కోతల సర్కార్ బండారం..మంత్రి మీడియా సమావేశంలో బట్టబయలు!

ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ పరిస్థితిపై తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఒక్క మాట అన్నందుకే జగన్ కేబినెట్ ఉలిక్కి పడింది. ఏపీలో కరెంటు కోతలే లేవంటూ అడ్డంగా కోతలు కోసేసింది. మా రాష్ట్రానికి వస్తే విద్యుత్ వెలుగులతో రాష్ట్రం ఎలా వెలిగిపోతోందో చూపిస్తామంటూ సవాళ్లు విసిరింది.

తెలంగాణలో సింగరేణి ఉంది కనుక మీకు విద్యుత్ ఇబ్బందులు తలెత్తలేదనీ. ఏపీలో సింగరేణి లేకపోయినా..ఖర్చు ఎంతైనా భరించి బొగ్గు కొనుగోలు చేసి మరీ విద్యుత్ సరఫరా చేస్తున్నామనీ మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించేశారు. మరో మంత్రి బొత్స ఒక అడుగు ముందుకు వేసి ఏపీలో కరెంటు కోతలా, నిజానికి హైదరాబాద్ లోనే కరెంటు పరిస్థితి అధ్వానంగా ఉందని ఎదురు ఆరోపణ చేశారు. అక్కడితో ఆగకుండా, తెలంగాణలో కరెంటు కోతల గురించి నా కెవరూ చెప్పలేదనీ, తానే స్వయంగా అనుభవించాననీ  ముక్తాయించారు. ఆ మధ్య హైదరాబాద్ లో ఒక రోజు ఉన్నాననీ, కరెంటు లేక జనరేటర్ పెట్టుకోవలసి వచ్చిందనీ నమ్మ బలికారు. అయితే బొత్స చెప్పినా, పెద్దరెడ్డి బుకాయించినా, రోజా సవాళ్లు విసిరినా ఏపీలో వాస్తవ పరిస్థితి జనానికి తెలియంది కాదు. 

ఇక మంత్రి కాకాణి సచివాలంయలో నిర్వహించిన విలేకరుల సమావేశంలోనే విద్యుత్ కట్ అయ్యింది. కోతలు లేరి రాష్ట్రం అంటూ మంత్రులు కోసిన కోతల బండారం ఈ సంఘటనతో బయటపడింది. ఐరాస నేతృత్వంలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎఒ) అవార్డుకు ఆర్బీకేలు నామినేట్ అయ్యాయని ఘనంగా చాటేందుకు వ్యవసాయ మంత్రి కాకాణి సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోనే విద్యుత్ కట్ అయ్యి ప్రభుత్వ బండారాన్ని బట్టబయలు చేసింది.

కోతలు లేని రాష్ట్రం అంటూ జగన్ సేన చేసిన బుకాయింపుల బాగోతం ఈ ఒక్క సంఘటనతో బట్టబయలైంది. వాస్తవాన్ని అంగీకరించకుండా, జనం బాధల పట్టింపు లేకుండా బుకాయింపులై ఆధారపడితే బొక్కబోర్లా పడక తప్పదని కాకాణి మీడియా సమావేశంలో విద్యుత్ కోత అనుభవంలోనికి తెచ్చింది. 

విద్యుత్ విధానంలో జగన్ సర్కార్ అస్తవ్యస్థ విధానాల కారణంగానే ఆంధ్రప్రదేశ్ మిగులు విద్యుత్ స్థితి నుంచి అంధకారంలో కూరుకుపోయిన పరిస్థితి వచ్చింది. ఒప్పందాల సవరణ వద్దని నెత్తీ నోరూ బాదుకున్నా జగన్ వినని ఫలితమే ఇదని విద్యుత్ రంగ నిపుణులు ఉదాహరణలతో సహా వివరిస్తున్నారు. ఇప్పటికైనా వట్టి మాటలు కట్టిపెట్టి విద్యుత్ పరిస్థితిని చక్కదిద్దే చర్యలు తీసుకోవాలని జగన్ కు హితవు చెబుతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu