కరకట్ట కమల్ హసన్, మాజీ ఎమ్మెల్యే ఆర్కే పై కేసు నమోదు

కరకట్ట కమల్ హసన్ ఆర్కేపై కేసు నమోదైంది. మంగళగిరిలోని తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు.  వైసీపీ హయాంలో 2021 అక్టోబర్ లో మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై వైసీపీ మూకలు దాడికి తెగబడిన సంగతి తెలిసిందే.

అప్పట్లో  ఈ దాడిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. అయితే తెలుగుదేశం కూటమి సర్కార్ అధికారపగ్గాలు చేపసట్టిన తరువాత ఈ కేసును సీఐడీకి అప్పగించింది. దీంతో మంగళగిరి తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసు నమోదు చేసిన సీఐడీ, ఆ కేసులో అప్పటి మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ను ఏ127గా చేర్చింది.  వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, అప్పటి బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌, విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి దేవినేని అవినాశ్‌ ఆధ్వర్యంలోని వైసీపీ ముఖ్యనేతల ఆదేశాలతో ఈ దాడికి పథక రచన జరిగినట్లు సీఐడీ దర్యాప్తులో నిర్దారణ అయినట్లు సమాచారం.   టీడీపీ కార్యాలయం ప్రధాన గేటును కూల్చి లోపలకి ప్రవేశించిన అల్లరి మూకలు కార్యాలయ సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచారు.  అప్పట్లో ఈ దాడికి సంబంధించి ఎవరిపైనా కేసులు నమోదు చేయలేదు.