అంత నోటి దూల అవసరమా?
posted on Oct 22, 2012 12:24PM

చంద్రబాబు వస్తున్నా మీకోసం యాత్రకి పోటీగా జగన్ పక్షాన సోదరి షర్మిలకూడా పాదయాత్రని మొదలుపెట్టారు. చంద్రబాబుకి జనంలో కనిపిస్తున్న విపరీతమైన స్పందనని చూసి ఖంగుతిన్న వైకాపా వర్గాలు తమ పార్టీకి జనంలో ఫాలోయింగ్ ఎక్కడ తగ్గుతుందేమో అన్న భయంతో వెంటనే షర్మిలని రంగంలోకి దింపారు. వై.ఎస్ మీద ఉన్న అభిమానంతో జనం షర్మిలకుకూడా పోయినచోటల్లా బ్రహ్మరథం పడుతున్నారు.. ఎవరి సత్తా ఏంటో చూపించుకునే అవకాశం అటు చంద్రబాబుకి, ఇటు జగన్ వర్గానికీ పాదయాత్రలవల్ల కలుగుతోంది. ఇంతవరకూ బానే ఉంది కానీ.. ద్వితీయ శ్రేణిలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు షర్మిలమీద వ్యక్తిగత దూషణలకు దిగడం జనానికి ఏమాత్రం నచ్చడంలేదు. షర్మిల ఓ కాపురాన్ని కూల్చారంటూ తెలుగుమహిళ అధ్యక్షురాలు శోభా హైమావతి చేసిన వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో దుమారాన్ని రేపుతున్నాయ్. అనిల్ తో పెళ్లి షర్మిల వ్యక్తిగత వ్యవహారం.. రాజకీయంగా దెబ్బకొట్టడానికి వ్యక్తిగత వ్యవహారాలు, అంశాల్ని ఎంపికచేసుకుని దాడిచేసే సంస్కృతి తెలుగుదేశం పార్టీలో మొదట్నుంచీ లేదు. ఇప్పుడుకూడా శోభా హైమావతి మాట్లాడేతీరు, దుందుడుకు వైఖరి.. ఏదో చేసేసి అధినాయకుడైన చంద్రబాబు దగ్గర మంచి మార్కులు కొట్టేయాలన్న పద్ధతిలో ఉంది తప్ప, చంద్రబాబు ఇలాంటి చిల్లర రాజకీయాన్ని ప్రోత్సహిస్తారనుకోవడానికి వీల్లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వైకాపా వర్గాలుకూడా శోభా హైమావతి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తున్నాయ్. అసలు ఆమె ఎస్టీనే కాదని నిరూపించేందుకు కావాల్సిన రుజువులు సాక్ష్యాల్ని పక్కాగా సేకరించి, కడిగిపారేసే ప్రయత్నాల్ని వైఎస్సార్ సీపీ నేతలు ముమ్మరం చేసినట్టు సమాచారం.