సింగపూర్‌లో చంద్రబాబుకు ఘన స్వాగతం

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర నూతన రాజధానికి సంబంధించిన ఆలోచనలు పంచుకోవడంతోపాటు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి పెట్టుబడులను కూడా ఆహ్వానించే ఉద్దేశంతో సింగపూర్ పర్యటనలో వున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో చంద్రబాబు వెంట పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు కూడా వున్నారు. చంద్రబాబు నాయుడు బృందం సింగపూర్‌కి చేరుకున్నప్పుడు అక్కడ వారికి ఘన స్వాగతం లభించింది. సింగపూర్‌లో స్థిరపడిన తెలుగువారు ఏర్పాటు చేసుకున్న ‘సింగపూరు తెలుగు సమాజం’ సంస్థ ప్రతినిధులు భారీ సంఖ్యలో సింగపూర్ విమానాశ్రయంలో చంద్రబాబుకు స్వాగతం పలికారు. తనకు సింగపూర్‌లో స్వాగతం పలికిన తెలుగువారిని చూసి చంద్రబాబు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు సింగపూర్ తెలుగు సమాజం ప్రతినిధులతో ముచ్చటించారు. ఎలాంటి ప్రాంతీయ విభేదాలు లేకుండా సింగపూర్‌లోని తెలుగువారందరూ కలసికట్టుగా వుండి, ఒక మంచి అసోసియేషన్‌ని ఏర్పాటు చేసుకున్నందుకు సింగపూర్ తెలుగు సమాజం వారిని ఆయన ఈ సందర్భంగా అభినందించినట్టు తెలుస్తోంది. అలాగే సింగపూర్ తెలుగు సమాజం బుధవారం నాడు ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పాల్గొనడానికి చంద్రబాబు నాయుడు అంగీకరించారు. ఈ సందర్భంగా సింగపూర్ తెలుగువారితో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించడానికి కూడా చంద్రబాబు నాయుడు అంగీకరించారు. సింగపూర్‌లో చంద్రబాబు నాయుడికి స్వాగతం పలికిన వారిలో సింగపూర్ తెలుగు సమాజానికి చెందిన దుర్గా ప్రసాద్ కేసాని (అధ్యక్షుడు), భాస్కర రామయ్య చౌదరి, తెలిదేవర ఉమామహేశ్వరరావు, వీరశంకర్, రంగా రవికుమార్, శ్రీధర్ బోయపాటి, మేర్ల సాంబశివరావు, చీర్ల సత్యనారాయణ రెడ్డి, దేవినేని వీరేంద్ర నాథ్, సుధాకర్ జొన్నాదుల తదితరులున్నారు.