ఆంక్ష‌లు లేవ్‌.. థ‌ర్డ్ వేవ్ ముగిసిన‌ట్టే.. కొత్త వేరియంట్ క‌ష్ట‌మే!

తెలంగాణలో కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయని డీహెచ్‌ శ్రీనివాసరావు అన్నారు. జనవరి 23న థ‌ర్డ్ వేవ్‌ ఉద్ధృతి బాగా పెరిగిందని.. ఆ స‌మ‌యంలో పాజిటివిటీ రేటు అత్యధికంగా 5 శాతానికి వెళ్లిందని చెప్పారు. ప్రస్తుతం 2శాతం కంటే తక్కువ ఉందని.. ఇక తెలంగాణలో కరోనా మూడో దశ ముగిసిపోయినట్టేన‌ని తెలిపారు. వచ్చే కొద్ది నెలల పాటు కొత్త వేరియంట్‌ పుట్టే అవకాశం లేదు. కొవిడ్‌ త్వరలో ఎండమిక్‌ అవుతుంది. భవిష్యత్‌లో సాధారణ 'ప్లూ'లా కొవిడ్‌ మారుతుందన్నారు డీహెచ్ శ్రీనివాస‌రావు.   

కొవిడ్‌ ఆంక్షలు లేనందు వల్ల అన్ని సంస్థలు 100శాతం పని చేయొచ్చు. ఉద్యోగులు పూర్తి సంఖ్యలో కార్యాలయాలకు వెళ్లొచ్చు. ఐటీ కంపెనీలు సైతం వర్క్‌ ఫ్రం హోం తీసివేయవచ్చు. విద్యాసంస్థలను పూర్తిగా ప్రారంభించామ‌ని తెలిపారు.

థ‌ర్డ్ వేవ్‌ కేవలం రెండు నెలల్లోనే అదుపులోకి వచ్చింది. జనవరి 25న అత్యధికంగా 4,800 కేసులు నమోదయ్యాయి. థ‌ర్డ్ వేవ్‌ మొత్తంలో కేవలం 3వేల మంది రోగులు మాత్రమే ఆసుపత్రుల్లో చేరారు. ఇటీవల నిర్వహించిన ఫీవర్ సర్వేలో నాలుగు లక్షల మందికి కిట్‌లు అందజేశామ‌న్నారు డీహెచ్‌.   

టీకా తీసుకున్న వారిలో వైరస్‌ ప్రభావం తక్కువగా ఉంది. ఫీవర్‌ సర్వే ద్వారా ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కిట్లు అందజేశారు. రాష్ట్రంలో ఎలాంటి కొవిడ్‌ ఆంక్షలు లేవు.. కరోనా మూడో దశ ముగిసినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. కొవిడ్‌ నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు. 

కొవిడ్ ఫ‌స్ట్ వేవ్‌ దాదాపు 10 నెలలు న‌డిచింది.. రెండో దశ ఆరు నెలలు ఉంది.. ఇక‌, మూడో దశలో 28 రోజుల్లోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ నియంత్రణలో వ్యాక్సిన్ కీలక ఆయుధంగా పని చేసిందన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu