రాజ్యసభ సీటిస్తే మాకేం ఇస్తారు.. ముఖం మీదే అడగనున్న చంద్రబాబు

 


రాజ్యసభలో 57 మంది అభ్యర్దుల పదవికాలం పూర్తి కావడంతో సీట్లు ఖాళీ అవనున్న సంగతి తెలిసిందే. ఈ 57 మంది అభ్యర్దులలో నలుగురు అభ్యర్ధులు ఏపీ నుండి ఉండగా.. ఇద్దరు అభ్యర్ధులు తెలంగాణ నుండి ఉన్నారు. అయితే ఇప్పుడు ఏపీ నుండి నాలుగు స్థానాలకు ఎవరికి చోటు దక్కుతుందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బీజేపీ టీడీపీ మిత్రపక్షం కాబట్టి.. ఇందులో ఒక స్థానం తమకు ఇవ్వాలని బీజేపీ టీడీపీని కోరనున్నట్టు తెలుస్తోంది. టీడీపీకి ఏపీ కోటా నుండి మూడు సీట్లు దక్కనున్న నేపథ్యంలో.. ఈసారి కూడా సుజనాకు ఎలాంటి ఇబ్బంది లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఏపీ కోటా నుండి నిర్మలాసీతారామన్ కు గతంలో టీడీపీ ఆమెను రాజ్యసభకు పంపింది. ఇక ఇప్పుడు కూడా ఆమెను ఏపీ నుండే రాజ్యసభకు పంపించాలని బీజేపీ చూస్తుంది.

 

అయితే ప్రత్యేక హోదా విషయంలో ఇప్పుడు రెండు పార్టీల మధ్య అంత సఖ్యత లేదు. దీంతో ఈసారి రాజ్యసభ స్థానంపై బీజేపీని డిఫెన్స్ లో పడేసే ప్రయత్నం చేశారు చంద్రబాబు. ఇక దీనిపై అసోం సీఎంగా సర్బానంద సోనోవాల్ పదవీ ప్రమాణం చేయనున్న కార్యక్రమానికి వెళుతున్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గువాహటిలో కీలక చర్చలు జరపనున్నట్లు సమాచారం. అందుకే నిర్మలను తమ కోటా కింద రాజ్యసభకు పంపితే తమకేమిస్తారని ఆయన అమిత్ షా ను ముఖం మీదే అడిగేయాలని చూస్తున్నట్టు సమాచారం. మరి ఏం జరుగుతుందో.. చూడాలి.