'పసుపు-కుంకుమ' చెక్కులు.. ట్విస్ట్ ఇస్తున్న బ్యాంకులు!!

 

డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం  'పసుపు-కుంకుమ' పేరిట ప్రతి ఒక్కరికీ రూ.పదివేలు వంతున కేటాయించి చెక్కులను పంపిణీ చేస్తున్న తెలిసిందే. అయితే పసుపు కుంకుమ ద్వారా చెక్కులు అందుకున్న మహిళల సంతోషం అప్పుడే ఆవిరై పోయింది. చెక్కులను మార్చుకుందామని బ్యాంకులకు వెళ్లిన కొందరు మహిళలకు ఊహించని షాక్ తగిలింది. మంజూరైన రూ. పది వేలలో కొంత సొమ్మును బకాయి కింద జమ చేసుకుంటామని బ్యాంక్‌ అధికారులు మెలిక పెట్టడంతో మహిళలు అవాక్కయ్యారు.

వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా వింజమూరు ప్రాంతానికి చెందిన కొందరు డ్వాక్రా మహిళలు.. పసుపు-కుంకుమ చెక్కులు మార్చుకునేందుకు బ్యాంక్ కి వెళ్లారు. కాగా.. ఆ డబ్బు పూర్తిగా ఇవ్వమని.. గతంలో ఆ  మహిళలు బాకీ ఉన్న మొత్తానికి కొంత జమ చేసుకుంటామని బ్యాంక్ అధికారులు చెప్పారు. దీంతో ఆగ్రహించిన మహిళలు బ్యాంక్ ఎదుట కూర్చొని ధర్నాకు దిగారు. విషయం తెలుసుకొన్న ఎస్‌ఐ షేక్‌ జిలాని సిబ్బందితో వచ్చి వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేసారు. ఈ విషయమై బ్యాంక్‌ మేనేజర్‌ వీఎల్‌ఎన్‌ మూర్తిని వివరణ కోరగా రెగ్యులర్‌ చెల్లింపుల గ్రూపులకు ఎలాంటి నియమనిబంధనలూ లేకుండా వారి సొమ్మును ఇస్తున్నామన్నారు. వాయిదాలు చెల్లించకుండా నిలిచిపోయిన గ్రూపుల నుంచి కొంతైనా సొమ్ము జమ చేయాలని చెప్పామన్నారు. ఈ మేరకు ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలూ రాలేదన్నారు. ఈ విషయం తెలుసుకున్న వెలుగు ఏపీఎం శ్రీనివాసరావు, సీసీ వెంకటరమణమ్మలు బ్యాంకు వద్దకు చేరుకున్నారు. బ్యాంకు అధికారులతో మాట్లాడి సొమ్మును ఇప్పిస్తామని చెప్పి మహిళలకు సర్దిచెప్పి పంపారు.