మరాఠా యోధుడు జయంతి!!
posted on Feb 18, 2023 9:30AM
భారతదేశ చరిత్రలో ఎంతో మంది వీరులు ఉన్నారు. వారిలో ధైర్యసాహసాలు, వీరత్వం, ఎంతో గొప్ప చరిత్ర కలిగిన వారిని కూడా కాచివడపోస్తే అందులో ఖచ్చితంగా నిలబడగలిగేవాడు శివాజీ. విశాల మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి, పేరు చెబితేనే శత్రువుల గుండెలు దడదడలాడేలా భారత చరిత్రలో ఓ గొప్ప యోధుడిగా, ఛత్రపతి బిరుదాంకితుడిగా నిలిచిపోయిన శివాజీ రావ్ భోంస్లే పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర శివనేరి కోటలో షానాజీ, జిజియాబాయి దంపతులకు ఫిబ్రవరి 19, 1630వ సంవత్సరంలో జన్మించాడు.
బాల్యపు చిగురులు!!
శివాజీ తండ్రి షానాజీ బీజాపూర్ సుల్తానుల వద్ద జాగీర్దారుగా పనిచేసేవాడు. ఇతడు నిజాం రాజులను ఓడించి సంపాదించుకున్న రాజ్యాన్ని మొఘలులు ఆదిల్షాతో కలసి షానాజీని ఓడించారు. అప్పుడు ఆదిల్షా మరియు షానాజీ మధ్య జరిగిన ఒప్పందం కారణంగా ఆ ప్రాంతాన్ని వదిలి అక్కడి నుండి నేటి బెంగుళూరు ప్రాంతానికి జాగీరుగా వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు జిజియాబాయిని, శివాజీని అక్కడే వదిలి వెళ్ళాడు షానాజీ.
తండ్రి షానాజీ, తల్లి జిజియాబాయి ఇద్దరూ మరాఠా సామ్రాజ్య స్థాపన కోసం చేసిన ప్రయత్నాలను చిన్నతనంలో చూసిన శివాజీ, తండ్రి బెంగుళూరు వెళ్లిపోగానే తల్లిదగ్గర రామాయణ, భారతాలు, పురాణాలు, వాటిలోని నీతి, యుద్ధ విషయాలు, స్త్రీపట్ల గౌరవంగా ఉండటం, పరమతాలను గౌరవించడం, ఎవ్వరికీ చెడు తలపెట్టకుండా మంచితనంతో ఉండటం వంటి విషయాలను చక్కగా తెలుసుకున్నాడు. రామాయణ, భారత, హిందూ దర్మాల ప్రత్యేకతను, వాటిలో విశిష్టతను తెలుసుకున్న శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపనే ద్యేయంగా మనసులో పెట్టుకున్నాడు.
యోధుడిగా అడుగులు!!
తల్లి చెప్పిన మంచి మాటలు, పురాణాలలో దాగిన నీతి, తండ్రికి ఎదురైన అనుభవాలు ఇవన్నీ శివాజీకి చిన్నతనంలోనే గొప్ప ఆలోచనలను, మరాఠా సామ్రాజ్య స్థాపన అనే లక్ష్యాన్ని మనసులో నాటాయి. మొఘలులు భారతదేశం మీద పడి హిందూ మతాన్ని నీరుగారుస్తున్న దశలో శివాజీ వాళ్ళను ఎంతో నేర్పుగా ఎదుర్కొని హిందూధర్మాన్ని కాపాడిన వ్యక్తిగా, శక్తిగా నిలిచిపోయాడు.
భైరాంఖాన్ పర్యవేక్షణలో ఎంతో గొప్పగా పదునుదేరిన శివాజీ తన 17 సంవత్సరాల ప్రాయం నుండి యుద్ధాలు చేయాడం మొదలుపెట్టి సుల్తానుల కోటలను స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇవన్నీ చూసి ఓర్వలేని ఆ సుల్తానులు శివాజీ తండ్రిని అకారణంగా బంధించినప్పుడు శివాజీ, శంబాజీ ఇద్దరూ కలిసి ఆ సుల్తాల మీద యుద్ధం చేసి తండ్రిని సురక్షితంగా విడిపించుకున్నారు.
