ఇక చిరంజీవి మారడం కష్టమే...

 

మాజీ మెగాస్టార్ చిరంజీవి రాజకీయ విధానాలు తెలుగు ప్రజలకు విసుగు తెప్పించాయి. ఆయన్ని సినిమా తెరమీద చూస్తే ఆనందంతో బట్టలు చించుకునే అభిమానులు కూడా రాజకీయంగా చిరంజీవి పేరు చెబితేనే చిరాకుపడే పరిస్థితికి వచ్చారు. పార్టీ పెట్టడం దగ్గర్నుంచి, పార్టీ మూసేసి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు, రాష్ట్ర విభజన సందర్భంలో వ్యవహరించిన తీరు వరకు అనేక అంశాలు చిరంజీవి రాజకీయ అపరిపక్వతకు, స్వార్థపూరిత రాజకీయాలకు అద్దం పట్టాయి. తన రాజకీయ ప్రస్థానంలో చిరంజీవి తెలుగు ప్రజలకు విసుగు పుట్టించడంతోపాటు అనేక గుణపాఠాలు నేర్చుకునే అవకాశాలను కూడా పొందారు. అయితే ఆ అవకాశాల నుంచి చిరంజీవి గుణపాఠాలను నేర్చుకున్న దాఖాలు ఎంతమాత్రం కనిపించడం లేదు. చిరంజీవి అనుసరిస్తున్న రాజకీయ వ్యూహాలు ఎందుకూ పనికిరాని వ్యూహాలని, వాటివల్ల చిరంజీవికి కాంగ్రెస్ పార్టీలో పదవులు దక్కితే దక్కవచ్చేమోగానీ, ప్రజల నుంచి తిరస్కరణే ఎదురవుతుందన్న పెద్ద గుణపాఠాన్ని కూడా ఆయన నేర్చుకోలేదు. ప్రజల్లో ఎంతో ఛరిష్మా వున్న తాను కాలికి బలపం కట్టుకుని సీమాంధ్ర అంతా తిరిగినా ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా రాకపోవడం నుంచి ఆయన ఎలాంటి జ్ఞానోదయాన్నీ పొందలేదు. అందుకే ఆయన ఇప్పటికీ తన పంథాలోనే వెనక్కి దూసుకువెళ్తున్నారు.

 

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వారానికో పదిరోజులకో ఒకసారి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ నేనింకా బతికే వున్నానని చెప్పుకునే స్థితిలో వుంది. అలాంటి పార్టీని ఐదేళ్ళ తర్వాత వచ్చే ఎన్నికలలో గెలిపించే బాధ్యతని భుజాన వేసుకున్న చిరంజీవి ఆంధ్రప్రదేశ్‌లో తమ పార్టీ ఉనికిని చాటుకునేందుకు రాజకీయాలు, కామెంట్లు చేస్తున్నారు. విశాఖ తుఫాను బాధితులను ఆదుకునే విషయంలో చంద్రబాబు చేసిన కృషిని దేశమంతా ప్రశంసిస్తోంది. చీటికి మాటికి చంద్రబాబును విమర్శించే కార్యక్రమంలోనే మునిగివుండే జగన్ కూడా ఈ విషయంలో చంద్రబాబును ఎలా విమర్శించాలా అని రకరకాల సాకులు వెతుకుతూ విమర్శిస్తున్నారు. అయితే ఆ విమర్శలన్నీ బెడిసికొడుతూ వుండటంతో నాలుక కరుచుకుంటున్నారు. జగన్ పరిస్థితిని చూసి అయినా చిరంజీవికి జ్ఞానోదయం కలగలేదు. తుఫాను బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని, అదనీ, ఇదనీ ఏవేవో విమర్శలు చేస్తూ ప్రజల్లో ఆయన మీద వున్న కాస్తంత మర్యాదని కూడా పోగొట్టుకునేలా వ్యవహరిస్తున్నారు. హుదూద్ తుఫాను సంభవించగానే చంద్రబాబు నాయుడు విశాఖకు వెళ్ళి అక్కడ అనేక సహాయ కార్యక్రమాలు చేసి, ఎన్నోరోజులు అక్కడే మకాం వేశారు. అలాంటి పరిస్థితుల్లో చిరంజీవి ఏం చేశారు? సహాయ కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత, తుఫాను వచ్చిపోయిన వారం రోజుల తర్వాత విశాఖకు వెళ్ళి గెస్ట్ ఆర్టిస్టులాగా డైలాగులు చెప్పి వచ్చారని ప్రజలు అంటున్నారు. తుఫాను సహాయం విషయంలో చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు చిరంజీవికి ఎంతమాత్రం లేదని ప్రజలు అంటున్నారు. తుఫాను బాధితులకు ఎంపీ లాడ్స్ నుంచి విరాళం ఇచ్చారే తప్ప తన సొంత జేబులోంచి పైసా కూడా విదల్చని చిరంజీవికి తుఫాను బాధితుల సహాయ కార్యక్రమాల విషయంలో ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదని అంటున్నారు. రాజకీయంగా పాతాళంలోకి పడిపోయినా తన తీరు మార్చుకోని చిరంజీవి భవిష్యత్తులో అయినా మారడం కష్టమేనని అభిప్రాయపడుతున్నారు.