కలలను కొట్టిపారేయొద్దు


అతను ఓ మామూలు కుర్రవాడు. అతని తండ్రి ఓ ఫ్యాక్టరీలో కార్మికుడు. తలదాచుకోవడానికి చిన్న ఇల్లు తప్ప వారికి మరో ఆస్తి లేదు. కడుపు నింపుకోవడం ఎలా అన్న ఆలోచన తప్ప తమ భవిష్యత్తు గురించి ఆశలు లేవు. పైగా ఒకోసారి ఇల్లు గడిచేందుకు కుర్రవాడు కూడా ఏదో ఒక పని చేయాల్సి వచ్చేది. దాంతో అతను బడికి వెళ్లడం కూడా తక్కువే! అలాంటి ఒక రోజున కుర్రవాడి బడిలో టీచర్‌, పిల్లలకి ఒక ప్రాజెక్టు వర్కు ఇచ్చారు. ‘నువ్వు పెద్దయ్యాక ఏమవ్వాలని అనుకుంటున్నావు?’ అన్నదే ఆ ప్రాజెక్ట్‌.

 

ఆ రోజు ఇంటికి తిరిగి వచ్చిన తరువాత, కుర్రవాడు తెగ ఆలోచించాడు. నిజంగా తను పెద్దయ్యాక ఏమయితే బాగుంటుంది. ఏమైతే తన మనసుకి తృప్తిగా ఉంటుంది అంటూ మధనపడ్డాడు. అతనికి అప్పుడు తన తండ్రి పనిచేసే ఫ్యాక్టరీ గుర్తుకువచ్చింది. పదిమందికీ అన్నం పెడుతూ, సమాజం అవసరాలు తీరుస్తూ ఉండే ఆ ఫ్యాక్టరీ అంటే అతని మనసులో తెలియని ఆరాధన. అందుకే తను కూడా పెద్దయ్యాక అలాంటి ఫ్యాక్టరీ ఒకదాన్ని స్థాపించాలని అనుకున్నాడు. అది ఏ ఫ్యాక్టరీ అయితే బాగుంటుంది? ఎంత విస్తీర్ణంలో ఉండాలి? దాని భవనాలు ఎలా ఉండాలి? ఎంతమంది కార్మికులు ఉండాలి?... లాంటి విషయాలన్నింటి గురించీ ఓ కాగితం మీద రాశాడు.

 

మర్నాడు తను రూపొందించిన ప్రణాళికను తీసుకుని గర్వంగా బడికి వెళ్లాడు. కానీ ఆ కాగితం చూసిన ఉపాధ్యాయుడు పెదవి విరిచేశాడు. ‘అబ్బే! నీ వెనక ఆస్తిపాస్తుల లేవు. సగం రోజులు బడి మానేసి పనికి వెళ్తే కానీ మీ ఇల్లు గడవదు. నీ చదువూ అంతంతమాత్రమే! మీ నాన్నగారి పరిస్థితీ అంతంతమాత్రమే! అలాంటిది ఇంతపెద్ద ఫ్యాక్టరీ ఎలా నిర్మిస్తావు. ఆశకి కూడా ఓ హద్దుండాలి. మనం ఏం సాధించగలమో ముందే తెలుసుకుని ఉండాలి,’ అంటూ దులిపేసి సున్నా మార్కులు వేశాడు.

 

కుర్రవాడు బిక్కమొగం వేసుకుని ఇంటికి తిరిగివచ్చాడు. జరిగిందంతా తండ్రితో చెప్పుకొని బాధపడ్డాడు- ‘నిజంగా ఓ ఫ్యాక్టరీని నిర్మించాలి అన్న కలే నీకుంటే దానిని నిజం చేసుకునేందుకు ప్రతిక్షణమూ కష్టపడు. ఉపాధ్యాయుడు చెప్పినట్లు నీకు లక్ష్యాన్ని సాధించే అర్హత లేదని మనసారా నమ్మితే ఊరుకో! నిర్ణయం మాత్రం నీదే! ఒక్కటి మాత్రం గుర్తుంచుకో. నీ కలని చిదిమివేసే అవకాశం ఎవ్వరికీ ఇవ్వవద్దు. నీ సత్తా ఏమిటో నువ్వే బేరీజు వేసుకో. నువ్వేం సాధించాలనుకుంటున్నావో నువ్వే నిర్ణయించుకో,’ అంటూ ఓదార్చాడు.

 

తండ్రి మాటలు పిల్లవాడి మీద గట్టి ప్రభావాన్నే చూపాయి. తనకి ఫ్యాక్టరీ నిర్మించే సత్తా ఉందని నమ్మాడు. పాతికేళ్లపాటు ఆ దిశగానే ఒకో అడుగూ వేస్తూ పయనించాడు. చివరికి తను అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం రోజున అతని చిన్ననాటి ఉపాధ్యాయుడు కూడా అక్కడికి చేరుకున్నాడు. ‘నేను నిన్ను నిరుత్సాహపరచడానికి చూశాను. కానీ నువ్వు వెనక్కి తగ్గలేదు. నిన్ను చూసి చాలా గర్వంగా ఉంది,’ అంటూ యజమానిగా ఎదిగిన కుర్రవాడని తెగ పొగిడేశాడు.

 

కానీ యజమాని మొహంలో మాత్రం ఏదో బాధ ‘సార్‌! మీరు నా లక్ష్యాన్ని మార్చాలని చూశారు. కానీ నేను చెదరలేదు. నిజమే! కానీ మీ వృత్తిలో ఇలా ఎంతమంది కలలని కొట్టిపారేసి ఉంటారో ఒక్కసారి గుర్తుచేసుకోండి. ఆస్తిపాస్తులు ఉండకపోవచ్చు. అన్నీ కలిసిరాకపోవచ్చు. కానీ ఆశ మనిషిని ఎంతో ఎత్తుకు చేరవేస్తుంది. ఆ ఆశని మీరు మీ శిష్యులకి అందించలేకపోయారు. సాధించగలవు అంటూ భుజం తట్టే మీ ప్రోత్సాహమే ఉంటే ఎంతమంది నాలా విజయం సాధించగలిగేవారో కదా!’ అన్నాడు.
ఆ మాటలకి గురువు దగ్గర జవాబు లేదు. ఆశ మనిషిని నడిపిస్తుంది. ప్రోత్సాహం ఆ ఆశని బతికిస్తుంది. ఆ విషయం గురువుగారికి చాలా ఆలస్యంగా అర్థమైంది.

(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

 

- నిర్జర.