు’’ అని కాంగ్రెస్‌ను ఉద్దేశించి మోదీ పదునైన విమర్శలు చేయడం ఆసక్తికరంగా మారింది.
సడెన్‌గా ఏడేళ్ల తర్వాత మోదీ రాష్ట్ర విభజనపై పార్లమెంట్‌లో ఎందుకు మాట్లాడినట్టు? అనే చర్చ నడుస్తోంది. అదే సమయంలో ఆ రోజు అసలేం జరిగిందనేది మరోసారి గుర్తు చేసుకుంటున్నారంతా. మోదీ చెప్పిందంతా నిజమే. ఆ రోజు పార్లమెంట్ తలుపులు మూసేశారు. పార్లమెంట్ లైవ్ ప్రసారాలు ఆపేశారు. పార్టీలకతీతంగా కాంగ్రెస్ ఎంపీలు ప్రాంతాల వారీగా విడిపోయారు. సభలో లొల్లిలొల్లి..గొడవ గొడవ. పేపర్లు చినిగాయి.. మైకులు, కుర్చీలు విరిగాయి. ఆనాడు ప్రత్యేక తెలంగాణకు బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఏపీ తరఫున అప్పటి బీజేపీ ఎంపీ, ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సభలో ఆంధ్రుల ప్రయోజనాల కోసం గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేశారు. చర్చ కోసం పట్టుబట్టారు. అయినా, ఆయన వేదన అరణ్య రోదనే అయింది. సభలో ఆంధ్రుల గొంతు నులిమేశారనే విమర్శ ఉంది. ఇక, విభజన బిల్లును అడ్డుకునేందుకు ఆనాటి కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సభలో పెప్పర్ స్ప్రే చల్లి చివరి ప్రయత్నం చేశారు. అయినా, యూపీఏ ప్రభుత్వం తగ్గేదేలే అన్నట్టు.. పంతంపట్టి మరీ.. విభజన బిల్లును ఆమోదింపజేసింది. రాష్ట్రపతి సంతకంతో.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌గా రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. విభజన నేరానికి ఏపీలో కాంగ్రెస్ కి పెద్ద శిక్షే పడింది. తొలినాళ్లలో టూ స్టేట్స్ బాగా అభివృద్ధి పథాన పయనించినా.. ఇప్పుడు మాత్రం చతికిలపడుతున్నాయి.
అదంతా సరే.. మరి, ప్రధాని మోదీకి ఆ విషయం ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చినట్టు? ఇటీవల సీఎం కేసీఆర్ మోదీని, బీజేపీని పదే పదే ఏకిపారేస్తుండగా.. తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ధూంధాం నడుస్తున్న ఈ సమయంలో పీఎం మోదీ.. రాష్ట్ర విభజన తీరును తప్పుబట్టే విధంగా మాట్లాడటం.. కేసీఆర్ అండ్ కో కు మరోమంచి అవకాశం అందించినట్టేగా..అంటున్నారు. అంటే, ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగమేనా? అనే అనుమానం రాకమానదు. తెలంగాణ వాదంపై ఎంత రచ్చ నడిస్తే.. కేసీఆర్‌కు, టీఆర్ఎస్‌కు అంత లాభం. అందుకే కాబోలు అప్పుడే టీఆర్ఎస్ వర్గాలు.. మోదీ వ్యాఖ్యలపై అగ్గి రాజేస్తున్నాయి. కారు, కమలం కొట్లాడుకుంటుంటే.. మధ్యలో కాంగ్రెస్‌కు స్కోప్ లేకుండా పోతోంది. తామేమైనా తక్కువా అన్నట్టు.. కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి సైతం ప్రధాని మోదీ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఇదంతా తెలంగాణ వర్షన్. ఇక ఏపీ విషయానికి వస్తే....
అవును, నిజమే.. విభజన వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయింది. బంగారు బాతులాంటి హైదరాబాద్‌ను వదులుకోవాల్సి వచ్చింది. పరిశ్రమలు, పెట్టుబడులు తెలంగాణలోనే ఉండిపోయాయి. నవ్యాంధ్ర తొలిముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు కాబట్టి సరిపోయింది.. ఆ విభజన గాయం బాధ తెలీకుండా మేనేజ్‌చేయగలిగారు.. సన్‌రైజ్ స్టేట్‌తో, అమరావతి నిర్మాణంతో నవ్యాంధ్రను నవపథాన నడిపించే ప్రయత్నం చేశారు. అయినా, విభజన బిల్లు ప్రకారం కేంద్రం నుంచి రావాల్సిన సాయం అందకపోవడంతో.. తన రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టి మరీ.. ధర్మపోరాటానికి దిగారు. ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలంతా రాజీనామాలు చేశారు. ఆనాడు చంద్రబాబు కాలి చెప్పులు అరిగిపోయేలా ఢిల్లీ చుట్టూ తిరిగారు. ఏపీకి రావాల్సిన నిధులు, హామీలపై కేంద్రానికి లెక్కకు మిక్కిలి విజ్ఞప్తులు ఇచ్చారు. అయినా, పట్టించుకుంటేగా! జగన్ సీఎం అయ్యాక.. ఇక పూర్తిగా చేతులెత్తేశారు. స్పెషల్ స్టేటస్ ఊసే లేదు. ఏపీ హక్కుల కోసం పార్లమెంట్‌లో ప్రశ్నే లేదు. బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చిల్లి గవ్వ కూడా విదల్చకున్నా.. అడిగే నాథుడే లేడు. పోలవరం నిధుల జాడే లేదు. ఏపీకి కలిగిన ఈ కష్టమంతా.. రాష్ట్రాన్ని కాంగ్రెస్ విభజించిన తీరు వల్లేనని ఇప్పుడు అంటున్నారు ప్రధాని మోదీ.