గ్రూపుల గోలకు చెక్.. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా హైకమాండ్ వ్యూహాలు!

తెలంగాణ కాంగ్రెస్ వచ్చే ఎన్నికలలో విజయమే లక్ష్యంగా తడబాటు లేకుండా సూటిగా ముందుకు సాగుతోంది. అసమ్మతులు, అసంతృప్తుల రణగొణధ్వనులను పార్టీ హైకమాండ్ లెక్క చేయడం లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా రాష్ట్రంలో తమ స్టేక్ తీసుకోవాలన్న కృత నిశ్చయంతో హై కమాండ్ ప్రణాళికా బద్ధంగా, వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.

అయితే సహజంగానే కాంగ్రెస్ లో గ్రూపులు సంస్కృతి ఎక్కువ. దేశంలోని ఏ ఇతర రాష్ట్రం కంటే తెలంగాణలో ఆ సంస్కృతి మరికొంచెం అధికం. తెలంగాణ కాంగ్రెస్ లో  పార్టీ క్యాడర్ కంటే నాయకుల సంఖ్యే ఎక్కువ అంటుంటారు. రాష్ట్రంలో ప్రతి నాయకుడూ ఓ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిననే భావిస్తుంటారు. 2014 ఎన్నికలలో ఈ విషయం ప్రస్ఫుటంగా కనిపించింది. సమష్టితత్వం లోపించడం, ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరించిన కారణంగానే రాష్ట్ర విభజన తరువాత జరిగిన తొలి ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ చతికిల బడింది. ఇక అప్పటి నుంచి రాష్ట్ర పార్టీ పగ్గాలను హైకమాండ్ రేవంత్ రెడ్డికి అప్పగించే వరకూ జారుడుబండ మీద బ్యాలెన్స్ కు విఫలయత్నం  చేసిన చందంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పతనం నుంచి పతనానికి దిగజారుతూ వచ్చింది. ఏ ఎన్నిక  జరిగినా ఓటమి కోసమే పోటీ చేస్తున్నదా అన్నట్లుగా ఆ పార్టీ విజయాల గ్రాఫ్ ఉంది. అయితే రేవంత్ టీపీసీసీ పగ్గాలు చేపట్టిన తరువాత ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది.

నేతల అసంతృప్తి, అసమ్మతిల సంగతి పక్కన పెట్టి రేవంత్ క్యాడర్ లో జోష్ నింపడమే లక్ష్యంగా ముందుకు సాగారు. ఆయన పగ్గాలు చేపట్టిన తరువాత జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో పార్టికి విజయం సిద్ధించకపోయినా గట్టి పోటీ అయితే ఇచ్చిందనడంలో సందేహం లేదు. దీంతో హైకమాండ్ రేవంత్ పై గురి కుదిరింది. దీంతో  సీనియర్ల మంటూ కొందరు నాయకుులు అడుగడుగునా రేపుతున్న రచ్చకు గట్టి చెక్ పెట్టే దిశగా అధిష్ఠానం గట్టి చర్యలు తీసుకుంది. నేరుగా ప్రియాంక గాంధీ రంగంలోకి దిగి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అసమ్మతి గళాలను దారిలోకి తీసుకువచ్చింది. 

ఇప్పుడు ఎన్నికల ముంగిట సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో కనిపించే రచ్చ పెద్దగా కానరావడం లేదంటే అది హైకమాండ్ సీనియర్లకు చెక్ పెట్టిన కారణమేనని పరిశీలకులు అంటున్నారు. వచ్చే ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల టికెట్ల విషయంలో సీనియర్లెవరూ పెద్దగా మాట్లాడటం లేదు. మాజీ మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఇంకా మరి కొందరూ తమతో పాటు తమ కుటుంబ సభ్యులకూ టికెట్లు ఇవ్వాలనీ, అలాగే తమ అనుచరులకూ టికెట్లు కేటాయించాలంటూ మొదట్లో ఒకింత హడావుడి చేశారు. అయితే అలాంటి వారందరినీ హైకమాండ్ గట్టిగా చెప్పింది. పార్టీ టికెట్ మీకా మీ కుటుంబ సభ్యులలో ఒకరిగా మీరే తేల్చుకోండి అంటూ విస్పష్టంగా చెప్పేసింది.

ఎంత కాలం నుంచి పార్టీలో ఉంటున్నామన్నది కాదనీ, ప్రజలలో ఉన్న ఆదరణ, నియోజకవర్గాలలో గెలిచే అవకాశాలు ఇవే టికెట్ల కేటాయింపునకు ప్రాతిపదిక అని కుండబద్దలు కొటేసింది. దీంతో సీనియర్ల హైకమాండ్ వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో విజయం విషయంలో ఎంత సీరియస్ గా ఉందన్నది అర్థం చేసుకుని మౌనం వహించారు. అలాగే పార్టీలోకి చేరికల విషయంలో కూడా కాంగ్రెస్ హైకమాండ్ పార్టీ నేతలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. చేరికలను అడ్డుకుంటే సహించేది లేదన్న హెచ్చరిక జారీ చేసింది.  

నల్లగొండ జిల్లాలో ఇక ఎవర్నీ చేర్చుకోమని ఏకపక్షంగా ప్రకటన చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డికి షాక్ ఇస్తూ ఆయన ఇష్టానికి విరుద్ధంగా వేముల వీరేశంకు పార్టీ కండువా కప్పి చేర్చుకుంది.   పార్టీలోకి వచ్చి చేరేవారికి గెలిచే, గెలిపించే సత్తా ఉంటే వారి కోటాలో రెండేమిటి.. మూడు టికెట్లైనా ఇవ్వడానికి రెడీయే అన్న సంకేతాలను పంపింది. బీఆర్ఎస్ తో విభేదించి కాంగ్రెస్ గూటికి చేరిన మైనంపల్లి హనుమంతరావుకు, ఆయన కుమారుడికి వచ్చే ఎన్నికలలో పోటీ చేయడానికి వారు కోరుకున్న మల్కాజ్ గిరి, మెదక్ లలో పెటీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.  తనకూ తన కుమారుడికీ టీకెట్లు ఇస్తే తన వంతుగా మరో నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించే బాధ్యత తనదేనని మైనంపల్లి గట్టిగా చెప్పడంతో కాంగ్రెస్ అందుకు సై అందని పార్టీ శ్రేణులే అంటున్నాయి.  

 తెలంగాణలో అసమ్మతి, అసంతృప్తులకు కళ్లెం వేయడమే కాకుండా, సీనియర్లం మా మాటే శాసనం అంటూ ఇంత కాలం చక్రం  తిపిన వారికి కళ్లెం వేసి గెలుపు గుర్రాలకే టికెట్లు, మరో మాటకే అవకాశం లేదు అన్నట్లుగా కాంగ్రెస్ హైకమాండ్ గట్టిగా నిలబడటంతో  కాంగ్రెస్ కు విజయానికీ మధ్య  నిలిచే గ్రూపుల గొడవ ఇప్పుడు పార్టీలో కనుచూపుమేరైనా కనిపించడం లేదు. అదే సమయంలో బీఆర్ఎస్, బీజేపీలలో ఈ గ్రూపుల లొల్లి ఆ పార్టీల గెలుపు అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్ర విభజన తరువాత తొలి సారిగా తెలంగాణలో కాంగ్రెస్ బలంగా కనిపిస్తోందని అంటున్నారు.