ఆ తరువాత సుల్తానులను, మొఘలులను వరుసగా జయిస్తూ మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించుకోసాగాడు.
యుద్ధ నైపుణ్యం!!
శివాజీకి తన తండ్రి నుండి లభించింది కేవలం రెండువేల మంది సైనికులు అయితే దాన్ని పదివేల సమర్త్యానికి పెంచుకోవడంలో ఎంతో గొప్ప నైపుణ్యం ఉంది. అలాగే యుద్దానికి వ్యూహాలు రచించడంలో కూడా శివాజీ గొప్ప దిట్ట. ఇతను అనుసరించే వ్యూహాలు నాటి కాలానికి అసలు పరిచయం లేనివి. వీటిలో ముఖ్యంగా ప్రపంచానికి అప్పటివరకు పరిచయం లేని గెరిల్లా పోరాటం శత్రువులను ఎంఘో భయానికి గురుచేసేది.
రాశి కన్నా వాశి మిన్న అనే మాట శివాజీ సైన్యానికి సరిపోతుంది. తన సైన్యాన్ని ఎంతో నైపుణ్యంతో ఉత్తమంగా ఉంచుకునేవాడు శివాజీ. ఈయన దగ్గర ఎంతో ఉత్తమమైన సైనికులు ఉండేవారు. అలాగే సమర్థమవంతమైన సైన్యాధిపతి తానాజీ శివాజీ బలగంలోని వాడే.
పరమతాన్ని అధరించినవాడు!!
హిందూవ్యతిరేక రాజ్యాలు, రాజుల మీద యుద్ధం చేసినా ముస్లిం మతస్థులను ఎవరినీ ఏ విధంగానూ ఇబ్బంది పెట్టని మనస్తత్వం శివాజీది. ఈయన ఎన్నో మసీదులను కట్టించాడు. తన దగ్గర పనిచేసేవాళ్లలోనే ఎంతోమంది ముస్లింలను ఉంచుకున్నాడు. బీజాపూర్ సుల్తానులను ఓడించడానికి ఔరంగజేబుకు సహాయపడ్డాడు, తన కూతురును కూడా హిందూమతం స్వీకరించిన ముస్లిం వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసాడు. ఇంకా ఈయన సైనికులలో కూడా ముస్లింలు చాలామంది ఉండేవాళ్ళు.
రాజులను ఓడిస్తే ఆ రాజుల భార్యలను, వారి కుటుంబంలో ఆడవాళ్లను కూడా తెచ్చుకునేవారు కొంతమంది. అయితే ఒకసారి ఒక ముస్లిం రాజు ఓడిపోయినప్పుడు అతడి కొడలును శివాజీ ముందు నిలబెడితే "మా అమ్మ మీలా అందంగా ఉంటే, నేను కూడా అందంగా ఉండేవాడినేమో"అని చెప్పి ఆ మహిళను తల్లితో పోల్చి, ఆమెను ఎంతో గౌరవంగా తిరిగి వెనక్కు పంపేసాడు శివాజీ. ఇది ఆయనలో ఉన్న వ్యక్తిత్వ విలువకు ఒక మచ్చుతునక మాత్రమే.
చివరిలో!!
సుమారు ఇరవై ఏడు సంవత్సరాల పాటు యుద్ధాలు చేసి భారతీయ రాజులకు అందరికీ ఎంతో ఆదర్శంగా నిలిచిన ఛత్రపతి శివాజీ తన యాభై మూడు సంవత్సరాల వయసులో మూడు వారాల పాటు విపరీతమైన జ్వరంతో బాధపడి దాన్నుండి కొలుకోలేక తుదిశ్వాస విడిచాడు.
ఈయన ఆ కాలానికే పటిష్టమైన నిఘా వ్యవస్థ, నౌకాదళ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న తీరు ఇప్పటి విశ్లేషకులను కూడా అబ్భురపరుస్తూనే ఉంది. ఈయన శౌర్య ప్రతాపాలు దేశాన్ని చైతన్యం వైపు నడిపిస్తూనే ఉంటాయి.
◆ వెంకటేష్ పువ్వాడ