కాంగ్రెస్ తో హరీష్ రావు మంతనాలు నిజమే.. బాంబు పేల్చిన ఎమ్మెల్యే!

 

తెలంగాణలో దూకుడుగా ఉండే నేతల్లో కాంగ్రెస్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఒకరు. ఇది ఒకప్పటి మాట. ఏమైందో ఏంటో తెలీదు కానీ ఈ మధ్య ఆయన బాగా సైలెంట్ అయ్యారు. ముఖ్యంగా ఈ మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల తరువాత ఆయన తీరు బాగా మారిపోయింది. మరి ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవడం వల్లనో లేక అసలే ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండాలి లేనిపోని తలనొప్పులు ఎందుకు అనుకున్నారో తెలీదు కానీ ఆయన దూకుడు, మాట తీరు పూర్తిగా మారిపోయాయి.

ఈమధ్య కేసీఆర్ మీద, టీఆర్ఎస్ మీద విమర్శలు చేయడం మానేసి ఆచితూచి మాట్లాడుతున్న జగ్గారెడ్డి.. తాజాగా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలలో చర్చలకు తెర లేపారు. తాజాగా హైదరాబాద్‌లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన ఆయన.. 2004లో కేసీఆర్ టిక్కెట్ ఇవ్వబట్టే తాను మొదటిసారి ఎమ్మెల్యే అయ్యానని చెప్పుకొచ్చారు. కేసీఆర్ పట్ల తనకు ఎటువంటి అసూయా ద్వేషాలు లేవన్నారు. ఆయన పార్టీ పెట్టడం వల్లే నేను ఎమ్మెల్యేను కాగలిగాను అన్నారు. కేసీఆర్‌ కుటుంబంతో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని.. కేసీఆర్‌ను, ఆయన కుటుంబాన్ని రాజకీయంగా విమర్శించానే తప్ప వ్యక్తిగతంగా తానెప్పుడూ విమర్శించలేదని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. తాను విభేదించేదంతా హరీష్ రావుతోనేనని, తనను జైల్లో పెట్టించింది ఆయనేనని ఆరోపించారు. ఉనికి కోసం హరీష్ తనను బలి చేసే యత్నం చేశారని దుయ్యబట్టారు.

హరీష్ రావు బ్లాక్‌మెయిల్‌ రాజకీయాల కారణంగానే తనను జైల్లో పెట్టించారని ఆరోపించారు.హరీష్ తో పోలిస్తే కేటీఆర్‌ చాలా ఫెయిర్‌ అని వ్యాఖ్యానించారు. గతంలో హరీష్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రయత్నించిన మాట వాస్తవమేనని, అందుకోసం కేవీపీతో రాయబారం కూడా నడిపారని గతాన్ని తవ్వితీశారు. ఇటీవల కూడా హరీష్ అటువంటి ప్రయత్నమే చేశారని అన్నారు. అయితే ఇప్పుడు హరీష్ టీఆర్‌ఎస్‌ను వీడతారని తాను అనుకోవడం లేదన్నారు. తాను కాంగ్రెస్‌ పార్టీ మారేది లేదని, అయితే నియోజకవర్గ అభివృద్ధి, సంగారెడ్డిలో మెడికల్‌ కళాశాల కోసం కేసీఆర్, కేటీఆర్‌లను కచ్చితంగా కలుస్తానని చెప్పారు. తాను జైల్లో ఉన్నప్పుడు ఉత్తమ్, వీహెచ్‌ తప్ప కాంగ్రెస్‌లో ఉన్న ఏ నాయకుడూ పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్‌లో కమిటీలు, పదవుల విషయంలో రాహుల్‌ గాంధీ తీసుకునే నిర్ణయాలన్నింటికీ కట్టుబడి ఉంటానన్న జగ్గారెడ్డి.. ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్‌ చేస్తే తప్ప కాంగ్రెస్‌లో పదవులు దక్కే పరిస్థితి లేదని పేర్కొన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 7–8 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని అంచనా వేశారు. అయితే జగ్గారెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలలో చర్చలకు దారి తీస్తున్నాయి. కేసీఆర్, కేటీఆర్ గురించి జగ్గారెడ్డి సానుకూలంగా మాట్లాడడంతో కాంగ్రెస్ కి ఇబ్బందికరంగా మారింది. మరోవైపు హరీశ్ రావు కాంగ్రెస్ తో మంతనాలు జరిపారన్న వ్యాఖ్యలు కూడా టీఆర్ఎస్ లో ప్రకంపనలు సృష్టించేలా ఉన్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu