డిప్యూటీ సీఎంగా లోకేశ్‌.. లైన్ క్లియ‌రైందా?

తెలుగుదేశం జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ డిప్యూటీ సీఎంగా ప్ర‌మోట్ కాబోతున్నారా? టీడీపీ శ్రేణుల నుంచి రోజురోజుకు తీవ్ర‌మ‌వుతున్న ఈ డిమాండ్ పై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సానుకూలంగా స్పందించారా? కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క భాగ‌స్వామిగా కొన‌సాగుతున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ సైతం టీడీపీ కార్య‌క‌ర్త‌ల డిమాండ్ పై సానుకూలంగా ఉన్నారా? అంటే అవున‌నే స‌మాధానం ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.  తెలుగుదేశం పార్టీకి మూడో త‌రం వార‌సుడిగా.. రాబోయే కాలంలో పార్టీని న‌డిపించే నాయ‌కుడిగా లోకేశ్ ఇప్ప‌టికే పూర్తి స్థాయిలో త‌న స‌మ‌ర్ధ‌త‌ను చాటుకున్నారు. లోకేశ్ సార‌థ్యంలో టీడీపీకి బంగారు భ‌విష్య‌త్ ఉంటుంద‌ని ఆ పార్టీ క్యాడ‌ర్ బ‌లంగా న‌మ్ముతోంది. దీనికి కార‌ణం  లోకేశ్ రాజ‌కీయంగా ఎంతో ప‌రిణితిని క‌న‌బ‌ర్చ‌డ‌మే. ప్ర‌తి ప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అరాచ‌క పాల‌న‌కు ఎదురెళ్లి లోకేశ్ స‌వాల్ చేశారు. యువ‌గ‌ళం పాద‌యాత్ర‌తో ప్ర‌జ‌ల్లోకి వెళ్లి వైసీపీ అధిష్టానానికి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించారు. లోకేశ్ దూకుడు కార‌ణంగానే జ‌గ‌న్ అరాచ‌క పాల‌న‌కు భ‌య‌ప‌డి మూడేళ్లు బ‌య‌ట‌కురాని తెలుగుదేశం నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌తోపాటు ప‌లు వ‌ర్గాల ప్ర‌జ‌లు సైతం ఒక్క‌సారిగా రోడ్లెక్కి అప్ప‌టి ప్ర‌భుత్వంపై పోరు బాట‌ ప‌ట్టారు. దీంతో జ‌గ‌న్ ప‌త‌నానికి బీజం ప‌డిన‌ట్ల‌యింది.

 కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత‌ కూడా ప్ర‌భుత్వంలో నారా లోకేశ్ కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. త‌న ప‌రిధిలోఉన్న శాఖ‌ల్లో కీల‌క మార్పులు తీసుకువ‌స్తూ అభివృద్ధిని ప‌రుగులు పెట్టిస్తున్నారు. త‌న‌దైన మార్క్ ను చూపిస్తున్నారు. అన్నివిధాలా లోకేశ్ త‌న స‌మ‌ర్ధ‌త‌ను నిరూపించుకోవ‌టంతో తెలుగుదేశం శ్రేణులు డిప్యూటీ సీఎంగా లోకేశ్ ను ప్ర‌మోట్ చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఇప్ప‌టికే ఆ పార్టీలోని కీల‌క నేత‌లు బ‌హిరంగంగానే లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ చంద్ర‌బాబుకు విజ్ఞ‌ప్తి చేశారు. తెలుగుదేశం అధికార ప్ర‌తినిధి మ‌హాసేన రాజేశ్, పార్టీ పొలిట్ బ్యూరో స‌భ్యుడు శ్రీ‌నివాస్ రెడ్డితోపాటు డిప్యూటీ స్పీక‌ర్ గా ఉన్న ర‌ఘురామ కృష్ణరాజు, ఫిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎన్ వర్మ,  సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇలా ప‌లువురు నేత‌లు ఒక్కొక్క‌రుగా నారా లోకేశ్ ను డిప్యూటీ సీఎంగా ప్ర‌మోట్ చేయాల‌ని కోరుతున్నారు. ఇటీవ‌ల మైదుకూరు స‌భ‌లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆశీనులైన స‌భావేదిక‌పైనే శ్రీ‌నివాస్ రెడ్డి లోకేశ్ ను డిప్యూటీ సీఎంను చేయాలంటూ చంద్ర‌బాబుకు విజ్ఞ‌ప్తి చేశారు. ఇది నా ఒక్క‌డి అభిప్రాయం కాదు, తెలుగుదేశం క్యాడ‌ర్ అభిప్రాయం అని చెప్పారు. అయితే, చంద్ర‌బాబు శ్రీ‌నివాస్ రెడ్డి విజ్ఞ‌ప్తిపై స్పందించ‌లేదు. కానీ, తెలుగుదేశం ముఖ్య‌నేత‌లతో మాట్లాడుతున్న సంద‌ర్భంలో స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు కూట‌మి నేత‌ల‌తో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుందామ‌ని చంద్ర‌బాబు చెప్పిన‌ట్లు పార్టీ నేత‌ల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. 

గ‌త వైసీపీ ప్ర‌భుత్వంలో ఐదుగురు ఉప‌ముఖ్య‌మంత్రులు ఉండేవారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒక్క‌రే డిప్యూటీ సీఎంగా కొన‌సాగుతున్నారు. డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు.. అదో రాజకీయ పదవి అని చెప్పవచ్చు. ఎందుకంటే రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం అనే పదవి గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. అయితే, దాదాపు అన్ని రాష్ట్రాల్లోని ప్ర‌భుత్వాల్లో డిప్యూటీ సీఎంలు ఒక‌రు, అంత‌కంటే ఎక్కువ మంది ఉన్నారు. ఉప‌ముఖ్య‌మంత్రి అంటే రాజ్యాంగ‌బ‌ద్ద‌మైన ప‌ద‌వికాక‌పోయిన ఆ స్థానంలో ఉన్న‌వారు ముఖ్య‌మంత్రి త‌రువాత ముఖ్య‌మంత్రిగా రాజ‌కీయ పార్టీలు, ప్ర‌జ‌లు భావిస్తారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్య‌క్తి త‌న శాఖ‌ల‌పై స‌మీక్ష‌లు చేస్తూనే.. ఇత‌ర శాఖ‌ల‌పై స‌మీక్ష‌లు చేసే అవ‌కాశం కూడా ఉంటుంది. మంత్రుల కంటే డిప్యూటీ సీఎంకు ప‌వ‌ర్స్ ఎక్కువ అనే చెప్పొచ్చు. దీంతో కూట‌మిలో అతిపెద్ద పార్టీ అయిన తెలుగుదేశం నుంచి  నారా లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ గట్టిగా వస్తోంది.  మంత్రిగా ఉండ‌టం వ‌ల్ల కేవ‌లం కొంత‌మేర మాత్ర‌మే లోకేశ్ ప్ర‌భుత్వంలో భాగ‌స్వామ్యం కాగ‌లుగుతున్నారనీ, ఉప‌ముఖ్య‌మంత్రి హోదా ఉంటే పాల‌న‌పై పూర్తి స్థాయిలో ప‌ట్టు సాధించి, అభివృద్ధిని ప‌రుగులు పెట్టించేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు. అంతే కాకుండా లోకేష్ కు ప్రమోషన్ తెలుగుదేశం బలోపేతానికి సైతం దోహదపడుతుందని పార్టీ నేతలు సైతం చెబుతున్నారు. 

మంత్రి నారా లోకేశ్ ను డిప్యూటీ సీఎంగా ప్ర‌మోట్ చేయాల‌ని తెలుగుదేశం నేత‌ల నుంచి వ్య‌క్త‌మ‌వుతున్న డిమాండ్ ప‌ట్ల జ‌న‌సేన పార్టీ నేత‌లు మౌనంగానే ఉన్నారు. అయితే తెలుగుదేశం శ్రేణుల డిమాండ్ ను అవ‌కాశంగా తీసుకొని కూట‌మిలో విబేధాలు త‌లెత్తేలా చేయాల‌ని వైసీపీ సోష‌ల్ మీడియా గ‌ట్టిగానే ప్ర‌య‌త్నిస్తున్నది. జ‌న‌సేన పార్టీ కార్య‌క‌ర్త‌లమంటూ టీడీపీకి వ్య‌తిరేకంగా పోస్టులు పెడుతుండ‌టం విశేషం. అయితే, లోకేశ్ ను డిప్యూటీ సీఎంగా ప్ర‌మోట్ చేయాల‌న్న డిమాండ్ పై జ‌న‌సేన అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్ప‌టివ‌ర‌కు ఎక్క‌డా స్పందించ‌లేదు. మ‌రో వైపు చంద్ర‌బాబు కూడా ఈ అంశంపై  స్పందించ‌లేదు. కానీ, లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాల‌న్న డిమాండ్ రోజురోజుకు ఎక్కువ‌వుతుండ‌టంతో చంద్ర‌బాబు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌నే అంశంపై టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ నెల‌కొంది.