ఉత్తరాంధ్రలో బాబుకు బ్రహ్మరథం.. జగన్ కు చుక్కలే!
posted on May 5, 2022 10:21AM
త్తరాంధ్రలో తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు జనం బ్రహ్మరథం పట్టారు. బాదుడే బాదుడు నిరసనలో పాల్లొనేందుకు శ్రీకాకుళం జిల్లా దళ్లవలసకు వెళ్లేందుకు విశాఖ విమానాశ్రయంలో దిగింది మొదలు చంద్రబాబుకు జనం నీరాజనం పలికారు. సీఎం..సీఎం అంటూ నినాదాలు చేయడం ద్వారా ప్రస్తుతం రాష్ట్రంలో సర్కార్ లేదన్న తమ భావనను ఎలుగెత్తారు. గత ఎన్నికలలో ఎక్కడైతే జగన్ దాదాపు క్లీన్ స్వీప్ చేసినంత పని చేసిందో అక్కడే జగన్ కు జనం నీరాజనం పలకడం గమనార్హం. ఈ పర్యటనలో బాబుకు దక్కిన ఘనస్వాగతం చూస్తే..జగన్ కు చుక్కలు కనిపించడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
స్వతహాగా తెలుగుదేశంకు గట్టి పట్టున్న ఉత్తరాంధ్రలో గత ఎన్నికలలో జగన్ హవా వీచింది. ఒక్క చాన్స్ అంటూ జనంలోకి వచ్చిన జగన్ ను అప్పుడు జనం విశ్వసించారు. అయితే మూడేళ్ల పాలన అనంతరం సీన్ రివర్స్ అయ్యింది. ఆ విషయం బాబు ఉత్తరాంధ్ర పర్యటనలో ప్రస్ఫుటంగా కనిపించింది. బాబు రాకతో తెలుగుదేశం శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తింది.
ఇక దళ్ల వలసలో బాదుడే బాదుడు నిరసన సభలో చంద్ర బాబు ప్రసంగానికి అడుగడుగునా స్పందన కనిపించింది.
వైసీపీ సర్కారు పెంచిన విద్యుత్, ఆర్టీసీ చార్జీలను నిరసిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో దళ్లవలసలో బుధవారం రాత్రి జరిగిన నిరసనలో నారా చంద్రబాబునాయుడు ప్రసంగించారు. జగన్ పాలన వల్ల రాష్ట్రం మరో శ్రీలంక అవడం ఖాయమంటూ విమర్శలు గుప్పించారు. జగన్ కు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు ఇప్పుడు జనం పశ్చాత్తాపపడుతున్నారి చంద్రబాబు చెప్పారు. అధికార బలం, అహంకారంతో జగన్ విర్రవీగుతున్నారని చంద్రబాబు తూర్పారపట్టారు. తన ఇంటిపై దాడి చేసిన వైసీపీ నేతలు.. అసెంబ్లీలోనే తనను అవమానపరచారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు తన కుటుంబ సభ్యులను కూడా అవమానపరచారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కంటే కూడా జగన్ డేంజర్ అని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు ప్రసంగానికి జనంలో మంచి స్పందన కనిపించింది. రాష్ట్రంలో నిత్యావసరాల ధరలను భారీగా పెంచారని, విద్యుత్ ఉండదు గానీ బిల్లులు మాత్రం బాదుడే బాదుడు మాదిరిగా ఉన్నాయన్న ఆయన ఆరోపణలకు జనం నుంచి మంచి స్పందన లభించింది.
జగన్ మాదిరిగా తాను దోచుకోనూలేదు, దాచుకోనూ లేదని చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మొత్తం మీద చంద్రబాబు బాదుడే బాదుడు నిరసన సభ విజయవంతం కావడం పట్ల తెలుగుదేశం శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. బాబు సభకు జన స్పందన చూస్తే తెలుగుదేశం దూకుడు జగన్ పార్టీనీ, ప్రభుత్వాన్నీ బెంబేతెత్తించడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు.