డెల్టా తీవ్రతకు ఒమిక్రాన్ చెక్‌!.. రెండు వేరియంట్ల ఫైట్‌!!

కొవిడ్ విప‌రీతంగా వ్యాపిస్తోంది. చుట్టుప‌క్క‌ల చాలామందికి క‌రోనా సోకుతోంది. జ్వ‌రం వ‌చ్చినా.. ద‌గ్గు, జ‌లుబు, నొప్పులు వ‌చ్చినా.. కొవిడ్ అని ఫిక్స్ అయిపోతున్నారు. వెంట‌నే మందులు వాడేస్తున్నారు. గ‌తంతో పోలిస్తే.. మ‌ర‌ణాలు, ప్రాణాల మీద‌కు రావ‌డం, ఆసుప‌త్రిలో చేరాల్సిన అవ‌స‌రం..లాంటి ముప్పు త‌క్కువే అంటున్నారు. అయితే, కొవిడ్ అయితే క‌న్ఫామ్ అవుతోంది కానీ, అది డెల్టా వేరియంటో, ఒమిక్రాన్ ర‌క‌మో.. క్లారిటీ ఉండ‌ట్లేదు. డెల్టా అయితే వెరీ డేంజ‌ర‌స్‌.. అదే ఒమిక్రాన్ అయితే కాస్త బెట‌ర్‌.. అనే ఫీలింగ్‌తో ఉన్నారు జ‌నాలు. వ్యాక్సిన్ వేసుకున్న వారు కొవిడ్ బారిన ప‌డినా.. త్వ‌ర‌గానే కోలుకుంటున్నారు. వ్యాక్సినేష‌న్ కాని వారిలోనే ముప్పు అధికం. 

ఇక‌, ఒమిక్రాన్‌ వేరియంట్‌ వల్ల తీవ్రస్థాయి కొవిడ్‌-19 కేసులు తగ్గొచ్చని లేటెస్ట్ రీసెర్చ్ తెలిపింది. భవిష్యత్‌లో వైర‌స్‌ ఇన్‌ఫెక్షన్‌ వల్ల వ్యక్తులకు, సమాజానికి పెద్ద ఇబ్బందులు ఉండకపోవచ్చని వివరించింది. దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు నవంబరు, డిసెంబరులో ఒమిక్రాన్‌ బారినపడ్డ 23 మంది నుంచి నమూనాలు సేకరించి పరిశీలించారు. డెల్టా ఇన్‌ఫెక్షన్‌ వల్ల తలెత్తిన రోగనిరోధక రక్షణను.. ఒమిక్రాన్‌ ఏమార్చినట్లు గుర్తించారు.

ఆ ప‌రిశీల‌న‌ల‌నుబ‌ట్టి డెల్టా నుంచి కోలుకున్నవారికి ఒమిక్రాన్‌ వల్ల రీ ఇన్‌ఫెక్షన్‌ కలగొచ్చని స్పష్టమవుతున్నట్లు వారు తెలిపారు. అయితే ఒమిక్రాన్‌ను జయించినవారికి డెల్టా సోకకపోవచ్చని చెప్పారు. దీనివల్ల ఒమిక్రాన్‌కు పైచేయి లభిస్తుందని వివరించారు. డెల్టా రీ ఇన్‌ఫెక్షన్లకు ఒమిక్రాన్‌ అడ్డుకట్టే వేసే వీలుందన్నారు. 

అయితే పెద్ద సంఖ్యలో ప్రజలు వ్యాక్సిన్‌ పొందినప్పుడే ఈ ప్రభావం సాధ్యమవుతుందని అంటున్నారు. టీకా పొందనివారికి ఒమిక్రాన్‌తో వచ్చే అదనపు రక్షణలో కొంతమేర కోత పడుతుందని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకోని వారు డెల్టాను సమర్థంగా ఎదుర్కోలేరని ఆ సైంటిస్టులు చెబుతున్నారు. 

సో.. వ్యాక్సిన్ విష‌యంలో నిర్ల‌క్ష్యం వ‌ద్దు.. మాస్క్ అస‌లే మ‌ర‌వొద్దు.