చలిగా ఉందని టీ తెగ తాగేస్తున్నారా? జర జాగ్రత్త..!
posted on Jan 24, 2026 11:19AM

వేసవి కాలంలో చల్లని పదార్థాలు, చలి కాలంలో వెచ్చని ఆహారాలు తీసుకోవాలని అనుకోవడం చాలా సాధారణం. ముఖ్యంగా చలికాలంలో ఉదయాన్నే వేడివేడి టీ తాగందే చాలామందికి తెల్లవారదు కూడా. లేవగానే ఒక కప్పుతో మొదలు పెట్టి, పూటకు ఒకసారి టీ తాగడమే కాకుండా.. పని చురుగ్గా జరగడం కోసం శరీరానికి ఉత్సాహం తెచ్చుకోవడానికి పదే పదే టీ తాగుతూ ఉంటారు. అయితే ఏదైనా సరే.. తీసుకునే దాన్ని బట్టి ఔషధంగానూ పనిచేస్తుంది, విషంగానూ పనిచేస్తుంది. ప్రతి రోజూ ఎన్ని కప్పుల టీ తాగడం ఆరోగ్యానికి మంచిది. ఎన్ని కప్పులు తాగడం హానికరంగా పరిగణించబడుతుంది. తెలుసుకుంటే..
శీతాకాలంలో ఒక కప్పు వేడి టీ శరీరం, మనస్సు రెండింటినీ ప్రశాంతపరుస్తుంది. టీ వెచ్చదనం చేతులకు ఉపశమనం కలిగిస్తే.. దాని నుండి వచ్చే ఆవిరి మొత్తం వాతావరణాన్ని హాయిగా చేస్తుంది. చలి రోజులలో చాలా మంది రోజంతా లెక్కపెట్టనట్టు టీ తాగడానికి ఇదే కారణం. అది వారి రోజువారీ అలవాటుగా మారుతుంది. మితంగా టీ తాగడం సాధారణంగా ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. కానీ ఎక్కువగా టీ తాగితే కొన్ని నష్టాలు కూడా కలిగిస్తుంది. ఎక్కువ టీ తాగడం వల్ల కలిగే నష్టాలేంటి? టీ తాగితే కలిగే ప్రయోజనాలు, నష్టాలేంటి?
టీ ప్రయోజనాలు..
సరైన మొత్తంలో టీ తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కొన్ని పరిశోధనలు క్రమం తప్పకుండా టీ తాగడం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్, టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని సూచిస్తున్నాయి. అయితే ఇది టీ రకం, తీసుకునే పరిమాణంపై ఆధారపడి ఉంటుంది.
టీలోని ఫ్లేవనాయిడ్లు, కాటెచిన్లు వంటి యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయని అంటున్నారు.
టీలోని కెఫిన్, ఎల్-థియనిన్ కాంబినేషన్ మనస్సును ప్రశాంతపరుస్తుంది, దృష్టిని మెరుగుపరుస్తుంది, కాఫీ కలిగించే ఆందోళనను నివారిస్తుంది.
అల్లం లేదా పుదీనా వంటి హెర్బల్ టీలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో, శరీర సహజ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. జలుబు ఫ్లూ సీజన్‌లో రోగనిరోధక శక్తిని కూడా బలపరుస్తాయి.
టీ తాగితే నష్టాలు..
అధికంగా టీ తాగడం వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయి. ముఖ్యంగా కెఫిన్ ఉన్న టీని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ప్రతికూల ప్రభావాలు ఉంటాయి.
టీలోని టానిన్లు ఐరన్ శోషణకు ఆటంకం కలిగిస్తాయి. ఇది రక్తహీనతతో బాధపడేవారికి లేదా శాఖాహార ఆహారం తీసుకునేవారికి చాలా సమస్యగా ఉంటుంది.
రోజుకు 400 mg కెఫిన్ మించితే నిద్ర సమస్యలు, విశ్రాంతి లేకపోవడం, హృదయ స్పందన రేటు పెరుగుదలకు దారితీస్తుంది.
ఖాళీ కడుపుతో స్ట్రాంగ్ టీ తాగడం వల్ల వికారం, ఆమ్లత్వం లేదా తలతిరుగడం వంటివి జరుగుతాయి. ఎక్కువకాలం టీని ఎక్కువగా తాగడం వల్ల దంతాలు మరకలు పడతాయి. కెఫిన్ వ్యసనానికి దారితీస్తుంది.
రోజుకు ఎంత తాగితే మేలు..
ఎన్ని కప్పుల టీ తాగడం హాని కలిగిస్తుంది అనే విషయంలో చాలా మంది గందరగోళ పడుతుంటారు. సాధారణంగా రోజుకు 3 నుండి 4 కప్పుల టీ తాగడం చాలా మందికి సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది.
కెఫిన్‌కు ఎక్కువ సెన్సిటివ్ గా ఉండేవారు లేదా కొన్ని ఆరోగ్య పరిస్థితులతో బాధపడేవారు టీ తీసుకోవడం పరిమితం చేసుకోవాలి.
గర్భిణీ స్త్రీలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. రోజుకు 2 కప్పుల కంటే ఎక్కువ తాగకూడదు.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...