పీఆర్సీపై త‌గ్గేదేలే.. రోడ్డెక్కిన ఉద్యోగులు.. జ‌గ‌న‌న్న‌కు సెగ త‌గిలేనా?

అది పీఆర్సీ కాదు.. రివ‌ర్స్ పీఆర్సీ.. పీఆర్సీ ప్ర‌క‌టిస్తే జీతాలు పెర‌గాలి కానీ.. త‌గ్గ‌డ‌మేంటి? అదే క‌దా జ‌గ‌న‌న్న మాయం. కాదు కాదు మోసం. ఐఆర్ కంటే ఫిట్‌మెంట్ త‌క్కువిచ్చి.. హెచ్ఆర్ఏలో కోతేసి.. డీఏల‌తో లెక్క‌ల గార‌డీ చేశారు. మొద‌ట్లో జ‌గ‌న‌న్న‌ జాదూను గుర్తించ‌లేక‌పోయిన ఉద్యోగ సంఘాలు చ‌ప్ప‌ట్లు కొట్టి సంబ‌రాలు చేసుకున్నారు. ఇప్పుడు జీవోలు వ‌చ్చాక గానీ.. తామెంత మోస పోయామ‌నేది.. జీతాలు ఎంత భారీగా త‌గ్గుతున్నాయ‌నేది తెలిసొచ్చింది. ఇక అంతే.. త‌గ్గేదేలే అంటూ పోరాటానికి దిగారు. స‌మ్మె చేసేందుకు సై అన్నారు. ఏపీ వ్యాప్తంగా ఉద్యోగులు రోడ్ల మీద‌కు వ‌చ్చి ధ‌ర్నాలు, నిర‌స‌న‌లు చేస్తున్నారు. జ‌గ‌న‌న్న‌కు ఉద్యోగుల సెగ త‌గిలేలా ఉద్య‌మిస్తున్నారు.

పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాలు రోడ్లమీదికొచ్చాయి. పోలీసులు ఉపాధ్యాయ సంఘాల నాయకులను రాత్రి నుంచే అడ్డుకుంటున్నారు. కలెక్టరేట్ల ముట్టడికి అనుమతి లేదని నోటీసులిస్తూ చాలా చోట్ల గృహనిర్బంధాలు చేశారు. అన్ని కలెక్టరేట్ల ద‌గ్గ‌ర‌ భారీగా పోలీసుల మోహరించారు. 

కడప  జిల్లా వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడికి సిద్ధమైన ఉపాధ్యాయ సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శిని గృహనిర్బంధం చేశారు. ప్రొద్దుటూరు నుంచి కడప కలెక్టరేట్‌కు వెళుతున్న ఉపాధ్యాయులను కొత్తపల్లె చెక్‌పోస్ట్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వారు రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన చేశారు. గుంటూరు  కలెక్టరేట్‌ ముట్టడికి వెళ్లకుండా పోలీసులు ముందస్తు నోటీసులిస్తున్నారు. పలువురు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ నేతలు గృహనిర్బంధంలో ఉన్నారు.   

నెల్లూరు  జిల్లాలో ఉపాధ్యాయ సంఘాల నాయకులను పలువురిని అరెస్టు చేయడంపై వెంకటగిరి పోలీస్ స్టేషన్ ద‌గ్గ‌ర‌ ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. ఆత్మకూరు, సంగం చెక్ పోస్టుల ద‌గ్గ‌ర‌ పోలీసులు తనిఖీలు చేపట్టారు. కలెక్టర్ కార్యాలయం ముట్టడికి వెళ్తున్న ఉపాధ్యాయులను అరెస్టు చేశారు.  

చిత్తూరు  కలెక్టరేట్‌ ముట్టడికి వెళ్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతిలో ఉద్యోగ సంఘాల నాయకులను గృహనిర్బంధం చేశారు. కర్నూలు  కలెక్టరేట్‌ ఎదుట ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. ఒంగోలు  కలెక్టరేట్‌ వద్దకు భారీగా చేరుకున్న ఉపాధ్యాయ సంఘ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విశాఖలో  ఏపీటీఎఫ్‌ జిల్లా కార్యదర్శిను గృహనిర్బంధం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎస్టీయూ నేతలను ముందస్తు అరెస్టులు చేశారు.