టీడీపీకి దెబ్బ మీద దెబ్బ.. వైసీపీలోకి మరో ఎమ్మెల్యే

 

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీ టీడీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఇప్పటికే రావెల కిషోర్ బాబు, మేడా మల్లిఖార్జున రెడ్డి వంటి నేతలు టీడీపీని వీడారు. రావెల జనసేన పార్టీలో చేరితే.. మేడా వైసీపీ గూటికి చేరారు. అయితే ఇప్పుడు వీరి బాటలోనే మరో ఎమ్మెల్యే టీడీపీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీని వీడే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన‌ వైసీపీలోకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. పార్టీ మార్పుపై కార్యకర్తల అభిప్రాయాలను ఆమంచి కృష్ణమోహన్‌ తెలుసుకుంటున్నట్లు సమాచారం. ఈనెల 13న వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ప్రకాశం జిల్లా పర్యటన సందర్భంగా ఆమంచి‌ వైసీపీలో చేరే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై చర్చించేందుకు ప్రకాశం జిల్లా పందిళ్లపల్లిలోని తన నివాసంలో సన్నిహితులు, ముఖ్యకార్యకర్తలతో కృష్ణమోహన్‌ సమావేశమయ్యారు.

రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్‌లో ఉన్న ఆమంచి ఆ తర్వాత వైసీపీ, టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే ఎక్కడా ప్లేస్ ఖాళీ లేకపోవడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచారు.ఆ తర్వాత టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు.. ఆమంచిని పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ఆయన టీడీపీకి మద్ధతిచ్చారు. అయితే ఆమంచి రాకను స్థానిక టీడీపీ నేత పోతుల సురేశ్ తీవ్రంగా వ్యతిరేకించారు. కలిసి పనిచేయాలని అధినేత ఎన్నిసార్లు సూచించినా.. ఆమంచి-పోతుల వర్గాలు కలిసి పనిచేసేందుకు ముందుకు రాలేదు. దీనికి తోడు కొన్ని వ్యవహారాల్లో తన అనుచరులు, మద్ధతుదారులపై పోలీసులు కేసులు నమోదు చేయడంతో ఆమంచి ఆగ్రహంగా ఉన్నారు. టీడీపీలో తనను పట్టించుకోవడం లేదని ఆవేదనలో ఉన్న ఆయన పార్టీని వీడాలని ఎప్పటి నుంచో భావిస్తున్నారు. ఈ పరిణామాలు ఒక కంట కనిపెడుతున్న వైసీపీ నేతలు ఆమంచితో సంప్రదింపులు జరిపారు. ఆ సంప్రదింపులు ఫలించి ఆమంచి వైసీపీలో చేరడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది.