రాష్ట్ర విభజనపై మళ్లీ మాట్లాడిన మోడీ... ఏమన్నాడంటే!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ స్వార్థం కోసమే హడావుడిగా విభజించిందని ప్రధాని మోదీ ఆరోపించారు. విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా విభజించినప్పటికీ కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మలేదన్నారు. సరైన విధంగా విభజించి ఉంటే ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన జరిగిన తీరుతో అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ ఇప్పటికీ నష్టపోతూనే ఉన్నాయని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి రాజ్యసభలో ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీ తీరును బాగా ఎండగట్టారు.

తెలంగాణ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని ప్రధాని మోదీ అన్నారు. వాజ్పేయి హయాంలో మూడు రాష్ట్రాలను ఎలాంటి ఇబ్బందులూ తలెత్తని విధంగా ఏర్పాటు చేసిన సంగతిని మోదీ గుర్తుచేశారు. అందరూ కలిసి కూర్చుని, చర్చించి శాంతియుతంగా ఆ రాష్ట్రాల ఏర్పాటు బిల్లులు పాస్ చేశారన్నారు. కానీ ఏపీ, తెలంగాణ విషయంలో అలా జరగలేదని వివమర్శించారు. ఏపీ పునర్విభజన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్ తలుపులు మూసేసిందని, సభ లోపల మైకులు ఆపేసిందని, కాంగ్రెస్ సభ్యులు పెప్పర్ స్ప్రే కొట్టారని ఎద్దేవా చేశారు. విభజన చట్టంపై ఏ విధమైన చర్చా జరపకుండానే ఏపీని కాంగ్రెస్ సర్కార్ విభజించిందని మోదీ విమర్శించారు. ఇదేనా ప్రజాస్వామ్యం అని మోదీ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అహంకారానికి, అధికార కాంక్షకు ఇదే నిదర్శనం అంటూ మోదీ విరుచుకుపడ్డారు. సరైన పద్ధతిలో విభజన జరిగి ఉంటే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సమస్యలు వచ్చేవి కావు అని మోదీ తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu