కోహ్లీ ఫ్ర‌స్టేష‌న్‌లో ఉన్నాడా? మరో వివాదంలో మాజీ కెప్టెన్‌..

విరాట్ కోహ్లీ. టీమిండియా నెంబ‌ర్ వ‌న్ బ్యాట్స్‌మెన్‌. నెంబ‌ర్ వ‌న్ కెప్టెన్‌. నెంబ‌ర్ వ‌న్ ఫీల్డ‌ర్‌. కోహ్లీ ఇండియ‌న్ క్రికెట్‌లో ఓ ఆణిముత్యం. ఏళ్లుగా జ‌ట్టులో ఉన్నాడు. ఏళ్ల పాటూ టీమ్‌ను లీడ్ చేశారు. స‌హ‌చ‌రుల‌ను ఎంకరేజ్ చేస్తూ.. వారి నుంచి మెరుగైన ప్ర‌తిభ రాబ‌ట్టాడు. ఇటీవ‌లే.. వివాదాస్ప‌దరీతిలో అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. ఆ ఫ్ర‌స్టేష‌న్ కోహ్లీలో బాగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. అందుకే, కాస్త నెగ్లిజెన్సీతో పాటూ యాటిట్యూడ్ కూడా మారిపోయింద‌ని చెబుతున్నారు. తాజాగా, ఓ కాంట్ర‌వ‌ర్సీ ఆయ‌న్ను చుట్టుముట్టింది. 

జాతీయ గీతం అంటే దేశ పౌరులంద‌రికి గౌర‌వం. జాతీయ గీత ఆలాప‌న జరుగుతుంటే.. అంతా అటెన్ష‌న్‌లో ఉండాల్సిందే. గీతం పాడాల్సిందే. ఆ విష‌యం కోహ్లీకి చాలా బాగా తెలిసిందే. అయినా, ఏమైందో ఏమో గానీ.. ఏ మూడ్‌లో ఉన్నాడో ఏమో గానీ.. జాతీయ గీతం ఆల‌పిస్తుండ‌గా.. అత‌డు కోర‌స్ క‌ల‌ప‌కుండా.. చూయింగ్‌గ‌మ్ న‌ములుతూ.. నెగ్లిజ‌న్స్‌గా ఉండ‌టం వివాదాస్ప‌ద‌మైంది. కోహ్లీపై విప‌రీత కామెంట్లు వ‌స్తున్నాయి. ఫుల్‌గా ట్రోల్ చేస్తున్నారు. ఇంత‌కీ అస‌లేం జ‌రిగిందంటే...

భారత్‌, దక్షిణాఫ్రికా మూడో వన్డే మ్యాచ్‌ ప్రారంభానికి ముందు రెండు జట్ల ఆటగాళ్లు గ్రౌండ్‌లోకి వచ్చి జాతీయ గీతాలాపన చేశారు. భారత ఆటగాళ్లు జాతీయ గీతం పాడుతుండగా కోహ్లీ మాత్రం చూయింగ్‌ గమ్‌ నములుతూ గీతాలాపన చేస్తుండటం కన్పించింది. ఇందుకు సంబంధించిన వీడియోలను కొందరు రికార్డ్‌ చేసి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారాయి. కోహ్లీ తీరుపై నెట్టింట పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కోహ్లీ జాతీయ గీతాన్ని అవమానించారంటూ నెటిజన్లు, క్రికెట్‌ అభిమానులు మండిప‌డుతున్నారు. 

దక్షిణాఫ్రికా టూర్‌లో టీమిండియాకు 0-3తో వైట్‌వాష్ త‌ప్ప‌లేదు. మొద‌టి, చివ‌రి మ్యాచుల్లో హాఫ్ సెంచ‌రీల‌తో కోహ్లీ రాణించాడు. సెకండ్ వ‌న్డేలో మాత్రం డ‌కౌట్ అయ్యాడు. ఆ మాత్రానికే ఆయ‌న‌పై వివ‌ర్శ‌లు చేశారు కొంద‌రు. ఇప్పుడిలా జాతీయ గీతాలాప‌న విష‌యాన్నీ కావాల‌నే కాంట్ర‌వ‌ర్సీ చేస్తున్నార‌ని కోహ్లీ ఫ్యాన్స్ మండిప‌డుతున్నారు. కోహ్లీది ఏదో బై మిస్టేక్ మాత్ర‌మే కాద‌ని.. ఆ ఎపిసోడ్‌ను ఇక్క‌డితో ఆపేయ‌మంటూ సోష‌ల్ మీడియాలో కౌంట‌ర్ మెసేజ్‌లు పెడుతున్నారు. కెప్టెన్సీ నుంచి వైదొలిగాక‌.. కోహ్లీ ఏం చేసినా.. తుమ్మినా, ద‌గ్గినా.. న్యూసో, ఇష్యూనో అయ్యేలా ఉందంటున్నారు.