వైసీపీ ఎమ్మెల్యే వివరణ ఇవ్వాలి.. హైకోర్టు

 

పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, ఆమె భర్త కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి దేవీ ప్రసాద్‌ఎన్నికల నియమావళి ఉల్లంఘన గురించి తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య వేసిన పిటిషన్ హైకోర్టు డివిజనల్ బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది. ఇటీవలి ఎన్నికలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయిన దేవీ ప్రసాద్ తన భార్య అయిన ఉప్పులేటి కల్పనకు ప్రచారం చేశారన్నది ఆరోపణ. దీనిమీద హైకోర్టు చీఫ్ జస్టిస్ కల్యాణ్ జ్యోతి సేన్ గుప్తా, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్ నేతృత్వంలోని హైకోర్టు డివిజనల్ బెంచ్ స్పందించింది. ఈ అంశం మీద రెండు వారాల్లో పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన వివరణ ఇవ్వాలని హైకోర్టు డివిజనల్ బెంచ్ ఆదేశించింది. ఇదిలా వుండగా, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు ఆదాయ పన్నుశాఖ కమిషనర్‌ (అప్పీల్స్‌) ఉప్పులేటి దేవీప్రసాద్‌‌ని భువనేశ్వర్‌‌కి బదిలీ చేశారు. అయితే ఆయన కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌కు అప్పీల్ చేసుకోవడంతో బదిలీని మూడు వారాలపాటు నిలుపుదల చేస్తూ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌ (క్యాట్‌) మధ్యంతర ఆదేశాలు జారీచేసింది.