మోడీ ఏడేళ్ళ పాలనలో  మరుపులు – మరకలు 

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాలనకు ఏడేళ్ళు పూర్తయ్యాయి. ఈ ఏడేళ్ళలో తొలి ఐదేళ్ళ పాలన ఒకెత్తు అయితే, రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాతా గడచిన రెండేళ్ళ పాలన ఒకటీ ఒకెత్తుగా సాగుతోంది. తొలి ఐదేళ్లలో ఆమాటకొస్తే, రెండవసారి మరింత భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరం చివరి వరకు, మోడీ –అమిత్ షా జోడీ బండి గతుకుల రోడ్డు మీద కూడా సాఫీగా సాగిపోయింది. విపక్షాల విమర్శలకు విలువే లేకుండా పోయింది.  ఇక అక్కడి నుంచి ఎదురుదెబ్బలు మొదలయ్యాయి. ఒక్కసారిగా ప్రళయంగా విరుచుకు పడిన కొవిడ్ సెకండ్ వేవ్’ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేసింది. ప్రభుత్వ దూకుడుకు కళ్ళెం వేసింది. కొవిడ్ తొలి వేవ్’ ను కొంత సమర్ధవంతంగా ఎదుర్కున్న మోడీ ప్రభుత్వం గత రెండు మూడు నెలలుగా విజృంభణ  సాగిస్తున్న సెకండ్ వేవ్ విషయంలో ఇంటా బయటా తీవ్ర విమర్శలను ఎదుర్కుంటోంది. ఈ నేపధ్యంలోనే, ప్రభుత్వం, అధికార పార్టీ ఏడేళ్ళ వేడుకలు జరుపుకోలేదు. అందుకు  ముఖం చెల్లలేదు. అందుకే, ‘సేవా హీ సంఘటన’ (సేవే సంఘటన) పేరిట సేవా కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు. 

అదలా ఉంచి ఏడేళ్ళ పాలనలో ప్రధాని మోడీ ప్రభుత్వం ఏమి సాధించింది?ఎక్కడ విఫలమైంది? అని అలోచిస్తే, సహజంగానే ఇతరుల పాలనలోలానే  మోడీ పాలనలోనూ మెరుపులు, మరకలు రెండూ దర్శనమిస్తాయి. అయితే, ఇందులో ఏవి మెరుపులు, ఏవి మరకలు అనేది చూసే చూపును బట్టి, రాజకీయ విశ్వాసాలు, అవసరాలను బట్టి మారుతూ ఉంటాయి. మోడీ ప్రభుత్వం తీసుకున్న ప్రతి కీలక నిర్ణయాన్ని, ప్రతిపక్షాలువిమర్శిస్తూనే వచ్చాయి. ఉదాహరణకు పెద్ద నోట్ల రద్దు, చాలా ప్రమాదకర నిర్ణయమని, ప్రతిపక్షాలు విరుచుకు పడ్డాయి. అలాగే, వస్తు సేవల పన్ను( జీఎస్టీ) విషయంలోనూ ప్రతిపక్షలు మోడీ ప్రభుత్వాన్ని ఏకి పారేశాయి. ప్రతిపక్షాలు మాత్రమే కాదు, ప్రతిపక్షాల వాదనను సమర్ధించే ఆర్థిక రంగ నిపుణులు, అదే కోవకు చెందిన మేథావులు, విశ్లేషకులు, మోడీ నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమనం దిశగా  పరుగులు తీస్తుందని మండి పడ్డారు. దేశం నాశనం అవుతుందని, దివాళా దీస్తుందని... గణాంకాల ఆధారంగా  చాలా  బలమైన వాదనలు వినిపించారు. 

అలాగే, రాజకీయ పండితులు, మోడీ ప్రభుత్వం ఆర్థిక నిర్ణయాల ప్రభావం, ఎన్నికల ఫలితాలపై ఉంటుందని జోస్యం  చెప్పారు.  అయితే వాస్తవంలో ఏమి జరిగిందో కళ్ళముందు కనిపిస్తోంది. 2014లో కేంద్రంలో తొలిసారి, అధికారంలోకి వచ్చే సమయానికి, దేశంలో మూడు నాలుగు రాష్ట్రాలలో మాత్రమే బీజేపీ అధికారంలో వుంది. ఇప్పడు, బీజీపీ/ఎన్డీఏ ఇచుమించుగా 20 రాష్ట్రాలలో అధికారంలో ఉంది. అలాగే, విపక్షాల విమర్శలను ఎదుర్కున్న పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, వంటి కీలక నిర్ణయాలు తీసుకున్న తర్వాత జరిగిన  2019, లోక్ సభ ఎన్నికలలోనూ బీజేపీ ముందుకంటే ఎక్కువ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది.అలాగని, మోడీ ప్రభుత్వం తీసుకున్ననిర్ణయాలు అన్నీ మంచివని కాదు. కేవలం ఎన్నికల ఫలితాలు మాత్రమే మంచి చెడులను నిర్ణయిస్తాయని అనలేము. అదే సమయంలో, ప్రజాస్వామ్యంలో, అంకెలు కూడా మాట్లాడతాయి. అదెలా ఉన్నా,  నిజంగా కూడా పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీల వలన దేశ ఆర్థిక వ్యవస్థ కొంత నష్ట పోయింది. పరిశ్రమలు మూతపడ్డాయి. కార్మికులు ఉపాధి కోల్పోయారు. అయితే, తాత్కాలికంగా కొన్ని ఒడిదుడుకులు వచ్చిన దీర్ఘాకాలంలో సుస్థిర అభివృద్ధి, సుస్థిర ప్రయోజనాలు పొందాలంటే, తాత్కాలికంగా కష్ట నష్టాలు తప్పవన్న వాదనలోనూ కొంత నిజం లేక పోలేదు.ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే, ప్రజలు రెండవ వాదన వైపే మొగ్గు చూపారు. 

అదలా, ఉంటే మోడీ ప్రభుత్వం ఏడేళ్ళలో, అధికార పార్టీ (బీజేపీ) భావజాల పరిధిలోని అనేక వివాదస్పద అంశాల విషయంలో ఎలాంటి బెరుకు భయం లేకుండా చకా చకా నిర్ణయాలు తీసుకుంది. ట్రిపుల తలాక్ రద్దు మొదలు  ఆర్టికల్ 370 రద్దు వరకు, పౌరసత్వ సవరణ చట్టం, రామజన్మ భూమి వంటి  దశాబ్దాలుగా నలుగుతున్న అనేక భావోద్వేగ  పూరిత సంబంధించి నిర్ణయాలను నిర్భయంగా తీసుకుంది. ఆందోళనలను సంర్ధవంతంగా ఎదుర్కుంది. భావజ్వాల వ్యాప్తికి గట్టి పునాదులు నిర్మించుకుంది. ఈ నేపధ్యంలోనే ఇక దేశంలో మితవాద రాజకీయాలు, అతి మితవాదంగా, తీవ్ర జాతీయవాదంగా పరిణమిస్తాయని, ఫలితంగా సమకూరే తిరుగులేని అధికారంతో నాయకులు నియంతలుగా మారే ప్రమాదం కూడా ఉన్నదని పరిశీలకులు హెచ్చరించారు. అయినా, మోడీ  ప్రభుత్వం. బీజేపీ దూకుడు తగ్గలేదు. ప్రభుత్వం ఒకదాని తర్వాత ఒకటిగా  భావజాల అనుకూల నిర్ణయాలు తీసుకుని, సవాలు విసిరింది. 

అలాంటిది,  అదే ప్రభుత్వం ఇప్పడు కొవిడ్ దెబ్బకు మైండ్ బ్లాక్ అయిపోయిందా అన్న విధంగా, చేష్టలుడిగి చూస్తోంది. కిం కర్తవ్యమ్’ అనేది అర్ధం కాక దిక్కులు చూస్తోంది. నిజానికి ఆరున్నరేళ్లకు పైగా, ఏ అవరోధమూ లేకుండా జైత్రయాత్ర సాగించిన నరేంద్రమోదీ సామర్ధ్యానికి ఇప్పుడు గట్టి ఎదురదెబ్బ తగిలింది. ఒక విధంగా మోడీ ప్రభుత్వ ప్రతిష్ట  ఇంత హఠాత్తుగా కుప్పకూలిపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే, అయినా అది నిజం. ఇప్పడు, అక్కడ మోడీ మొదలు ఇక్కడి సామాన్య కార్యకర్త వరకు ప్రతి ఒకక్రిలో విషాద ఛాయలు పస్పుటంగా కనిపిస్తున్నాయి. ఇదొక అనూహ్య పరిణామం. 

అయితే  ఈ మొత్తం వ్యవహారంలో, మోడీకి కాస్త ఊరట`కలిగించే అంశం ఏదైనా ఉందంటే, అది ప్రతిపక్షాల బలహీనత. ముఖ్యంగా రాహుల్ గాంధీ.. అతగాడి నోరు. అలాగే, మోడీకి ఉన్న బలం బావజాలం. సంఘ్ పరివారం. దేశంలో మరే పార్టీకికి లేని బలం , బలగం బీజేపీకి ఉన్నాయి, సో ..మోడీ  తాత్కాలికంగా కొంత మౌనంగా ఉన్నా, అదే ...శాశ్వతం అనుకోలేము .. ఎన్నికలకు ఇంకా మూడేళ్ళ సమయం ఉంది ... ఈ మూడేళ్ళలో ఏమైన జరగవచ్చును... ఏది జరిగినా అది దేశానికి మంఛి జరగాలి.. అదే సామాన్యుల కోరిక.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu