వంశీకి బెయిలొచ్చింది కానీ..!

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఎట్టకేలకు దాదాపు 3 నెలల తరువాత బెయిలు మంజూరైంది. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు దారు సత్యవర్థన్ ను కిడ్నాప్ చేసి, బెదరించి ఆ కేసు ఉపసంహరించుకునేలా చేసిన కేసులో వల్లభనేని వంశీని ఈ ఏడాది ఫిబ్రవరి 13న పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ రిమాండ్ ఖైదీగా విజయవాడ జిల్లా జైలులో ఊచలు లెక్కిస్తున్న వంశీకి ఎస్సీఎస్టీ కోర్టు మంగళవారం బెయిలు మంజూరు చేసింది.

ఇది వంశీకి ఒకింత ఊరటకలిగించే విషయమే అయినా.. ఈ కేసులో బెయిలు వచ్చినంత మాత్రాన ఆయన విడుదలయ్యే అవకాశాలు లేవు. అందుకే ఇంకా జైలులోనే ఉన్నారు. ఎందుకంటే వంశీపై మొత్తం నాలుగు కేసులు ఉణ్నాయి. సత్యవర్థన్ కిడ్నాప్ కేసు మాత్రమే కాకుండా గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి, భూకబ్జా, అక్రమ మైనింగ్ కేసులు ఉన్నాయి. వీటిలో సత్యవర్థన్ కిడ్నాప్, అక్రమ మైనింగ్ కేసులలో మాత్రమే వంశీకి బెయిలు లభించింది.

ఇంకా గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో సీఐడీ సీబీఐ దాఖలు చేసిన కేసులో ఆయనకు కోర్టు మే 21 వరకూ రిమాండ్ విధించింది.  ఆ కేసులో వంశీకి ఈ నెల 22న బెయిలు లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయని వైసీపీ వర్గాలు, వంశీ అనుకూలురు అంటున్నారు. ఒక వేళ వారు ఆశిస్తున్నట్లు జరిగితే ఆయన బెయిలుపై బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి.