అంతా జగన్మాయ..వాగ్దానాలే తప్ప అమలు ఉండదు!

విశ్వసనీయత గురించి అవకాశం దొరికినప్పుడల్లా గప్పాలు కొట్టుకునే జగన్.. ప్రభుత్వం ఆ విశ్వసనీయతను నిలబెట్టుకునే విషయంలో ఘోరంగా ఫెయిల్ అవుతోంది. ప్రభుత్వోద్యోులకు ఇచ్చిన హామీల విషయంలో జగన్ సర్కార్ మాట తప్పడమే కాదు, మోసం చేసిందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. పీఆర్సీ కోసం ఆందోళనబాట పట్టిన ఉద్యోగులను సమ్మె విరమింప చేయడానికి జగన్ సర్కార్ పలు హామీలు ఇచ్చింది. పలు ఒప్పందాలు చేసుకుంది. సీపీఎస్ రద్దు ఓప్పందం వాటిలో ఒకటి. ఇప్పుడు ఆ విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి జీపీఎస్ కు అంగీకరించాలంటూ ఉద్యోగులపై ఒత్తిడి తెస్తున్నది. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు ఒప్పందం మేరకు కనీసం డజను జీవోలు రావాల్సి ఉంది. ఇప్పుడు జగన్ సర్కార్ వాటి ఊసే ఎత్తడం లేదు. హామీలు ఇచ్చేయడం, ఆహా, ఓహో అని భుజాలు చరిచేసుకోవడం, ఆ తరువాత వాటి ఊసే ఎత్తకపోవడం అన్నది జగన్ కు 2019 ఎన్నికలకు ముందు నుంచీ అలవాటుగా మారిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో అధికారంలోకి రావడమే ఏకైక లక్ష్యంగా, అది సాధించడానికి హామీలే అలంబనగా భావించి ఎడాపెడా వాగ్దానాలు గుప్పించేశారు.

తీరా అధికారంలోకి వచ్చిన తరువాత వాటి ఊసే ఎత్తడం లేదు. ఇక అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆందోళన బాట పట్టిన ఉద్యోగులను సమ్మె విరమింపచేయడమే లక్ష్యంగా చర్చల పేరు చెప్పి ఇది చేస్తాం.. అది చేస్తాం అని నమ్మబలికి, ఉద్యోగులు సమ్మె విరమించిన అనంతరం వాటి మాటే ఎత్తడం లేదు. పీఆర్సీ కోసం ఆందోళన చేపట్టిన ఉద్యోగులకు దక్కినవి అంతంత మాత్రం ప్రయోజనాలే అయినా వాటికి సంబంధించి జీవోలు నెలలు గడుస్తున్నా విడుదల కాలేదు. సాధించుకున్న ప్రయోజనాల ఫలితాలు ఇప్పటికీ ఉద్యోగులకు అందడం లేదు. పీఆర్సీని కేంద్రం మాదిరిగా పదేళ్లకు మారుస్తూ జారీ చేసిన జీవోను ఎప్పటిలా ఐదేళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేలా ఉద్యోగ సంఘాలతో చర్చలలో అంగీకరించిన జగన్ సర్కార్..అందుకు సంబధించిన జీవోను వారం రోజుల్లో విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. ఈ హామీ ఇచ్చి మూడు నెలలు గడుస్తున్నా జీవో అతీగతీ లేదు. 

 అలాగే ఐఆర్‌ రికవరీ చేయబోమని హామీ ఇచ్చారు.అందుకు సంబంధించిన జీవో విడుదల కాలేదు. ఆర్టీసీ పీటీడీ ఉద్యోగులకు ప్రత్యేక పీఆర్సీ ఇస్తామన్న హామీకి అతీగతీ లేకుండా పోయింది. కాంట్రాక్టు, ఎన్‌ఎంఆర్‌ల సమస్యల పరిష్కారానికి ఇచ్చిన హామీనీ నెరవేర్చలేదు.  మట్టి ఖర్చులు రూ.26 వేలకు పెంచుతామంటూ ఇచ్చిన హామీ కూడా నెరవేరలేదు.  ఉద్యోగులతో చర్చల సందర్శంగా మొత్తం 17 అంశాలపై ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో అగ్రిమెంటు చేసుకుంది. వాటిలో రెండు,మూడు మినహా మిగిలినవేవీ అమలుకు నోచుకోవడం లేదు.  

అప్పటికప్పుడు సమ్మెను విరమించడానికి ప్రభుత్వం ఈ హామీలను ఇచ్చింది. ఇవన్నీ గతంలో ఉన్న సౌకర్యాలే . ప్రభుత్వం వాటిని తొలగించింది. తీసేస్తామని చెప్పి సమ్మె విరమింప చేసింది. కానీ జీవోలు మాత్రం ఇవ్వడం లేదు. సర్కార్ నమ్మకద్రోహానికి పాల్పడిందన్న భావన ఉద్యోగులలో వ్యక్తమౌతున్నది. మోసకారి సర్కార్ కు ఎన్నికలలో గుణపాఠం చెబుతామంటూ ఉద్యోగులు రగిలిపోతున్నారు. మాట ఇవ్వడం, తప్పడం జగన్ సర్కార్ కు రివాజుగా మారిందన్న విమర్శలు ఉద్యోగుల నుంచి వినిపిస్తున్నాయి.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu