రేవంత్ రెడ్డితో  ఈటల రాజేందర్ డీల్? కేసీఆర్ టార్గెట్ రాజకీయం..

తెలంగాణ రాజకీయాల్లో కాక రాజేసిన హుజురాబాద్ ఉప ఎన్నికలో సంచలన విజయం సాధించి అధికార టీఆర్ఎస్ పార్టీకి దిమ్మతిరిగే షాకిచ్చారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. తనకు ఎదురులేదని భావించే సీఎం కేసీఆర్ కు కోలుకోలేని దెబ్బ కొట్టారు. హుజురాబాద్ ఫలితాన్ని గులాబీ బాస్ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారని చెబుతున్నారు. అయితే హుజురాబాద్ ఫలితం కాంగ్రెస్ లోనూ చిచ్చు రేపింది. రాజేందర్ గెలుపు కోసం రేవంత్ రెడ్డి సాయం చేశారని కొందరు పీసీసీ నేతలు హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం హుజురాబాద్ లో కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టారనే ఆరోపణలు రేవంత్ రెడ్డిపై వచ్చాయి. హుజురాబాద్ కాంగ్రెస్ పంచాయితీ ఢిల్లీ వరకు చేరింది. ఏఐసీసీ వార్ రూమ్ సమావేశంలో పీసీసీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందనే ప్రచారం జరిగింది. 

హుజురాబాద్ మంటలు కాంగ్రెస్ లో అలా ఉండగానే తాజాగా మరో ప్రచారం సాగుతోంది. స్థానిక సంస్థల కోటా శాసనమండలి ఎన్నికల్లోనూ ఈటల రాజేందర్ తో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రహస్య     ఒప్పందం చేసుకున్నారనే టాక్ నడుస్తోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఎలాగైనా షాకివ్వాలనుకుంటున్న ఈటల రాజేందర్ ప్రయత్నాలకు కాంగ్రెస్ సాయం చేస్తుందని అంటున్నారు. మొత్తం తొమ్మిది జిల్లాల పరిధిలోని 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. నాలుగు జిల్లాల పరిధిలోని ఆరు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన ఐదు జిల్లాల పరిధిలోని ఆరు స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో కరీంనగర్ లో 2, ఖమ్మం, నల్గొండ, మెదక్, ఆదిలాబాద్ లో ఒక్కో స్థానం ఉన్నాయి. 

అయితే ఆరు స్థానాలకు ఎన్నిక జరగనుండగా. రెండు స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తోంది కాంగ్రెస్. ఖమ్మం, మెదక్‌ జిల్లాల్లో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు ఉన్నారు.  దీంతో  మిగిలిన ఆరు చోట్ల ఇండిపెండెంట్లకు చాన్సివ్వాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. కరీంనగర్‌లో ఈటల రాజేందర్ మద్దతుతో మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఎమ్మెల్సీ బరిలో ఉన్నారు. ఆయన గెలుపు కోసం ఈటల తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రవీందర్ సింగ్ ను గెలిపించుకుని కేసీఆర్ మరో షాక్ ఇవ్వాలని చూస్తున్న ఈటల.. కాంగ్రెస్ మద్దతు కోరారని తెలుస్తోంది. కరీంనగర్ పై రేవంత్ రెడ్డితోనూ రాజేందర్ మాట్లాడారని అంటున్నారు. కేసీఆర్ ను ఓడించేందుకు రేవంత్ రెడ్డి కూడా సై అన్నారని అంటున్నారు. రేవంత్ రెడ్డి, రాజేందర్ సూచన మేరకే కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కలిసి రవీందర్ సింగ్ మద్దతు కోరారని చెబుతున్నారు. కరీంనగర్ లో ఈటల నిలబెట్టిన రవీందర్ సింగ్ కు కాంగ్రెస్ సపోర్ట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

ఆదిలాబాద్‌లో ఆదివాసీ నేతగా బరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థిని పుష్పారాణికి అధికారికంగానే కాంగ్రెస్‌ మద్దతిస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ మద్దతు ఇచ్చే అభ్యర్థికే బీజేపీ మద్దతు ఇస్తుందనే ప్రచారం జరుగుతోంది. నల్లగొండలో బరిలో ఉన్న ఆరుగురు స్వతంత్రుల్లో ఇద్దరు కాంగ్రెస్‌ జెడ్పీటీసీలే ఉన్నారు. దీంతో అక్కడ నిర్ణయాన్ని ఎంపీ కోమటిరెడ్డి  వెంకట్ రెడ్డి వదిలేశారు. ఎన్నికలు జరిగే నాటికి ప్రతి చోటా ఒక అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీ పక్షాన మద్దతు ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. తాము పోటీ చేస్తున్న చోట అయినా.. లేకపోతే ఇండిపెండెంట్లకు మద్దతు ఇచ్చి అయినా ఒకటి రెండు చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థుల్ని ఓడించాలన్న పట్టుదలతో కాంగ్రెస్ , బీజేపీ నేతలు ఉన్నారు. మొత్తంగా హుజురాబాద్ తరహాలోనే రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించేందుకు వ్యూహాలు రచిస్తున్నారనే టాక్ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.