మహానాయకుడి అరెస్టు మాటల కందని మహా విషాదం!

నాకు వ్యక్తిగతం లేదు, ప్రజలు, రాష్ట్రమే ముఖ్యం అంటూ నిరంతరం శ్రమిస్తున్న మచ్చ లేని మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడిపై అక్రమ కేసు పెట్టి అరెస్టు చెయ్యడం మాటల కందని మహా విషాదమనే చెప్పాలి.  కక్ష సాధించడం కోసం అన్యాయంగా గొప్ప నాయకుడిని జైలులో పెట్టి సీఎం జగన్‌రెడ్డి తన కళ్ళల్లో నిప్పులు పోసుకొన్నారు. గంద సింధూరం రాజమార్గాన పోతుంటే కుక్కలు ఎన్ని మోరిగితే ఏమవుతుంది అన్న సామెతగా, పస లేని, పనికి మాలిన ఆరోపణలతో చంద్రబాబుకు మసి పూయగలవా జగన్ రెడ్డి? చంద్రబాబు ఒక శిఖరం. ఆ శిఖరాన్ని అందుకోవాలంటే జగన్‌రెడ్డికి  పది జన్మలు ఎత్తినా సాధ్యం కాదు.

చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్న జగన్మోసకారి మాయోపాయాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు ప్రజలు. తెలుగువారే కాదు, అన్నీ దేశాలలో ఆత్మీయంగా అభిమానించే ఆదర్శనాయకుడు చంద్రబాబు. పడగొట్టిన రాష్ట్రాన్ని గొడ్డు చాకిరీ చేసి నిలబెట్టినా ప్రజలు ఓడించారు. అయినా ప్రజల నిర్ణయాన్ని శిరసావహించి ప్రతిపక్షనాయకుడిగా నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటులో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై మాజీ సీయం చంద్రబాబును అరెస్టు చేసిన సమయంలో సిఐడి పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత దారుణం. ఆయన హోదా, వయసు, పౌర హక్కులు, చట్ట నియమ నిబంధనలను సిఐడి తుంగలో తొక్కడం జగన్ రెడ్డి ప్రభుత్వ నియంత, కక్ష సాధింపు వైఖరికి నిదర్శనం. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్ల ఏర్పాటులో రూ.270 కోట్ల ప్రభుత్వ నిధులను డొల్ల కంపెనీలు నెలకొల్పి పథకం ప్రకారం చంద్రబాబు వ్యక్తిగత లబ్ధి పొందారన్నది సిఐడి ఆరోపణ. 

2015-16లో జరిగిందంటున్న అవినీతిపై వైసీపీ వచ్చాక 2021లో కేసు నమోదైంది. సిఐడి కొంత మందిని అరెస్ట్‌ చేసి ఛార్జిషీట్‌ వేసింది. నిందితులు బెయిల్‌పై  విడుదలయ్యారు. హైకోర్టులో విచారణ పూర్తి అయి తీర్పు రిజర్వ్‌ అయింది. మొదట  ఎఫ్‌ఐఆర్‌లో లేని చంద్రబాబు పేరు అనూహ్యంగా ఇప్పుడు ఎలా తెర మీదికి తెచ్చారు? రిమాండ్ రిపోర్టులో  సీఐడి ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవు. చంద్రబాబుపై చేసిన ఆరోపణలు అన్నీ రాజకీయ కుట్రలో భాగమే. ఒక తప్పుడు కేసు పెట్టి  చంద్రబాబును అన్యాయంగా  ఇరికించారు. ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరు లేకుండా, ప్రాధమిక సాక్ష్యాధారాలు లేకుండా అరెస్టు చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్‌లో నిధులు దుర్వినియోగం జరిగిందంటూ 2021 డిసెంబరులో కేసు నమోదు చేశారు. కానీ కేసు ఎలాంటి విచారణ లేకుండా, ఎలాంటి చార్జిషీట్‌ వేయకుండా, సాక్ష్యాలు లేకుండా... చంద్రబాబును అరెస్టు చేయడం రాజకీయ కక్ష సాధింపు కాక మరేమిటి?  దాదాపు రెండేళ్ల తర్వాత అది కూడా 36 మంది అధికారులు బయట ఉండగా ఎలాంటి పురోగతి లేని కేసులో ఎలాంటి సాక్ష్యాలు బయటపడని 36 మందిని వదిలేసి 37వ వ్యక్తిపై సాక్ష్యాలు లేకుండానే 37వ నిందితుడిగా చంద్రబాబును అరెస్టు చేయడం ఎంత దారుణం?
                    
చంద్రబాబు వ్యక్తిత్వం ఎందరికో ఆదర్శం, దేశంలో అందరికంటే అనుభజ్ఞుడైన మచ్చలేని  ప్రజానాయకుడు ఆయన. తెలుగు ప్రజలు అందరికంటే ఎక్కువగా ఆదరించి అక్కున చేర్చుకున్న నాయకుడుగా ఆయన చరిత్రలో నిలిచిపోతారు. ఏడు పదులు దాటిన వయస్సు అందులో 45 ఏళ్ళు ప్రజాజీవితమే. రెండు దఫాలు మంత్రిగా, ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌కి తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, మరో పదేళ్ళు ప్రతిపక్షనేతగా, విభజన అనంతరం ఏర్పడ్డ నవ్యాంధ్రకు అయిదేళ్ళు ముఖ్యమంత్రిగా, ఇప్పుడు నవ్యాంధ్రలో నాలుగున్నరేళ్లుగా ప్రతిపక్ష నాయకుడుగా వున్నారు. ఇంత సుదీర్ఘ కాలం ప్రజా నాయకుడుగా 1956 నుండి ఇప్పటి వరకు సుదీర్ఘ అనుభవంతో ఆయనతో పోల్చ దగ్గ నాయకుడు లేడు. కఠోర శ్రమ, క్రమశిక్షణ, విలువలతో కూడిన నియమబద్దమైన జీవన శైలి ఆయనది. భావితరాల శ్రేయస్సు కోసం, నిరంతర ఆలోచనలతో, విన్నూత్న ప్రణాళికలు రూపొందించడంలో ఆయనకు ఆయనే సాటి అని నిరూపించుకొన్న కార్యదక్షుడు. తన దార్శనికతతో తెలుగుజాతి భవితను తీర్చి దిద్దడమే కాకుండా సరికొత్త విధానాలతో నవ్య చరిత్రకు నాంది పలికి దేశ రాజకీయాలలో ప్రత్యేక గుర్తింపు పొందారు. విద్యార్ధి నాయకుడి నుంచి రాష్ట్ర పరిపాలనా సారధి వరకు, దేశ, రాష్ట్ర రాజకీయాలలో ఎదగాలనుకొనే వారికి చంద్రబాబు ఒక పుస్తకం అని చెప్పాలి. నాలుగు దశాబ్దాలకుపైగా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో సవాళ్లు, మరెన్నో సంక్షోభాలను ఎదుర్కొని వాటినే అవకాశాలుగా మలుచుకొని దార్శనికత నేతగా ఎదిగిన చంద్రబాబు వ్యక్తిత్వం, ఆయన ఆదర్శ విధానాలు నేటి యువతకి స్పూర్తి దాయకం. చంద్రబాబు అంటే విజన్, ఆయన విశ్రమించని మిషన్, ఆయనొక  పెర్ఫార్మర్, ఒక రిఫార్మర్. విశ్రాంతి అవసరం లేని, సమయం తెలియని నాయకుడు. కాళ్ళకి చక్రాలు, కాలానికి రెక్కలు తొడిగే అవిశ్రాంత పధికుడు. మోటివేటర్, యువతకు మార్గదర్శకుడు. అనన్య పాలనా దక్షుడు. 

