యాపిల్ ఫోన్లను బహిష్కరించండి- ట్రంప్!
posted on Feb 20, 2016 10:37AM
.jpg)
అమెరికా అధ్యక్ష పదవి కోసం ముందంజలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమెరికా న్యాయవ్యవవస్థకు సహకరించనందుకుగాను, యాపిల్‌కి సంబంధించిన ఉత్పత్తులన్నింటినీ బహిష్కరించాలని పిలుపునిచ్చారు. గత ఏడాది అమెరికాలోని కాలిఫోర్నియాలో ఒక ముస్లిం జంట తమ తుపాకులతో విధ్వంసాన్ని సృష్టించిన వార్త గుర్తుండే ఉంటుంది. ఈ కాల్పులలో 14మంది చనిపోయారు. నేరస్తుల గురించి పరిశోధనలో భాగంగా వారికి సంబంధించిన యాపిల్ ఐఫోన్ పోలీసుల చేతికి చిక్కింది. అయితే అందులో నిక్షిప్తం అయి ఉన్న సమాచారాన్ని వెలికితీయడంలో పోలీసులు విఫలమయ్యారు.
ఇందుకోసం యాపిల్ సంస్థను సంప్రదించగా, తమ ఫోన్లను డీకోడ్ చేసేందుకు తాము ఎట్టిపరిస్థితుల్లోనూ సాయం చేయమంటూ ఆ సంస్థ చేతులు ఎత్తేసింది. ఇలా చేయడమంటూ మొదలుపెడితే, తమ ఐఫోన్లను దుర్వినియోగపరిచే సందర్భాలు పెరిగిపోతాయనీ... తమ వినియోగదారుల వ్యక్తిగత సమాచారం ఇకమీదట రహస్యంగా ఉండలేదనీ యాపిల్ వాదన. యాపిల్ వాదన విన్న ట్రంప్‌కు మహా కోపం వచ్చేసింది. యాపిల్ సంస్థ దిగివచ్చి పరిశోధకులకు సహకరించేదాకా, ఆ ఫోన్‌ను తాను వాడబోనననీ... తన మద్దతుదారులు కూడా ఐఫోన్లను వాడరాదనీ పిలుపునిచ్చారు. మరి ట్రంప్ మాటలను ప్రజలు సీరియస్‌గా తీసుకుంటారా లేకపోతే ‘ఇలాంటి ప్రేలాపనలు ఈయనకి కొత్తకాదు కదా!’ అని ఊరుకుంటారా వేచిచూడాలి.