ప్రాక్టీస్‌ చేస్తే మార్కులు గ్యారెంటీ!

 


చదువుకుంటే విజ్ఞానం వస్తుందో రాదో కానీ, మార్కులు మాత్రం వచ్చితీరాలనే రోజులివి. ఎందుకంటే మార్కులు, ర్యాంకుల ఆధారంగానే అవకాశాలు లభ్యమవుతున్నాయి. మరి ఎంతబాగా చదివినా కూడా, పరీక్ష రాసే ఒత్తిడిలో మన జ్ఞాపకాలన్నీ చెల్లాచెదురైపోతే?

 

రెండు మార్గాలు

మనం చదివిన విషయాన్ని రెండు రకాలుగా గుర్తుంచుకునేందుకు ప్రయత్నిస్తుంటాం. ఒకటి- అదే విషయాన్ని పదే పదే పునశ్చరణ చేసుకోవడం ద్వారా. రెండు- చదివిన విషయాన్ని తిరిగి రాసుకోవడం, పాత ప్రశ్నాపత్రాలకు జవాబులు ఇవ్వడం వంటి ప్రాక్టీసింగ్ పద్ధతుల ద్వారా. ఈ రెండు పద్ధతులలోనూ ఏది మెరుగైన ఫలితాలను ఇస్తుందో తెలుసుకునేందుకు ప్రయత్నించారు అమెరికాకు చెందిన కొందరు శాస్త్రవేత్తలు.

 

30 పదాలు- 30 చిత్రాలు

పునశ్చరణా! ప్రాక్టీసా! అన్న విషయాన్ని తేల్చేందుకు ఓ 120 మంది విద్యార్థులను ఎన్నుకొన్నారు. వీరికి కంప్యూటర్‌ స్క్రీన్‌ మీద ఓ 30 పదాలు, 30 చిత్రాలు చూపించారు. ప్రతి పదం లేదా చిత్రం తరువాత అభ్యర్థులు నోట్స్‌ రాసుకునేందుకు కాస్త సమయాన్ని ఇచ్చారు. ఆ తరువాత వీరిని రెండు రకాలుగా విభజించారు. మొదటి విభాగంలోని అభ్యర్థులని కేవలం పునశ్చరణ ద్వారా విషయాన్ని గుర్తుచేసుకునే ప్రయత్నం చేయమన్నారు. రెండో విభాగంలోని అభ్యర్థులని ప్రాక్టీసు చేసుకుంటూ ఆ పదాలను, చిత్రాలను గుర్తుచేసుకోమని ప్రోత్సహించారు.

 

ఒత్తిడిలోనూ – లేకుండానూ

ఎవరు ఎంత బాగా గుర్తుంచుకున్నారన్న విషయం మీద ఓ 24 గంటల తరువాత పరీక్షించి చూశారు పరిశోధకులు. అయితే ఇందులో, ఎలా చదివితే బాగా గుర్తుంటుంది అన్న సమస్య ఒకటైతే... అది ఒత్తిడిలో కూడా గుర్తుంటుందా లేదా అన్నది మరో సమస్య. అందుకోసం పరిశోధకులు రెండు విభాగాలలోనూ సగం మందిని ఒత్తిడితో కూడిన వాతావరణంలో కూర్చోపెట్టారు. ఓ ఇద్దరు పరీక్షాధికారులు, ఓ ముగ్గరు తోటి విద్యార్థులు, ఎదురుగుండా కెమెరా... ఇలా ఉద్వేగపూరితమైన వాతావరణంలో సగం మందిని పరీక్షించి చూశారు.

 

ఫలితం ఊహించినదే!

పునశ్చరణ చేసినవారితో పోలిస్తే ప్రాక్టీసు ద్వారా గుర్తుంచుకునే ప్రయత్నం చేసినవారే ఎక్కువ విషయాలను గుర్తుంచుకున్నట్లు తేలింది. ఒత్తిడిలో ఉన్నా లేకున్నా కూడా ఈ వ్యత్యాసం స్పష్టంగా కనిపించింది. ఇతరులతో పోలిస్తే వీరు దాదాపు 10 శాతం ఎక్కువగా విషయాలను జ్ఞప్తికి తెచ్చుకోగలిగారు. ప్రాక్టీసు చేయడం వల్ల విషయం మన మెదడులో దీర్ఘకాలికంగా ఉండిపోతుందనీ, ఒత్తిడితో కూడిన సందర్భాలలోనూ అవి చెక్కుచెదరవనీ చెబుతున్నారు. ఈ పోటీ ప్రపంచంలో ఎలాంటి పరీక్షలోనైనా నెగ్గుకురావాలంటే ప్రాక్టీసు చేసి చూడమని భరోసా ఇస్తున్నారు. ఇంతకీ Practice makes a man perfect అని మన పెద్దలు చెప్పిన మాట పరీక్షలకి కూడా వర్తిస్తుందన్నమాట!

 

- నిర్జర.