ప్రతినిముషం  ప్రజలకోసం పరితపిస్తున్న నాయకుడు. నిరంతరం జనంలోనే, జనంతోనే, దేశంలోనే మంచి అడ్మినిస్ట్రేషన్‌తో పాలించిన నాయకుడు చంద్రబాబు. హైదరాబాద్ నగర రూపురేఖలు మారడానికి ఆయన దూరదృష్టే కారణం. ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్,  మెడికల్ సంస్థలు ఇబ్బడి ముబ్బడిగా ఏర్పాటు చెయ్యడంతో ఆర్ధికవ్యవస్థ బలోపేతమైంది. చంద్రబాబునాయుడు అహోరాత్రులు చేసిన కృషి ఫలితంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు లభించింది. టైమ్ మ్యాగజైన్ చంద్రబాబుని సౌత్ ఏషియన్ ఆఫ్ ది ఇయర్‌గా గుర్తిస్తే, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ చంద్రబాబును ప్రపంచ డ్రీమ్ క్యాబినెట్‌లో ఉండాల్సిన వ్యక్తిగా ఎంపిక చెయ్యడం గర్వకారణం. ఇండియా టుడే పత్రిక చంద్రబాబును ఐటి ఇండియన్ ఆఫ్ ది మిలీయంగా సత్కరిస్తే, బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎకనామిక్ టైమ్స్ గౌరవించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో పాల్గొనడానికి ఒక రాష్ట్ర్ర ముఖ్యమంత్రికి ఆహ్వానం రావడం అనేది చంద్రబాబుతోనే ప్రారంభం అయింది. 

                
హైదరాబాద్‌లో ఐటీ రంగంలో ఉద్యోగాలు చేస్తున్న వారంతా చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పాలని ఆ మధ్య అహ్లు వాలియా అనడం అంటే ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలినీయంగా ప్రసిద్ధి పొందిన చంద్రబాబు ఖ్యాతి ఎలాంటిదో అర్ధం అవుతుంది. చంద్రబాబు విశేష కృషికి అద్భుత వరం హైటెక్ సిటీ నిర్మాణం. భారీ వేతనాలతో కూడిన లక్షలాది ఉద్యోగాలు, ఏటా వేల కోట్ల రూపాయల ఐటి ఎగుమతులు ఈనాడు సాధ్యమవుతున్నాయి అంటే ఆనాడు చంద్రబాబు కృషే కారణమని చెప్పాలి. బెంగుళూరు, ముంభైతో పోటీ పడి ఐటి రంగాన్ని హైదరాబాద్ ఆకర్షించడానికి చంద్రబాబు చొరవే కారణం. ఆయన ఉమ్మడి రాష్ట్రాభివృద్దికి చేపట్టిన వినూత్న కార్యక్రమాలు యావత్ భారతదేశాన్నే కాక ప్రపంచ ఆర్ధిక నిపుణులను ఆకర్షించాయి. జంట నగరాలకు తోడు సైబరాబాద్‌ను సృష్టించి ఆంధ్రుల రాజధానికి ప్రపంచపటంలో గుర్తింపు తెచ్చారు.   

రాజకీయంగా ఎన్టీఆర్ రాష్ట్రానికి, తెలుగుజాతికి ఎంతటి ప్రాముఖ్యత, ప్రాభవం తెచ్చారో అభివృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు అంతే గుర్తింపు తెచ్చారు. వినూత్న ఆలోచనలు, విలువలతో కూడిన రాజకీయాలతో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటానికి, అత్యుత్తమ రాష్ట్రంగా నిలబెట్టడానికి నిరంతరం ఆయన శ్రమించారు. రాజకీయ నాయకుడు వచ్చే ఎన్నికల గురించి ఆలోచిస్తాడు. రాజనీతిజ్ఞుడు భావి తరాల గురించి ఆలో చిస్తాడు. దేశాభివృద్ది కానీ, రాష్ట్రాభివృద్ది కానీ, స్వార్ధ, సాధారణ నాయకులతో సాధ్యం కాదు. అందుకే జాతి కోసం శ్రమించే వారిని, జాతిని పీల్చి పిప్పి చేస్తున్న వారిని గుర్తించకపోతే ఆ జాతి ఎప్పటికీ పెదగానే మిగిలిపోతుంది. విద్యార్థి నాయకుడి నుంచి రాష్ట్ర పరిపాలనా సారధి వరకు రాజకీయాలలో ఎదగాలనుకొనే వారికి చంద్రబాబు ఒక పుస్తకం. 

అధికారంలో వున్నా, ప్రతిపక్షంలో వున్నా ఆయనది చెరగని ముద్ర ఆయన పట్టుదల. అంకితభావం. ఆయన కృషి అనన్య సామాన్యం. ఆయన పోరాటం అసిధారా వ్రతం. ఏ సమాజంలో అయితే నీతి తప్పిన వారు విజయం సాధిస్తారో, ఏ సమాజంలో అయితే నేరస్థులు పూజింబడతారో, ఏ సమాజంలో అయితే విలువలు పతనమై అవకాశవాదం రాజ్యమేలుతుందో, ఏ సమాజంలో అయితే అవినీతి విలయతాండవం చేస్తున్నా పట్టించుకోకుండా ప్రజలు తమకు రావాల్సిన వాటాల కోసం అర్రులు చాస్తారో ఆ సమాజం పున:సమీక్షించుకునే సమయం అసన్నమైందని ప్రఖ్యాత సామాజిక శాస్త్రవేత్త రాబర్ట్ క్లిట్ గార్డ్ వ్యాఖ్యలు ఇప్పటి ఆంధ్రప్రదేశ్‌కు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.

రాజకీయాల అవసరాలు కన్నా ప్రజలే ముఖ్యమని, ప్రజలే ముందని చెప్పిన, నమ్మిన రాజనీతిజ్ఞుడు చంద్రబాబు. దేశ, రాష్ట్ర రాజకీయాలలో చంద్రబాబుది గొప్ప చరిత్ర, అధికారంలో వున్నా, లేకున్నా, ఏదైనా అధికారిక పనుల్లో విదేశాలకు వెళ్ళినా, ఎప్పుడైనా కుటుంభంతో విదేశాలకు వెళ్ళినా, ఆఖరికి విమాన ప్రయాణంలో వున్నప్పుడు ప్రజలకు సంబంధించిన అంశాల పైనే దృష్టి పెడతారు. ప్రతి పనిని పవిత్ర యజ్ఞంగా భావిస్తారు. లక్ష్యం నిర్ణయించుకొని దాన్ని చేరుకొనేందుకు నిరంతర శ్రమ, వ్యూహం వుండాలి అంటారు. అందుకే నవతరం రాజకీయ నాయకులకు ఆయనొక పాఠ్యగ్రంధం అని చెప్పాలి.
 
జాతీయ రాజకీయాలను కూడా చంద్రబాబు ప్రభావితం చేశారు. నేషనల్ ప్రoట్ ఏర్పాటు చేసి ఎన్టీఆర్ కేంద్ర పెత్తనానికి ఎలా కళ్ళెం వేశారో యునైటెడ్ ప్రంట్ ఏర్పాటు, ఆ తర్వాత ఎన్డీఏ ఏర్పాటుకు అంకురార్పణ చేసిన వారిలో చంద్రబాబుదే కీలక పాత్ర. ఒకానొక దశలో ఆయన్ని ప్రధాని కావాలని పార్టీలన్నీ కోరినా తాను రాష్ట్రానికే అంకితం అని స్పష్టం చేసిన నాయకుడు. దేశ ప్రధానుల నియామకంలో రెండుసార్లు ముఖ్యపాత్ర వహించారు.  రాష్ట్రపతులుగా శ్రీ కెఆర్ నారాయణయన్,శ్రీ అబ్దుల్ కలాం ఎంపికలోనూ కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంద్రను అభివృద్ది చేయడానికి చంద్రబాబు తనను తాను రాష్ట్రానికి సమర్పించుకున్నారు. అమరావతిని అద్భుతంగా నిర్మించి రాష్ట్ర ఆదాయం పెంచాలని, యువతకి ఉపాధి కల్పించాలని చంద్రబాబు తపన పడ్డారు. అమరావతి నిర్మాణం పూర్తయితే ఐదు కోట్ల ప్రజల ప్రస్థానం మరో మలుపు తిరిగి ఐదు కోట్ల ప్రజల తలరాతలు అపూర్వం అయ్యేవి. చంద్రబాబు పిలుపుకు స్పందించి 29 గ్రామాల నుండి 28 వేల మంది రైతులు రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాలు భూములు ఇవ్వడం గర్వకారణం. 

ఇది ప్రపంచ చరిత్రలో ఎక్కడా జరగలేదు. అతి వేగంగా అభివృద్ది చెందుతున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను దేశం ముందు నిలిపారు చంద్రబాబు. ఆర్ధిక ఇబ్బందులు వెంటాడుతున్నా సంక్షేమ పథకాలు అమలులో దేశంలో ఆంధ్రప్రదేశ్‌ని ఆదర్శంగా నిలిపారు. నిరుపేదలు, రైతులు, మహిళలు,  కార్మికులు, దళితులు ఇలా అన్ని వర్గాల జీవనాన్ని గుణాత్మకంగా మార్చేందుకు బృహత్తర లక్ష్య సాధన కోసం విలక్షణమైన ఎన్నో సామాజిక పథకాలకు శ్రీకారం చుట్టి బడుగుల బతుకుల్లో భాగ్యోదయం కల్పించేందుకు 100కిపైగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదలకు అండగా నిలిచారు. రాష్ట్రంలో ప్రతి ఎకరానికి నీరు అందించాలన్న దృఢ సంకల్పంతో దశాబ్ధాలుగా కాగితాలకే పరిమితమైన ఆంధ్రప్రదేశ్‌ను సస్య శ్యామలం చేసే భారీ ప్రాజెక్టు పోలవరంను 70 శాతం పూర్తిచేశారు.

పట్టిసీమ పూర్తీ చేసి కృష్ణా, గోదావరి నదులు అనుసంధానం అనే ఆదర్శాన్ని నిజం చేసి చూపిన ఒక వజ్ర సంకల్పుడు చంద్రబాబు. పారిశ్రామిక ప్రగతి పరుగుల వెనుక చంద్రబాబు కఠోర శ్రమ ఉంది. ఆయన హయాంలో వేల కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయంటే చంద్రబాబు పాలనా దక్షతే దానికి కారణం. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి దేశంలోనే వ్యాపార అనుకూల రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ను మొదటిస్థానంలో నిలిపారు. ఆధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని వినియోగించుకొని విన్నూత్న విధానాలతో ఆదాయ వనరులు పెంచారు. ఆర్ధిక క్రమశిక్షణ పాటించి అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలిపారు. సమ్మిళిత, సుస్థిరత అభివృద్దే లక్ష్యoగా పనిచేసి ఆంధ్రప్రదేశ్ వృద్దిరేటు 11.2శాతం సాధించారు. చంద్రబాబు దీర్ఘకాలం అదికారంలో కొనసాగి వుంటే హైదారాబాద్ వంటి నగరాన్ని నవ్యాంద్రలోను నిర్మించేవారు.విశాఖపట్నాన్ని ఒక సిలికాన్ వ్యాలీగా, అమరావతిని సకల విద్యలకు కాణాచిగా, తిరుపతి శ్రీ సిటీని ఒక పారిశ్రామిక హబ్‌గా మార్చే వారు. అందుకే జాతికోసం, జగతికోసం, ప్రగతి కోసం 73 ఏళ్ల లోనూ నిరంతరం శ్రమిస్తున్న మహానాయకుడు చంద్రబాబును అరెస్టు చేయడం మాటల కందని మహా విషాదం. అక్రమంగా,అన్యాయంగా చంద్రబాబును అరెస్టు చెయ్యడంపై దేశవ్యాప్తంగా అన్నీ వర్గాల ప్రజలు ఆయనకు మద్దతుగా బాబు కోసం మేము అంటూ రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్న వారందరికి అభినందనలు. 

 నీరుకొండ ప్రసాద్  
సీనియర్ జర్నలిస్ట్