ఆంద్రప్రదేశ్ లో రెండు విభిన్న పరిస్థితులు
posted on Oct 7, 2015 1:23PM
.jpg)
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పడు రెండు పూర్తి విభిన్నమయిన విచిత్ర పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నెల 22న రాజధాని అమరావతి శంఖుస్థాపనను చాలా అట్టహాసంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా సన్నాహాలు చేస్తుంటే, మరోవైపు ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ జగన్మోహన్ రెడ్డి ఈరోజు నుండి గుంటూరులో నిరవధిక నిరాహార దీక్షకు కూర్చొంటున్నారు. ఒకవైపు రాజధాని శంఖుస్థాపన కార్యక్రమాన్ని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఒక పండుగలా నిర్వహించడానికి చకచకా ఏర్పాట్లు చేసుకొనిపోతుంటే, రాష్ట్ర విభజన తరువాత అన్ని విధాలా దెబ్బతిన్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రాష్ట్ర పరిస్థితి ఇంకా దిగజారిపోతుందని వైకాపా వాదిస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం ఈ శంఖు స్థాపన కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తుంచి ఏర్పాట్లు చేస్తున్నట్లే, జగన్ కూడా తన నిరవధిక నిరాహార దీక్షకు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి నిర్వహిస్తున్నారు. తెదేపా శ్రేణులలో ఉత్సాహం ఉరకలు వేస్తుంటే, వైకాపా శ్రేణుల్లో యుద్దోత్సాహం కనిపిస్తోంది. తెదేపా రాష్ట్రంలో పండుగ వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తుంటే, వైకాపా రాష్ట్రంలో యుద్దవాతవరణం సృష్టించే ప్రయత్నం చేస్తోంది. ఈ రెండు ప్రధాన పార్టీలు సృష్టిస్తున్న పూర్తి విభిన్నమయిన ఈ పరిస్థితులను చూసి వాటిలో ఎవరి వాదనలు, విధానాలు సరయినవో తేల్చుకోవాల్సిన బాధ్యత మాత్రం రాష్ట్ర ప్రజలదే.