గ్రానైట్ క్వారీ ప్రమాదంపై.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
posted on Aug 3, 2025 4:03PM
.webp)
బాపట్ల జిల్లా బల్లికురవ సమీపంలోని గ్రానైట్ క్వారీలో ప్రమాదం జరిగింది. గ్రానైట్ రాళ్లు విరిగిపడటంతో ఒడిశాకు చెందిన ఆరుగురు కార్మికులు మృతి చెందారు. ప్రమాద సమయంలో క్వారీలో 15 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రిక తరలిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కార్మికులు మృతి చెందడం పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులతో మాట్లాడిన ఆయన, ప్రమాదానికి గల కారణాలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు.
గాయపడిన వారికి తక్షణమే అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను సీఎం ఆదేశించారు. అదే సమయంలో, ఈ ప్రమాదం జరగడానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపి, నివేదిక సమర్పించాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను సీఎం ఆదేశించారు.