ఆలోచనలు మారాలి !

పిల్లలు ఇంట్లో తిరగాడుతుంటే ఆ కళ వేరు. పిల్లల ముద్దు పలుకులు చూస్తే ఆ సంతోషం వేరు. కానీ ఈ మధ్య పిల్లలు విగతజీవులు అయిపోతున్నారు. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో చాలా ఘోరం గా తయారవుతోంది ఈ సమాజం. నెలల పసికందు అయినా పండు ముసలి అయినా కామంతో రగిలే మగాడి కంట పడితే ఇక జీవితం ముగిసినట్టే అవుతోంది పరిస్థితి. ఇట్లా ప్రవర్తించేవాళ్ళు అసలు అలా ఎలా చేయగలుగుతారు అనేది అందరూ వేసే ప్రశ్న. ప్రతిసారి ఇట్లాంటివి జరిగినపుడు ప్రశ్నలు గుప్పించడం. తరువాత కొన్ని రోజులకు అన్ని మర్చిపోవడం. తప్పు చేసినా వాళ్లను శిక్షించినా తరువాత మళ్ళీ ఏదో ఒక రోజు, ఎక్కడో ఒకచోట ఉలిక్కిపడేలా మళ్ళీ దారుణాలు పునరావృతమవుతూనే ఉన్నాయి. అసలు సమస్య ఎక్కడుంది?? 

వస్త్రధారణ అని చాలా మంది అంటారు మరి నెలల పసిబిడ్డలు, పదేళ్లు కూడా నిండని బుజ్జి తల్లులు ఎలాంటి బట్టలు వేసుకోవాలి?? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.

పెంపకంలో తప్పుందా?? ప్రతి తల్లిదండ్రి తమ బిడ్డలను ఉత్తమంగా ఉండేలానే పెంచుతారు. ఎవరు కూడా తమ బిడ్డలు తప్పులు చేసి జైలు కు వెళ్లాలని, పసిబిడ్డల ప్రాణాలు, ఆడపిల్లల మానాలు తీసేట్టు ప్రేరేపించి పెంచరు.

మరి ఎక్కడుంది అసలు సమస్య అంటే…..

సమాజంలో ఉంది. ఇప్పటితరం పిల్లలకు సెక్స్ అనే పదం చాలా కామన్ అయిపోయింది. నెట్ సెంటర్ లలో విచ్చలవిడిగా బ్లూ ఫిల్మ్ వీడియోస్ చాలా తక్కువ ధరకు మొబైల్ లో ఎక్కించేస్తారు. వయసుతో తేడా లేకుండా పిల్లలు కూడా వాటిని చూస్తారు. ఒక తండ్రి తన మొబైల్ లో బ్లూ ఫిలిమ్స్ పెట్టుకుంటే కొడుకు ఏదో అవసరానికి మొబైల్ తీసుకుని పొరపాటున వాటిని ఓపెన్ చేయచ్చు, ఒక ఉపాధ్యాయుడు పిల్లలను పనికిమాలిన విషయాలకు ఉపయోగించుకుంటే తద్వారా ఆ విద్యార్థి పెద్దవుతూ పనికిమాలినవాడిగానే ఎదుగుతాడు. ఒకచోట దారుణం జరుగుతూ ఉన్నపుడు ఎవరూ స్పందించకుండా మాకెందుకు లెమ్మని ఉంటే, అక్కడున్న ఏ పిల్లవాడో ఒక బాధ్యతారహితమైన వాడిగా రూపాంతరం చెందవచ్చు. ఒకమనిషి ఒక పెద్ద తప్పు చేసాడు అంటే దానికి మూలమైన విత్తనం ఎక్కడో ఎప్పుడో ముందే పడింది అని అర్థం. 90% ఆ విత్తనం సమాజం నుండి రాలిపడినదే అని అర్థమవుతుంది కూడా. ఎందుకంటే ఎదిగే పిల్లల మీద కుటుంబంతో పాటు  సమాజం ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది.

ఇప్పుడేం చేయాలి??

ప్రతిసారి ఏదో జరిగిపోయాక ఆవేశంతో ఊగిపోవడం, తప్పు చేసినవాళ్లను శిక్షించాలని డిమాండ్ చేయడం, కొవ్వొత్తుల ర్యాలీలు, నిరసన ఉద్యమాలు వంటివి చేసెబదులు  ఎవరికి సాధ్యమైనంత మేరకు వారి చుట్టూ వాతావరణాన్ని కాస్త మార్చగలిగేలా ముందగుడు వేయాలి.

ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?? ప్రతి తల్లిదండ్రి ఇది జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. పిల్లలు తల్లిదండ్రులను గమనిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు ఇష్టమొచ్చినట్టు ఉండి, పిల్లలను సరైన  దారిలో ఉండమంటే అది జరగదు. అక్కడే పిల్లల్లో విరుద్ధ భావాలు మొదలవుతాయి.

పిల్లలు ఏమి చేస్తున్నారు అనే విషయం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. స్నేహితులను, ఉపాధ్యాయులను కలుస్తూ వారితో మాట్లాడుతూ పిల్లల గురించి తెలుసుకుంటూ ఉండాలి.

పిల్లలతో స్నేహంగా ఉండాలి. నిజానికి పిల్లలతో తల్లిదండ్రులమనే అధికారంతో కంటే స్నేహితుల్లా కలిసిపోయి మాట్లాడుతూ ఉంటే బయట స్నేహాలకు అంత తొందరగా లొంగిపోరు పిల్లలు. 

"మగపిల్లాడు వాడికేం దర్జాగా బతుకుతాడు. వాడి గురించి అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు" ఇది చాలామంది తల్లిదండ్రుల అభిప్రాయం. సరిగ్గా ఈ అభిప్రాయమే ఆ పిల్లలు దారితప్పడానికి కారణం అవుతోంది. 

మగవాళ్ళు తమ ఇంట్లో ఉన్న మహిళకు గౌరవం ఇస్తూ ఆ మహిళ అభిప్రాయాలకు స్వేచ్ఛ ఇస్తూ, వారిని గుర్తిస్తూ ఉన్నట్లయితే తప్పకుండా బయట సమాజంలో స్త్రీల పట్ల కూడా గౌరవం కలిగివుంటారు. కాబట్టి ఇంటి నుండి మొదలవ్వాలిది.

ఇక సమాజంలో జరుగుతున్నవాటిని నిర్మూలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలావరకు ఘోరాలు మద్యం మత్తులోనూ, బ్లూ ఫిల్మ్ లు, రొమాంటిక్ వీడియో లు చూడటం ద్వారావచ్చే ఉద్రేకాన్ని ఆపుకోలేక చేస్తున్నవే. వీటిని కట్టడి చేయాల్సిన అవసరం సమాజంలో అందరి మీద ఉంది.

మీ చుట్టూ ఉన్న నెట్ సెంటర్లు, మీ ఇంట్లో ఉన్న మొబైల్ హిస్టరీ వంటివి గమనిస్తూ ఉండాలి.

పిల్లలకు చిన్నప్పటి నుండి పుస్తక పఠనం, క్రమశిక్షణ అలవాటు చేయాలి

పిల్లల దృష్టిలో జీవితాన్ని గొప్పగా వర్ణించాలి. ఆ దిశగా వాళ్ళను నడిపించాలి. 

ఎప్పుడూ చట్టాన్ని, ధర్మాన్ని, ప్రభుత్వాన్ని నిందించకుండా మీ వంతు ఏమి చేస్తున్నారో ఆలోచించుకుని చూడండి. అలాంటపుడే సమాజంలో జరుగుతున్నవాటిని కొంత అయినా కట్టడి చేయగలం. మార్పు మనతోనే ప్రారంభం అవ్వాలి కదా!!

◆ వెంకటేష్ పువ్వాడ