ఎమోషన్స్ ని ఎడిట్ చేసుకుంటే మంచిది

మనుషులమండి మానులం కాదు. అసలు తొణకకుండా ఎలాంటి భావాలు బయట పెట్టకుండా ఉండలేం. మనుషుల్లో కలిగే సహాజ స్పందనలు, ప్రతిస్పందనలను ఎమోషన్స్ అని పిలుచుకుంటాం. అయితే నేటి కాలంలో చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్యలలో ఈ ఎమోషన్స్ కూడా ఒక భాగంగా చేరిపోయాయి. 

నవ్వొస్తుంది నవ్వేలేం, ఎందుకంటే ఎవరో ఏదో అనుకుంటారని

ఏడుపోస్తుంది ఏడవలేం, ఎందుకంటే సమాజం ఏడ్చేవాళ్లను ఇంకా ఏడిపిస్తుందని

కోపం, బాధ, ఆవేశం, ఈర్ష్య, అసూయ, పొంగుకొచ్చే దుఃఖం ఇవన్నీ ఎమోషన్స్ లో భాగమే. అయితే మనుషులు కోపాన్ని, బాధను, ఆవేశాన్ని చాలా తొందరగా బయటకు ఎక్స్ప్రెస్ చేస్తారు. దీనివల్ల చాలా తొందరగా నష్టం జరిగిపోతుంది. ముఖ్యంగా మానవసంబంధాలు చాలా దెబ్బతింటాయి. క్షణాలు నిమిషాల్లో జరిగిపోయే ఆ బీభత్సం వల్ల కొన్ని బంధాలు తెగిపోవచ్చు, మరికొన్ని బుజ్జగింపులు ద్వారా తిరిగి పెనవేసుకున్నా ముందున్నంత ఆప్యాయత ఉండకపోవచ్చు.

అసలు ఎంత తొందరగా కలుస్తున్నాయో అంతే తొందరగా తెగిపోతున్నాయి ఈమధ్య కాలంలో బంధాలు. కారణాలు బోలెడు. అభిప్రాయాలు కలవకపోవడం, తమకు కాకుండా మరొకరికి ప్రాధాన్యత ఇవ్వడం, తాము ఎంతో ఆశ పడిన సందర్భం విషయంలో సరైన స్పందన రాకపోవడం. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా ఎన్నో సందర్భాలు, ఎన్నో సంఘటనలు వాటి తాలూకూ మనిషి స్పందనలు, ప్రతిస్పందనలు మాత్రం ఎమోషన్స్ గా మారిపోయి మనిషిలో ఉన్న ప్రశాంతతను అగ్గిపుల్లతో కాల్చినట్టు ఉండదూ. 

ఎందుకీ ఎమోషన్స్

ప్రతి ఎమోషన్ ఎక్కడ ఎలా ఉద్భవిస్తుంది అంటే ఎప్పుడైతే మనిషి దేనిమీద అయినా ఎక్ప్పెక్టేషన్స్ పెట్టుకున్నపుడు. తరువాత కారణం ఆశించినపుడు. ఆ తరువాత కారణం తాను ప్రత్యేకం అనే భావం మనసులో పెట్టుకుని అదే విధంగా అందరూ చూడాలని అనుకోవడం. మనుషుల ప్రశాంతతను చంపే పెద్ద కారణాలు ఇవే. చాలామంది విషయంలో ఇవి ప్రాథమికంగా ఉంటాయి. ఇవి కాకుండా చాలా సహజమైన విషయాలు కూడా ఉంటాయి. చేయాల్సిన పనులు వేళకు చేయలేకపోవడం, కలవాల్సిన వాళ్ళు కలవకుండా వెళ్లిపోవడం, తమకు చెప్పకుండా ఇంట్లో వాళ్ళు ఏదో చేసారని, తమకు తగినంత ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదని. ఇట్లా అన్నిటినీ బుర్ర మీద రుద్దుకోవడం వల్ల ఎమోషన్స్ కాక మరింకేం వస్తాయి.

ఎమోషన్ ఈజ్ ఎనిమి

నమ్మండి నమ్మకపొండి ఈ ఎమోషన్ అనేది మనిషి జీవితానికి పెద్ద బద్ధ శత్రువు. మనిషిని మెల్లిగా డిప్రెషన్ లోకి తీసుకెళ్లే భూతం ఇదే. మానసిక ఆరోగ్యాన్ని, శారీరక ఆరోగ్యాన్ని పాడుచేసి, జీవితం మీద చాలా ఘోరమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఎంతగా అంటే జీవితం మొత్తం తలకిందులు అయ్యేలా. ఆ తరువాత జీవితాన్ని తిరిగి గాడిలో పెట్టుకోవడం ఎంతో కష్టతరమైన పని. 

ఎలా అధిగమించాలి??

భూతం అనుకుంటే భూతం, కాదు అదేదో పొగ అని అనుకుని నోటితో ఊదేస్తే మటుమాయం. ఇదంతా కూడా మనిషి మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. ఎంతో గొప్ప పరిపక్వత కలిగిన వాళ్ళు కూడా ఒకోసారి కొన్ని విషయాల పట్ల బలహీనులుగా ఉంటారు. బలహీనతను బలంగా మార్చుకున్నపుడే మనిషి నిన్నటి కంటే ఈరోజు, ఈరోజు కంటే రేపు శక్తివంతంగా తయారు అవుతాడు. ఈ ఎమోషన్స్ ను అధిగమించాలంటే మొదట చేయవలసింది ఇతర విషయాలకు అతిగా స్పందించకూడదు. కేవలం కాస్తాడటం, ఏదైనా వందశాతం పూర్తి శ్రద్ధ పెట్టి చేయడం ఇవి మాత్రమే మన చేతుల్లో ఉంటాయి. కాబట్టి అన్ని మనసుకు తీసుకోవడం ఆపేయాలి.

ఇక స్నేహితులు,  కొలీగ్స్, ఇతరులు వీళ్ళందరూ కేవలం తెలిసిన వాళ్ళు మాత్రమే. వీళ్ళలో స్నేహితులతో బాండింగ్ ఎక్కువగానే ఉంటుంది కానీ వల్ల నుండి కూడా ఆశించడం అనేది మానుకోవాలి. దీనివల్ల స్నేహితులు అవాయిడ్ చేస్తున్నారనో, ఇతరులు తక్కువ చేస్తున్నారనో ఫీలవ్వాల్సిన  సందర్భం రాదు. 

కేవలం తమ పని తాము చేసుకుంటూ పోవడమే పెద్ద పరిష్కారం. ఇతరుల  విషయాలు ఏవీ మనసుకు తీసుకోకుండా ఉంటే ఎమోషన్స్ ను దూరంగా పెట్టేయచ్చు.

ఒక్కమాట మాత్రం నిజం. ఎమోషన్స్ ను పెంచుకోకండి. టాబ్లెట్స్ వేసుకోగానే మోషన్స్ తగ్గిపోయినంత సులువు కాదు వాటి తాలూకూ డిప్రెస్ భూతాన్ని తగ్గించడం.

◆ వెంకటేష్ పువ్వాడ