మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రద్దు!?

గత రెండు  దశాబ్దాలుగా అమల్లో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం  స్థానంలో  కేంద్రం  కొత్త చట్టాన్ని తీసుకురానుంది.  ఈ చట్టంలో మహాత్మాగాంధీ పేరును తొలగించి వికసిత భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్)  బిల్లు, 2025 ను లోక్ సభలో ప్రవేశ పెట్టనుంది.  వికసిత భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా గ్రామీణ ఉపాధి, అభివృద్ధి కార్యక్రమాలను తీర్చిదిద్దడమే ఈ కొత్త చట్టం ముఖ్య ఉద్దేశమని కేంద్రం చెబుతోంది. 

ఉపాధి హామీ చట్టం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడినప్పటికీ, దాని అమలులో పలు లోపాలు ఉన్నాయనీ, ముఖ్యంగా నిధుల దుర్వినియోగం, డిజిటల్ హాజరును పక్కదారి పట్టించడం, చేపట్టిన పనులకు, పెట్టిన ఖర్చుకు పొంతన లేకపోవడం వంటి  లోపాల కారణంగా ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి మరింత పారదర్శకంగా,  కొత్త చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఏర్పడిందని కేంద్రం చెబుతోంది.   ప్రస్తుత ఉపాధి హామీ పథకం కింద ప్రతి గ్రామీణ కుటుంబానికి ఏడాదికి 100 రోజుల పని దినాలు కల్పిస్తుండగా, కొత్త బిల్లులో దీనిని 125 రోజులకు పెంచారు.  

అలాగే ప్రస్తుతం అమల్లో ఉన్న ఉపాధి హామీ చట్టం ( ప్రకారం, నైపుణ్యం లేని కార్మికుల వేతనాల ఖర్చును పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది. పనులకు అవసరమైన సామగ్రి ఖర్చులో 75 శాతం, నైపుణ్యం కలిగిన, పాక్షిక నైపుణ్యం ఉన్న కార్మికుల వేతనాల్లో 75శాతం కూడా కేంద్రమే భరిస్తున్నది. అయితే ఇప్పుడు ప్రతిపాదించిన కొత్త బిల్లులో  ఈ విషయంలోనూ మార్పులు తీసుకురానుంది.   సాధారణ రాష్ట్రాల్లో కూలీల వేతనాల చెల్లింపులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా 60:40 నిష్పత్తి ప్రత్యేక కేటగిరీ ప్రాంతాలకు ఇది 90:10గా ఉంటుంది. నిరుద్యోగ భృతి  రాష్ట్రాలే చెల్లించాల్సి ఉంటుంది 
మొత్తంగా కేంద్రం   గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, ఉత్పాదక ఆస్తులను సృష్టించడం, వలసలను తగ్గించడం వంటి లక్ష్యాలతో  కొత్త చట్టాన్ని తీసుకురానున్నట్లు చెబుతోంది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu