పారా హుషార్.. చిరుత తిరుగుతోంది..
posted on Jan 24, 2022 10:31AM
అరణ్యాల్లో ఉండే క్రూరమృగాలు జనారణ్యాల్లోకి క్యూ కడుతున్నాయి. గత కొన్నేళ్లుగా క్రూర మృగాలు ఊళ్ల మీద పడుతున్న సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్టు ఆలస్యంగా బయటపడింది. జిల్లా కేంద్రంలోని తిమ్మసానిపల్లి, ఎర్రగుంట తండా సమీపంలోని అటవీ ప్రాంతంలో రెండు మేకలను చిరుత చంపి తిన్నట్టు గుర్తించారు. రెండు మేకలను చంపిన చిరుత.. ఒక మేకను పూర్తిగా తినేయగా. మరో మేకను సగం కన్నా ఎక్కువ భాగం తిని వదిలేసింది. వాటి కళేబరాలను స్థానిక తండావాసులు చూసి ఇది చిరుత నిర్వాకమేనని అంచనా వేశారు. ఆ తరువాత అటవీ సిబ్బందికి సమాచారం అందించారు. ఆ స్థలాన్ని పరిశీలించిన అటవీ అధికారులు చిరుత సంచరిస్తున్నట్టు నిర్ధారించారు.
దీంతో మహబూబ్ నగర్ వాసులు హడలిపోతున్నారు. జిల్లా కేంద్రం శివారులోని తండాల సమీపంలో తచ్చాడుతున్న చిరుత ఎప్పుడైనా, ఏ క్షణాన్నైనా ఊరు మీదికి పడే ప్రమాదం పొంచి ఉందని బెంబేలెత్తుతున్నారు. ఒకవేళ చిరుత ఆ ప్రాంతం వీడి దూరంగా వెళ్లిపోయిందా.. లేక సమీప ప్రాంతాల్లోనే ఇంకా సంచరిస్తున్నదా అన్నది తెలియడం లేదు. అసలు చిరుత ఒక్కటే తిరుగుతోందా.. లేక వాటి సంఖ్య ఇంకా ఎక్కువుందా అన్న అనుమానాలతో సామాన్య జనం హడలిపోతున్నారు. ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్న అటవీ సిబ్బంది చిరుతకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఆరా తీస్తున్నారు.
మేకల కళేబరాలు ఉన్న ప్రాంతం నుంచి చిరుత ఎటువైపుగా సాగిపోయిందో తెలుసుకొని.. అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్టులోకి వెళ్లి ఉంటుందా.. లేక తండాల పక్కనే అడవుల్లో సంచరిస్తున్నదా అనేది ఆరా తీస్తున్నారు. మొత్తానికి చిరుతపులి సమాచారంతో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం వాసులే గాక జిల్లాలోని పలు గ్రామాల ప్రజల్లో భయాందోళనలు రేగుతున్నాయి.