జాగృతి నేతలతో ఎమ్మెల్సీ కవిత సమావేశం.. ఎందుకంటే?
posted on May 27, 2025 3:57PM
.webp)
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు జాగృతి సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. నగరంలోని బంజారాహిల్స్‌లో ఉన్న ఆమె నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ మీటింగ్‌లో ముఖ్యంగా సింగరేణి ప్రాంతానికి చెందిన తెలంగాణ జాగృతి నాయకులు హాజరయ్యారు. ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిణామాలతో పాటు, తెలంగాణ జాగృతి సంస్థ భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల గురించి ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం.
సంస్థ కార్యకలాపాలను మరింత విస్తృతం చేయడం, ప్రజలకు చేరువయ్యే నూతన కార్యక్రమాల రూపకల్పన వంటి అంశాలపై నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు తెలుస్తోంది. సింగరేణిలోని 11 ఏరియాలను ఆమె సమన్వయకర్తలను నియమించారు. కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా కార్యాచరణ ఉంటుందని ఆమె ఈ సందర్బంగా వెల్లడించారు. టీబీజీకేఎస్‌తో సమన్వయం చేసుకుంటూ పని చేస్తామన్నారు. బహుజనులు, యువతకు ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. సింగరేణి కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా, సంస్థను కాపాడటమే ధ్యేయంగా సింగరేణి జాగృతి ఏర్పాటు చేశామని ప్రకటించారు.